
సాక్షి, గూడూరు రూరల్: కొన్నేళ్లుగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలతో ప్రజలు సహజీవనం చేస్తున్నారు. ప్రభుత్వాలు, అధికారులు మారుతున్నా సమస్యలు మాత్రం పరిష్కారం కాక ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందనంగా మారింది. గూడూరు పట్టణంలో దాదాపు 30 వేల జనాభా ఉంది. పదేళ్లుగా బుడగలవాని చెరువును సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుగా అభివృద్ధి చేసి శాశ్వత తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నా పాలకులు పట్టించుకోకుండా వదిలేశారు. గూడూరు నుంచి కొత్తకోట, గూడూరు నుంచి కోడుమూరు వరకు ఉన్న రోడ్డు గుంతల మయంగా మారాయి.
దీంతో మూడు దశాబ్దాలుగా బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రజలు, విద్యార్థులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డును వేసి బస్సులు నడపాలని జిల్లా అధికారులకు పలుమార్లు అర్జీలు పెట్టుకున్నా ఫలితం లేకుండాపోయిందని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గూడూరు, మండల వ్యాప్తంగా ఎల్లెల్సీ కాలువ కింద ఆయకట్టు 15000 ఎకరాలకు పైగా ఉంది. అయితే కాలువల్లోని పలు చోట్ల మరమ్మతులకు నోచుకోక శిథిలమవడంతో సక్రమంగా సాగునీరు రాకపోవడంతో వర్షాధారంపై రైతులు ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది.
బూడిదపాడు, పెంచికలపాడు, చనుగొండ్ల, జూలకల్ హైస్కూళ్లల్లో క్రీడా మైదానాలు పూర్తి స్థాయిలో అభివృద్ధికి నోచుకోకపోవడంతో ఆటలు ఆడేందుకు విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. మునగాల, చనుగొండ్ల, బూడిదపాడు, మల్లాపురం గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు అధ్వానంగా ఉన్నాయి. డ్రైనేజీల్లో చెత్త పేరుకుపోవడంతో మురుగు నీరు ముందుకు వెళ్లక రోడ్లపైనే పారుతూ కంపుకొడుతున్నాయి. సమస్యలను తీర్చాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు ప్రజలు మొరపెట్టుకుంటున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. మండలంలో కొన్నేళ్లుగా సమస్యలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment