కాంగ్రెస్ కిసాన్ సెల్ చైర్మన్ కోదండరెడ్డి డిమాండ్
సాక్షి, హైదరాబాద్: రైతులకిచ్చే ఉచిత విద్యుత్‌ను నీరుగార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ వస్తున్న వార్తలపై స్పష్టత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కిసాన్‌సెల్ చైర్మన్ ఎ.కోదండరెడ్డి డిమాండ్ చేశారు. ‘పైరుకు వైరు కట్ ’ శీర్షికన మగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. కష్టాల కడలిలో ఉన్న రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్ చాలా ఊరటగా ఉందని, దానిని కూడా రైతులకు అందకుండా చేయాలని చూడడం దారుణమని వ్యాఖ్యానించారు.
2004 ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత విద్యుత్ హామీ ఉందని, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు అదే కారణమైందని చెప్పారు. 2009 మేనిఫెస్టోలో ఉచిత విద్యుత్ ఇచ్చే వేళ లను పెంచుతామన్నారని, అందుకు విరుద్ధంగా నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని వస్తున్న వార్తలు వాస్తవమైతే.. అది సరైంది కాదని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. పార్టీలో చర్చించకుండా.. దొడ్డిదారిన ఇలాంటి చర్యలకు పూనుకోవడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఉచిత విద్యుత్‌పై స్పష్టత ఇవ్వాలి: కోదండరెడ్డి
Published Wed, Oct 23 2013 2:06 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement