వైకుంఠం షర్మిల, ముగండి ప్రియాంక
సాక్షి, దత్తిరాజేరు(విజయనగరం) : పేద, బడుగు, బలహీనవర్గాల వారే తమ పిల్లలను అప్పోసప్పో చేసి ప్రైవేట్ పాఠశాలల్లో చదివిస్తున్నారు. మరి ప్రభుత్వ ఉద్యోగులైతే... మరింత పేరున్న ప్రైవేట్ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పిస్తున్నారు. ఉపాధ్యాయుల్లో చాలామంది తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లోనే చదివిస్తుండడం గమనార్హం. ఇటీవల ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ‘అమ్మఒడి’ పథకం ప్రవేశపెట్టిన సందర్భంలో ఉపాధ్యాయులే తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడం లేదన్న అంశం తెరపైకి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో పలువురు ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపి తాము ఆదర్శ ఉపాధ్యాయులమని నిరూపించుకున్నారు. వింధ్యవాసి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వై. జగదీశ్వరరావు తమ కుమార్తె రిషితను గోభ్యాం ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతిలో జాయిన్ చేశారు.
విజయనగరంలో ఉన్న తమ నివాసాన్ని తన సొం త ఊరైన గొభ్యాంనకు మార్చి మరీ తమ బిడ్డను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అలాగే పోరలి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ముగండి రామారావు తన కుమార్తె ప్రియాంకను గోభ్యాం ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. బొండపల్లి మండలంలో పోస్టుమ్యాన్‌గా పనిచేస్తున్న ఒకరు తన కుమార్తె వైకుంఠం షర్మిలను కూడా గోభ్యాం ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. ఇలాగే మిగతా ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే ప్రభుత్వ విద్యారంగం బలోపేతమవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆదర్శంగా నిలవాలనే..
ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి పేద, బడుగు, బలహీన వర్గాల వారందరికీ నాణ్యమైన బోధన అందించాలని కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ‘అమ్మఒడి’ అమలు చేస్తున్నారు. నేను నా కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించా.. మిగలిన వారికి ఆదర్శంగా నిలిస్తే వారు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేరుస్తారు.
– వైకుంఠం జగదీశ్వరరావు,ప్రభుత్వ ఉపాధ్యాయుడు
Comments
Please login to add a commentAdd a comment