షేర్‌మహ్మద్‌పేట (జగ్గయ్యపేట), న్యూస్‌లైన్ : డతెరపి లేకుండా కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను డిమాండ్ చేశారు. మండలంలోని షేర్‌మహ్మద్‌పేట అడ్డరోడ్డు సమీపంలోని ఆటోనగర్‌లో కల్లాల్లో తడిచిన మొక్కజొన్న పంటను శుక్రవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. రైతులనడిగి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాలుగురోజులుగా ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తూ... చేతికి వచ్చే పంటను నీటిపాలు చేసిందన్నారు. అప్పు, సొప్పు చేసి పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్రంగా నష్ట పోయారన్నారు. ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న, వరి, కూరగాయల పంట లకు అపార నష్టం జరిగిందని తెలిపారు. కొన్ని గ్రామాల్లో తడిచిన మొక్కజొన్నను రైతులు కల్లాల్లోనే వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
తడిచిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. తక్షణమే వ్యవసాధికారులు గ్రామాల్లో పర్యటించి నష్టపోయిన పంటలపై సర్వే చేసి నివేదికలు తయారు చేయాలని కోరారు. రైతులను ఆదుకోకపోతే పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కళ్ల ముందే పంట నీటిపాలై నష్టపోవడంతో కంటనీరు పెడుతున్న రైతులు కోటి వెంకటేశ్వర్లు, షేక్ మస్తాన్‌ను ఉదయభాను ఓదార్చి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో మండల, పట్టణ పార్టీ కన్వీనర్లు మాతంగి వెంకటేశ్వర్లు, షేక్ మదార్‌సాహెబ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్యాల వెంకటాచలం, పట్టణ కార్యదర్శి వట్టెం మనోహర్, పట్టణ మైనార్టీ సెల్ కన్వీనర్ ఎస్‌డి.ఆరీఫ్, నాయకులు మోరే వినోద్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
పంటలను పరిశీలించిన రైతు సంఘం నాయకులు ..
వర్షానికి తడిచిన మొక్కజొన్న పంటలను జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు వై.కేశవరావు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రైతులను ప్రభుత్వం ఆదుకుని నష్టపరిహారం అందజేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘం సభ్యురాలు యార్లగడ్డ జోయ, సీపీఎం నాయకులు నాగమణి, కోట కృష్ణ, కాకనబోయిన లింగయ్య తదితరులు పాల్గొన్నారు.