సాక్షి ప్రతినిధి, విజయనగరం :భోగాపురంలో ప్రతిపాదిత ఎయిర్‌పోర్ట్ భూసమీకరణ విషయంలో ప్రభుత్వం మైండ్ గేమ్ ఆడుతోంది. రాజధాని విషయంలో రైతుల్ని మభ్యపెట్టి భూసమీకరణ చేసినట్టుగానే ఇక్కడా అదే సూత్రాన్ని అవలంబిస్తోంది. సానుకూల పరిస్థితుల్లేకపోయినా రైతు లు భూములిచ్చేస్తున్నారని ప్రచారం చేసి ఆ ప్రాంత రైతుల్లో గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఒక్కొక్కరూ అంగీకారం తెలుపుతున్నారంటూ...ఒకరిద్దర్ని తెరపైకి తీసుకొచ్చి భూసమీకరణ ప్రారంభమైందంటూ రైతుల్ని ఆలోచనలో పడేస్తోంది. ఉత్తరాంధ్ర మంత్రుల డెరైక్షన్‌లో స్థానిక ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు పావులు కదుపుతున్నారన్న విమర్శలొస్తున్నాయి. అంతా అంగీకారం తెలిపినప్పుడు మనం ఇవ్వకపోతే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందేమోననే అనుమానాల్ని రైతుల్లో అధికార వర్గాలు రేకెత్తిస్తున్నాయి. ఇదే వ్యూహాన్ని కొనసాగించి భూసమీకరణ పూర్తి చేయాలన్న లక్ష్యంతో అడుగులేస్తున్నాయి.
గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ కోసం భోగాపురం మండలంలో గల 16 రెవెన్యూ గ్రామాల్లో 15వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కింద సమీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అధికారుల్ని గ్రామాల్లోకి పంపించి ఎయిర్‌పోర్ట్ ఆవశ్యకతను, వచ్చినట్టయితే ప్రజలకొచ్చే ప్రయోజనాలను వివరించే ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఇంతవరకు ఏ ఒక్క గ్రామం ఎయిర్‌పోర్ట్‌ను స్వాగతించలేదు. ఆ గ్రామస్తులంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వ వైఖరిని దుయ్యబడుతున్నారు.
ఇంటలిలీజెన్స్ వర్గాల ద్వారా ఇక్కడి పరిస్థితుల్ని తెలుసుకున్న ప్రభుత్వం ...అధికార పార్టీ కీలక నేతల్ని రంగంలోకి దించితే తప్ప ఫలితం రాదని భావించింది. ఈ మేరకు కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు ఆధ్వర్యంలో భోగాపురం నియోజకవర్గ టీడీపీ నేతలతో సమావేశం నిర్వహించింది. కానీ సొంత పార్టీ నేతలు వ్యతిరేకించడంతో ప్రయోజనమివ్వని సమావేశంగా ముగిసింది. దీంతో ముఖ్యమంత్రి తన ప్లాన్ మార్చారు. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మిస్తే ఉత్తరాంధ్ర జిల్లాలకు ఉపయోగపడుతుందని, ఆ మూడు జిల్లాల మంత్రులు బాధ్యతగా తీసుకుని భూ సమీకరణ సక్సెస్ అయ్యేలా చూడాలని ఆదేశించారు. దీంతో ఉత్తరాంధ్ర పరిధిలో గల నలుగురు మంత్రులు రంగంలోకి దిగారు. లోపాయికారీ యత్నాలు ప్రారంభించారు.
భూసమీకరణ బాధ్యతల్ని భుజాన వేసుకున్న మంత్రులంతా స్థానిక ఎమ్మెల్యే సహకారంతో భోగాపురంలో సన్నిహితంగా ఉండే నేతలతో సంప్రదింపులు చేస్తున్నారు. కొందరు అంగీకార లేఖలిచ్చినట్టయితే మిగతా వారంతా దారికొచ్చేస్తారని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో విభజించు-పాలించు సూత్రాన్ని అమలు చేశారు. పెద్దగా భూముల్లేని ఒకరిద్దరు పార్టీ నాయకుల్ని బరిలోకి దించి, తాము అనుకూలమని ప్రకటనలు చేయించారు. దీంతో స్థానిక టీడీపీ నేతల మధ్య విభేదాలొచ్చాయి. రైతులంతా వ్యతిరేకిస్తుంటే అనుకూలమని ఎలా చెబుతారంటూ సానుకూలంగా ఉన్న నేతల్ని తోటి టీడీపీ నేతలు నిలదీశారు. ఇదెక్కడికి దారితీస్తుందో తెలియదుగాని వారి మధ్య విభేదాలు రాజుకున్నాయి. ఆ క్రమంలోనే ఇద్దరు అంగీకార లేఖలిచ్చారు. వారిద్దరూ అంగీకారం తెలపడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందనే చర్చ జరుగుతోంది. ఈ ఇద్దర్ని చూపించి రైతులంతా సానుకూలంగా ఉన్నారని, అంగీకార లేఖలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని గ్లోబెల్ ప్రచారానికి తెరలేపారు. భూములివ్వని వారంతా నష్టపోతారని, కొందరు వ్యతిరేకించినంత మాత్రాన ఎయిర్‌పోర్ట్ ఆగదని ప్రచారం ముమ్మరం చేశారు. అంతేకాకుండా రాజకీయంగా ఇబ్బంది పడతారని, అవకాశాలను కోల్పోతారని తమ పార్టీ నేతలకు బెదిరిస్తున్నారు.
రైతులతో... మైండ్ గేమ్
Published Fri, May 1 2015 4:55 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement