
ఉచిత విద్యుత్ మంటలు చల్లారడం లేదు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో మరింత రాజుకుంటున్నాయి. ప్రస్తుత రాజకీయమంతా రైతులకు ఉచిత విద్యుత్ చుట్టూనే తిరుగుతోంది. అధికార బీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు పరస్పరం విరుచుకుపడుతున్నారు. మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. ఇటీవలి అమెరికా పర్యటనలో రైతులకు ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం తెలిసిందే. ‘ఒక ఎకరానికి నీరు పారించాలంటే గంట చాలు.
మూడెకరాలకు ఫుల్లుగా నీరు పారాలంటే మూడు గంటలు... టోటల్‌గా 8 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుంది. కేవలం విద్యుత్ సంస్థల దగ్గర కమీషన్లకు కక్కుర్తి పడి వ్యవసాయానికి 24 గంటలనే స్లోగన్ తీసుకొచ్చిండు..’ అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఎన్నికల వేళ దీన్ని అందిపుచ్చుకొని.. ఉచిత విద్యుత్ ఎత్తేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందంటూ మండిపడింది. ఆత్మరక్షణలో పడిన ప్రతిపక్ష పార్టీ నష్ట నివారణకు దిగింది.
ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టిందే తామని, దానికి కట్టుబడి ఉన్నామంటూ కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఉచిత విద్యుత్‌పైనే ఎన్నికలకు వెళదామని, ఎవరు విద్యుత్ ఇచ్చారో, ఇవ్వలేదో ప్రజలే నిర్ణయిస్తారని, రెఫరెండంకు కాంగ్రెస్ సిద్ధం కావాలని మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు. దీనిపై రేవంత్‌రెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. అదేదో సబ్‌స్టేషన్ల వద్దే తేల్చుకుందామన్నారు. మరోవైపు ఉచిత విద్యుత్‌పై రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా క్షేత్రస్థాయిలో 10 రోజుల కార్యాచరణకు పిలుపునివ్వడం ద్వారా ఈ అంశాన్ని ఇంతటితో వదలబోమనే సంకేతాలను బీఆర్‌ఎస్ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment