
సాక్షి, హైదరాబాద్: రైతులకు ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటనపై బీఆర్‌ఎస్ పార్టీ మండిపడింది. కాంగ్రెస్ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా నేడు, రేపు(మంగళ, బుధవారం) బీఆర్‌ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. తెలంగాణలో రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ వద్దు అంటూ టీకాంగ్రెస్ చీఫ్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చింది.
ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్ పార్టీదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. గతంలో కూడా విద్యుత్ ఇవ్వకుండా రైతులను గోసపెట్టిన చరిత్ర ఆ పార్టీదని విమర్శించారు. ఇప్పుడు మరోసారి తన రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ బయటపెట్టుకుందని అన్నారు. దీన్ని తెలంగాణ రైతాంగం తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మల దహనానికి ఆయన పిలుపునిచ్చారు.
చదవండి: రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వొద్దు..: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేసిన ప్రకటన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా ఈరోజు, రేపు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు భారత రాష్ట్ర సమితి పిలుపు
👉 తెలంగాణ రైతన్నకి 24 గంటలు ఉచిత విద్యుత్ వద్దు… pic.twitter.com/teXS5Vk1JF
— BRS Party (@BRSparty) July 11, 2023
కాగా, అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి సోమవారం తానా మహాసభల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని అన్నారు. రాష్ట్రంలో అధికంగా ఉన్నది మూడెకరాల లోపున్న చిన్న, సన్నకారు రైతులేనని, ఎకరాకు సాగునీరు పారించాలంటే ఒక గంట, అదే మూడు ఎకరాలకు మూడు గంటలు చాలని అన్నారు. మొత్తం మీద ఒక రైతుకు ఎనిమిది గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని పేర్కొన్నారు.
కేవలం విద్యుత్ సంస్థల వద్ద కమీషన్‌కు కక్కుర్తి పడి వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంట్ అనే నినాదాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. ఉచిత కరెంట్ పేరుతో సీఎం కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నాడని, ఉచితాన్ని అనుచితంగా వ్యవహరించవద్దని అన్నారు. మన స్వార్థానికి వాడుకోవద్దని అన్నారు.
నాడు కాంగ్రెస్ పాలనలో ఇదీ కరెంటు దుస్థితి... మళ్లీ ఆ చీకటి రోజులు మనకొద్దు! 3 గంటల కరెంటు మాత్రమే ఇస్తామంటున్న కాంగ్రెస్ పార్టీని బొందపెడదాం...
24 గంటల ఉచిత కరెంటు ఇచ్చి రైతుల బాధలు తీర్చిన కేసీఆర్ పాలనకే జై కొడదాం!! pic.twitter.com/X64kv1gd3S
— BRS Party (@BRSparty) July 11, 2023
Comments
Please login to add a commentAdd a comment