డబ్బూ, పలుకుబడే పెట్టుబడి !
వర్సిటీ పాలకమండలి సభ్యులైపోయారు
ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ప్రభుత్వ పెద్దలు
నిబంధనలను, కొలీజియం సిఫారసులను తుంగలో తొక్కిన వైనం
మాజీ మంత్రి భర్తకు, ఎమ్మెల్యే తమ్ముడికి, మరో ఎమ్మెల్యే కొడుక్కి స్థానం
‘సాక్షి’ కథనం, గవర్నర్ స్పందనతో వెలుగులోకి వాస్తవాలు
సాక్షి, హైదరాబాద్: రాజకీయ వారసత్వం, పలుకుబడి, డబ్బు పెట్టగలిగే స్తోమత ఉంటే చాలు.. విశ్వవిద్యాలయాల పాలకమండలి (ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్) సభ్యులు అయిపోవచ్చని ప్రభుత్వ పెద్దలు నిరూపించారు! నిబంధనలను పక్కనబెట్టి, సభ్యుల ఎంపిక కోసం ఏర్పడిన కొలీజియం చేసిన సిఫారసులను సైతం తుంగలో తొక్కి ముఖ్యమంత్రి స్థాయిల్లోనే పేర్లు మార్చేశారు.
రాష్ట్రంలోని 19 యూనివర్సిటీలకు పాలకమండలి సభ్యుల నియామకం సందర్భంగా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. మంత్రుల బంధువులు, ఎమ్మెల్యేల తమ్ముళ్లు, కొడుకుల పేర్లను చేర్చారు. విదేశాలకు వెళ్లిన వారి పేర్లను కూడా జాబితాలో పొందుపరిచారు. ప్రభుత్వ పెద్దలు సిఫారసు చేసిన పేర్లలో ఒకరిద్దరు చనిపోయిన వారు కూడా ఉన్నట్లు అధికారుల దృష్టికి వచ్చినట్లు తెలిసింది. అయితే ఆ పేర్లను బయటకు రానివ్వడం లేదు.
సాక్షి కథనంతో కదలిక..
ఒక్కో యూనివర్సిటీ పాలకమండలిలో ఐదుగురు అధికారులు కాకుండా కొలీజియం సిఫారసు మేరకు ప్రభుత్వం 9 మందిని నియమిస్తుంది. పాలకమండళ్లు ఏర్పాటు చేయూల్సిన 19 యూనివర్సిటీల్లో ఈ విధంగా ఒక్కో యూనివర్సిటీ పాలకమండలికి 9 మంది చొప్పున కొలీజియం సిఫారసు చేయగా 9 పేర్లలో మూడు, నాలుగు పేర్లను ప్రభుత్వ పెద్దలు మార్చేశారు.
వారి స్థానంలో తమ అనుయాయుల పేర్లను చేర్చారు. ఈ విషయంపై ఇటీవల ‘యూనివర్సిటీలకు పాలక మండళ్లేవీ?’ శీర్షికన సాక్షి ప్రత్యేక కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నివేదిక కోరారు. యూనివర్సిటీల వారీగా పాలకమండళ్లకు కొలీజియం సిఫారసు చేసిన పేర్లు.. ముఖ్యమంత్రి, ప్రభుత్వ స్థాయిలో మార్పు చేసిన పేర్లు, వాటికి సంబంధించిన ఫైళ్లను తనకు పంపించాలని ఆదేశించడంతో ఉన్నత విద్యా శాఖ చర్యలు చేపట్టింది.
ఎలాంటి ప్రామాణికత లేదు!
యూనివర్సిటీ వారీగా కొలీజియం చేసిన సిఫారసులు.. పెద్దలు మార్చిన పేర్లను చూసి అధికారులే ఆశ్చర్యపోతున్నారు. జాబితాలో అనర్హులు కన్పించడంతో విస్తుపోవడం వారి వంతవుతోంది. కనీస ప్రామాణికత అంటూ ఏదీ లేకుండానే పేర్లను మార్చేశారు. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి భర్త పేరును చేర్చారు. ఓ ఎమ్మెల్యే తమ్ముడు, కాలేజీ యజమాని కృష్ణారావు, మరో ఎమ్మెల్యే కొడుకు పేర్లు జాబితాల్లో ఉన్నారుు. వీటితోపాటు ఈ విధంగా మారిన చాలామంది పేర్లతో అధికారులు ప్రత్యేకంగా జాబితా రూపొందించే పనిలో ఉన్నారు. గవర్నర్ ఆదేశాల ప్రకారం నివేదిక రూపంలో రెండు మూడురోజుల్లో ఆయనకు అందజేసేందుకు సిద్ధం అవుతున్నారు. గవర్నర్ వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించిన నేపథ్యంలో కొలీజియం సిఫారసుల మేరకు సభ్యుల నియామకాలు జరగవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.