రైతుల భూముల్లో ఏర్పాటు చేసిన సోలార్ ప్లేట్లు
ఈ చిత్రంలోని రైతు ఎన్‌పీకుంటకు చెందిన మౌలాసాబ్(68). ఎన్‌పీకుంట పంచాయతీ పరిధిలో 10 ఎకరాల సాగుభూమి ఉండేది. అందులో బోరు వేసుకుని వేరుశనగతో పాటు పలు రకాల పంటలు పండించే వాడు. సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం మౌలాసాబ్ 10 ఎకరబ్ను చంద్రబాబు సర్కారు బలవంతంగా లాక్కుంది. మొత్తం భూమికి రూ.లక్ష మాత్రమే ఇస్తామని చెప్పినా.. చివరకు అది కూడా ఇవ్వలేదు. పరిహారం అందక..బతికే మార్గం కనిపించక కుటుంబపోషణకు అప్పులు చేశాడు. రుణదాత ఒత్తిడి పెరగడంతో ఇల్లు విక్రయించి కొన్ని తీర్చాడు. ఇక బతికేదారి లేక ఏడాది క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
సాక్షి, కదిరి : ఎన్‌పీకుంట మండల కేంద్రంలో రూ. 12,500 కోట్లతో దేశంలోనే పెద్ద సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. మొత్తం 1,500 మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి చేసే బాధ్యతను ఎన్‌టీపీసీ సంస్థకు అప్పగించారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎన్‌పీ కుంట పంచాయతీ పరిధిలో 2,079,38 ఎకరాలు, పి.కొత్తపల్లి పరిధిలో 5,094.87 ఎకరాలు కలిపి మొత్తంగా రెండు విడతల్లో 7,174.25 ఎకరాలను సేకరించారు. ఇందులో ప్రభుత్వ భూమి 4,581.84 ఎకరాలు, రైతు పట్టా భూమి 290.11 ఎకరాలు, అసైన్డ్ భూమి 2,302.30 ఎకరాలు ఉంది. ఇది కాకుండా మరో 1,840.77 ఎకరాల సాగుభూమిని సోలార్ ప్రాజెక్టు కోసం సర్కారు రైతుల నుంచి బలవంతంగా లాక్కుంది.
న్యాయంగా లేని పరిహారం
నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.40 లక్షలు నుంచి రూ. 50 లక్షలు దాకా ఇచ్చారు. కానీ ఎన్‌పీ కుంట రైతులకు మాత్రం ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. పట్టా భూమికి రూ.3 లక్షల నుంచి రూ.3.20 లక్షలు, అసైన్డ్ భూమికి రూ.2 లక్షల నుంచి రూ.2.10 లక్షలు చొప్పున మొత్తం 741 మంది రైతులకు రూ 44.44 కోట్లు చెల్లించింది. ఇంకా అసైన్డ్, పట్టా భూములు కోల్పోయిన 103 మంది రైతులకు రూ.6.91 కోట్లు చెల్లించాల్సి ఉంది. కోర్టు కేసులు, ఇతరత్రా కారణాలతో పరిహారం పెండింగ్‌లో ఉంది.
సాగురైతులు చేసుకున్న పాపమేంటి?
తరతరాలుగా అక్కడ భూములు సాగుచేసుకుంటూ తెలిసో, తెలియకో వివిధ కారణాల వల్ల పట్టాలు పొందని 1,156 మంది రైతుల భూములను సోలార్ ప్రాజెక్టు కోసం బలవంతంగా లాక్కున్నారు. అయితే ఆ రైతులకు మాత్రం ఇప్పటి దాకా ఒక్క రూపాయి కూడా పరిహారం చెల్లించలేదు. ఎకరాలతో సంబంధం లేకుండా సాగులో ఉన్న ప్రతి రైతుకూ రూ.లక్ష మాత్రమే చెల్లిస్తామని అధికారులు చెప్పారు. చివరకు అది కూడా ఇవ్వలేదు. ఈ జాబితాలో అనర్హులున్నారంటూ నాలుగు రెవెన్యూ బృందాలు విచారించి 1,156 మందిలో 736 మందిని అర్హులుగా తేల్చారు. ఆ తొలగించిన జాబితాలో నిజంగా సాగుచేసుకుంటున్న రైతులు కూడా ఉన్నారన్న కారణంగా నాలుగేళ్లుగా పరిహారం చెల్లించకుండా నిలిపివేశారు.
26న మరోసారి సమావేశం
కలెక్టర్ వీరపాండియన్ గత సోమవారం ‘మీకోసం’ కార్యక్రమంలో భాగంగా గాండ్లపెంటకు విచ్చేయగా...వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డా.పివి సిద్దారెడ్డితో పాటు ఇతర పార్టీల నాయకులు కలెక్టర్‌ను కలిసి సోలార్ బాధిత రైతులకు న్యాయం చేయాలని కోరారు. స్పందించిన కలెక్టర్... ఈ నెల 26న జాయింట్ కలెక్టర్ డిల్లీరావు ఆధ్వర్యంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేస్తామని, రైతులంతా సహకరించాలని కోరారు. ఈసారైనా తమకు న్యాయం జరిగేనా అని సాగురైతులు ఎదురు చూస్తున్నారు.
750 మెగావాట్ల ఉత్పత్తికి టెండర్లు ఖరాలు
రైతులందరికీ పరిహారం చెల్లించకముందే సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం రైతుల భూములను బలవంతంగా లాక్కున్నారు. టాటా కంపెనీ 100 మెగావాట్లు, స్టెర్లింగ్ అండ్ విల్సన్ కంపెనీ, ల్యాంకో, బీహెచ్‌ఈఎల్ కంపెనీలు 50 మెగావాట్లు చొప్పున మొత్తం 250 మెగావాట్ల విద్యుత్‌ను ఇప్పటికే ఉత్పత్తి చేస్తున్నాయి. మరో 750 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ఇప్పటికే టెండర్లు పిలిచారు. స్ప్రింగ్ ఎనర్జీ ప్రై.లిమిటెడ్ కంపెనీ, సాఫ్ట్‌బ్యాండ్ ఎనర్జీ ప్రై.లిమిటెడ్, అయాన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు 250 మెగావాట్లు చొప్పున 750 మెగావాట్ల విద్యుదుత్పత్తి టెండర్లను దక్కించుకున్నాయి. జూలై 12వ తేదీ నుంచి ఈ రెండో విడత పనులు ప్రారంభించాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment