మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో రేవంత్‌రెడ్డి దిష్టి»ొమ్మను దహనం చేస్తున్న బీఆర్‌ఎస్ శ్రేణులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేగింది. తెలంగాణ రైతాంగానికి టోటల్‌గా ఎనిమిది గంటల ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని, 24 గంటల ఉచిత విద్యుత్ మాత్రం విద్యుత్ సంస్థల నుంచి కమీషన్ల కోసమేనంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వేడి రాజేశాయి. అధికార బీఆర్‌ఎస్ రేవంత్ వ్యాఖ్యలపై భగ్గుమంది. తాము అమలు చేస్తోన్న రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఎత్తివేసే కుట్రకు కాంగ్రెస్ పాల్పడుతోందని, అందులో భాగంగానే రేవంత్‌రెడ్డి అమెరికాలో ఈ వ్యాఖ్యలు చేశారని విరుచుకుపడింది.
పలువురు మంత్రులు, ఆ పార్టీ నేతలు రేవంత్ వ్యాఖ్యలను ఖండించారు. మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావులు కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ధరణి ఎత్తివేస్తామని, ఉచిత విద్యుత్ తీసేస్తామని చెపుతున్న కాంగ్రెస్ పార్టీకి కరెంటు షాకులు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీపీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలకు నిరసనగా బుధ, గురువారాల్లో రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు.
దీంతో మంగళవారం నాడే రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల బీఆర్‌ఎస్ కార్యకర్తలు రోడ్లెక్కారు. పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. మరోవైపు బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక విధానమంటూ లేదని, ఎవరికి తోచింది వారు చెబుతూ ప్రజలను గందరగోళ పరిస్థితుల్లోకి నెడుతున్నారని విమర్శించింది. రేవంత్ వ్యాఖ్యలు ఊహించని విధంగా వివాదాన్ని సృష్టించడంతో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడింది.
పేటెంట్ మాదే..
బీఆర్‌ఎస్, బీజేపీల విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. రేవంత్ వ్యాఖ్యలు వైరల్ కావడం, బీఆర్‌ఎస్ తీవ్రంగా స్పందించడంతో ఎదురుదాడికి దిగింది. నష్ట నివారణకు ఆ పార్టీ నేతలు ప్రయత్నించారు. మధుయాష్కీగౌడ్, పొన్నం ప్రభాకర్, మల్లురవి, అద్దంకి దయాకర్, షబ్బీర్‌అలీ, రైతు విభాగం నేతలు కోదండరెడ్డి, సుంకేట అన్వేష్‌రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్‌కౌశిక్ యాదవ్ తదితరులు రేవంత్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూనే బీఆర్‌ఎస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు.
రేవంత్ వ్యాఖ్యలను వక్రీకరించి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే రైతులని, రైతులు అంటేనే కాంగ్రెస్ పార్టీ అని, రేవంత్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి మంత్రులు ఊరకుక్కల్లా మాట్లాడుతున్నారంటూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. విద్యుత్ కొనుగోళ్లలో జరుగుతున్న అవినీతిని ఎత్తిచూపేందుకే రేవంత్ అలా మాట్లాడారని, విద్యుత్ రంగంలో అవినీతిపై బహిరంగ చర్చకు మంత్రులు సిద్ధమా అని సవాల్ విసిరారు.
ఇక ఉచిత విద్యుత్‌పై పేటెంట్ కాంగ్రెస్ పార్టీదేనని పార్టీ నేత అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించగా, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బీఆర్‌ఎస్ నేతలు తమపై బురద జల్లుతున్నారని మాజీ ఎంపీ మల్లురవి విమర్శించారు. బీజేపీ తెచి్చన రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు మద్దతిచ్చిన బీఆర్‌ఎస్ చీప్ పాలిటిక్స్ చేస్తోందని ధ్వజమెత్తారు. పార్టీ విధాన నిర్ణయాన్ని రేవంత్ ప్రకటించలేదంటూ, రైతులకు ఉచిత విద్యుత్‌కు కాంగ్రెస్ కట్టుబడి ఉందని చెప్పారు. రైతు డిక్లరేషన్‌లో చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తామని అన్నారు.
సత్యాగ్రహ దీక్షను నీరుగార్చే కుట్ర: రేవంత్
బీఆర్‌ఎస్ విమర్శల పర్వం, కార్యాచరణపై అమెరికాలో ఉన్న రేవంత్‌రెడ్డి తాజాగా స్పందించారు. రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని అప్రజాస్వామికంగా రద్దు చేసిన బీజేపీ కక్షపూరిత వైఖరిని నిరసిస్తూ చేపట్టిన సత్యాగ్రహ దీక్షను నీరుగార్చేందుకు బీజేపీ బీ టీం అయిన బీఆర్‌ఎస్ కుట్ర చేస్తోందని ఒక ప్రకటనలో విమర్శించారు. గాంధీ విగ్రహాల వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలకు సిద్ధమవుతున్న సమయంలో అసత్య, అసందర్భ అంశాన్ని తెరపైకి తెచ్చి బీఆర్‌ఎస్ చిల్లర హడావుడి చేస్తోందని విమర్శించారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్న విషయం తేలడంతోనే బీఆర్‌ఎస్ మంత్రులు, నేతలు దు్రష్పచారం చేస్తున్నారన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో 12 గంటలు కూడా నాణ్యమైన విద్యుత్ ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నారని, ఇందుకు నిరసనగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్‌స్టేషన్ల ముందు కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టి కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ చేసిన రైతు డిక్లరేషన్ బీఆర్‌ఎస్ వెన్నులో వణుకు పుట్టించిందని, అందుకే తాను అమెరికాలో మాట్లాడిన మాటలు అవకాశంగా తీసుకుని కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటెంట్ స్కీం అని, ఆ విషయంలో కాంగ్రెస్‌ను వేలెత్తి చూపే అర్హత బీఆర్‌ఎస్‌కు లేదని స్పష్టం చేశారు.
అసలు రేవంత్ ఏమన్నారు..?
అమెరికా పర్యటనలో భాగంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించిన గ్రీట్ అండ్ మీట్‌లో ఎన్‌ఆర్‌ఐలు అడిగిన పలు ప్రశ్నలకు రేవంత్‌రెడ్డి సమాధానాలిచ్చారు. ఈ సమావేశంలోనే ఉచిత విద్యుత్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. మీరు అధికారంలోకి వస్తే తెలంగాణ రైతాంగానికి నిరంతరాయంగా ఇస్తున్న కరెంటును కొనసాగిస్తారా లేక రద్దు చేస్తారా? రైతుబంధు కొనసాగిస్తారా? రద్దు చేస్తారా? అని ఓ ఎన్‌ఆర్‌ఐ ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన రేవంత్.. ‘తెలంగాణలో 95 శాతం రైతులు మూడెకరాల లోపున్న చిన్న, సన్నకారు రైతులు. మూడెకరాలలోపు ఉంటే ఒక ఎకరానికి నీరు పారించాలంటే ఒక గంట చాలు.
మూడెకరాలకు ఫుల్లుగా నీరు పారాలంటే మూడు గంటలు సరిపోతుంది. టోటల్‌గా ఎనిమిది గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుంది. కేవలం విద్యుత్ సంస్థల దగ్గర కమీషన్లకు కక్కుర్తి పడి వ్యవసాయానికి 24 గంటలనే స్లోగన్ తీసుకొచి్చండు. ఉచిత కరెంటు అని కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నాడు. ఇలాంటి ఉచితాలను అనుచితంగా స్వార్థానికి వాడుకోవద్దు. ఉచిత విద్యుత్ గురించి రైతు డిక్లరేషన్‌లో స్పష్టంగా చెప్పాం..’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment