గవర్నర్‌కు జ్ఞాపికను బహూకరిస్తున్న దృశ్యం
సైన్స్ సంబరం అంబరాన్నంటింది.. వైజ్ఞానిక వెలుగులను విరజిమ్మింది.. లబ్ధప్రతిష్టులైన ఎందరో శాస్త్రవేత్తలు హాజరైన ఏపీ సైన్స్ కాంగ్రెస్ సాంకేతిక సౌరభంతో పరిమళించింది. జీవన సాఫల్య పురస్కారాలను అందుకున్న ప్రముఖులను, అవార్డులు వరించిన జూనియర్ సైంటిస్టులను చూసి విద్యార్థులు పులకించిపోయారు. వారి ప్రసంగాలతో స్ఫూర్తి పొందారు. బాలల సైన్స్ కాంగ్రెస్‌లో ముద్దులొలికే రేపటి శాస్త్రవేత్తలు తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వారి ప్రదర్శనలను తిలకించి మంత్రముగ్ధులయ్యారు.
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐదో ఏపీ సైన్స్ కాంగ్రెస్–2019 ఘనంగా ప్రారంభమైంది. జిల్లాలో రాష్ట్ర స్థాయి సైన్స్ కాంగ్రెస్ జరగడం ఇదే తొలిసారి. అంబేడ్కర్ వర్సిటీలో మూడు రోజుల వేడుకలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గురువారం శ్రీకారం చుట్టారు. ఎచ్చెర్లలోని ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసు గ్రౌండ్స్‌లోని హెలిప్యాడ్ వద్దకు హెలికాప్టర్‌లో వచ్చిన గవర్నర్ సభా వేదిక వద్దకు మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్నారు. గవర్నర్‌కు స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు ఆదిమూలపు సురేష్, ధర్మాన కృష్ణదాస్, వైస్ చాన్సలర్ కూన రామ్‌జీ, జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఘనంగా స్వాగతం పలికారు. తొలుత వర్సిటీ ఆవరణలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి గవర్నర్ పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం ఇండోర్ స్పోర్ట్సు స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వర్సిటీ ఆవరణలో మొక్కలు నాటారు. బాలల సైన్స్ కాంగ్రెస్‌కు వచ్చి వారి ప్రాజెక్టులు పరిశీలించారు. నేషనల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, న్యూఢిల్లీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రారంభించారు. అనంతరం రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన
రక్తదాన శిబిరాన్ని రెడ్ క్రాస్ చైర్మన్ హోదాలో ప్రారంభించారు. విద్యార్థులు ఈ సందర్భంగా రక్తదానం చేశారు. అనంతరం గవర్నర్ లైఫ్‌టైం అచీవ్‌మెంట్, ఫెలోషిప్, యువ శాస్త్రవేత్తలకు అవార్డులు అందజేశారు. ప్రారంభ ప్లీనరీలో సైన్స్ కాంగ్రెస్ ప్రాధాన్యతను ఏపీ అకాడమీ ఆఫ్ సైన్స్ అధ్యక్షుడు డాక్టర్ రఘునాధరావు వివరించారు. ప్రారంభ ప్లీనరీలో నలుగురు శాస్త్రవేత్తలు సాంకేతిక ప్రగతిపై మాట్లాడారు. రెండో పూట ప్లీనరీ అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బాలల కాంగ్రెస్ ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర రాష్ట్ర స్థాయి ఉత్పత్తుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నేషనల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ స్టాళ్లు ప్రదర్శించారు. సైన్స్ కాంగ్రెస్‌లో సావనీర్, వర్సిటీ బులెటిన్లను గవర్నర్ ఆవిష్కరించారు. గవర్నర్ రాకతో విశాఖ రేంజ్ డీఐజీ కాళిదాస్, ఎస్పీ అమ్మిరెడ్డి ఆధ్వర్యంలో శాంతి భద్రతలను పర్యవేక్షించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా వర్సిటీ అధికాలు ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment