
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక ఎన్నికల్లో విజయం తర్వాత మంచి జోష్‌తో దూసుకెళుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీని.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉచిత విద్యుత్‌కు సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఆత్మరక్షణలో పడేశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌కు లేనిపోని తలనొప్పి తెచ్చిపెట్టాయనే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇక సొంత పార్టీలోనే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు రేవంత్ వ్యాఖ్యలను తప్పుపడుతుంటే, మరికొందరు మాత్రం..అధికార బీఆర్‌ఎస్ రేవంత్ వ్యాఖ్యలను వక్రీకరించే ప్రయత్నం చేస్తోందంటూ ఆయనకు మద్దతుగా నిలిచారు.
మొత్తం మీద రేవంత్ వ్యాఖ్యల పర్యవసానం తీవ్రంగానే ఉంటుందని, 24 గంటల విద్యుత్ ఇవ్వకపోతే నిలదీసి ప్రభుత్వం చేత ఇప్పించాల్సిన బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా ఉండి.. అసలు 24 గంటల విద్యుత్తే అవసరం లేదన్నట్టుగా వ్యాఖ్యానించడం పార్టీకి నష్టం చేకూరుస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. పలువురు కాంగ్రెస్ నేతలు ప్రెస్‌మీట్లు పెట్టి రేవంత్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా, జరగాల్సిన నష్టం జరిగిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అధిష్టానం దృష్టికి..!
అమెరికా వేదికగా ఉచిత విద్యుత్‌పైనా, అవసరమైతే సీఎంగా సీతక్క అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే యోచనలో సీనియర్లు ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, మాజీ ఎంపీ మల్లు రవి స్పందించారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ‘రేవంత్ అమెరికా వెళ్లేంతవరకు బాగానే ఉన్నాడు. అక్కడకు వెళ్లిన తర్వాత బాలకృష్ణ, ఎర్రబెల్లి ప్రభావం పడి అలా మాట్లాడుతున్నాడేమో’ అంటూ ఎద్దేవా చేశారు.
ఇక ఈ విషయమై కొందరు సీనియర్లు అనధికారికంగా మాట్లాడుతూ.. ‘రేవంత్ పప్పులో కాలేస్తున్నాడేమో అనిపిస్తోంది. ఉచిత విద్యుత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు యాధృచ్చికంగా ఒక్క పదం అన్నందుకే తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. వ్యవసాయం దండుగ అన్నందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు. రేవంత్‌రెడ్డి కూడా అదే బాటలో వెళ్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా రైతులకు 7–9 గంటల విద్యుత్ ఇచ్చాం.
అసలు ఉచిత విద్యుత్ గురించి ఎందుకు మాట్లాడాలి? 24 గంటలు ఇవ్వడం లేదని బీఆర్‌ఎస్‌ను విమర్శించాలి కానీ ఇస్తామంటే వద్దనడమెందుకు? దీంతో పాటు కాంగ్రెస్సే రేవంత్, రేవంతే కాంగ్రెస్ అని ఆయన అంటున్నారు. సీతక్కను సీఎం చేస్తామంటున్నారు. పీసీసీ ప్రెసిడెంట్, సీడబ్ల్యూసీ, సీఎం పదవులన్నీ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారికేనా? అసలైన కాంగ్రెస్ వాదులకు ఏం పదవులు లేవా? ఇలాంటి విషయాలన్నీ రాహుల్‌గాంధీతోనే మాట్లా డుతాం.’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment