రేపు అనంతపురం జిల్లాకు గవర్నర్
– 23న ముకుందాపురంలో పర్యటన
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ఈ నెల 22, 23 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు జిల్లా డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవి గవర్నర్ పర్యటన గురించి ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 22న గవర్నర్ హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో రాత్రి 7.45 గంటలకు అనంతపురం చేరుకొని, ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో విడిది చేస్తారన్నారు. 23న ఉదయం 9 గంటలకు అనంతపురం నుంచి బయలుదేరి గార్లదిన్నె మండలం ముకుందాపురం చేరుకుంటారని ఆమె తెలిపారు.
ఉదయం 9.30 నుంచి 10:00 గంటల వరకు అక్కడ పంట కుంటలు, పంట సంజీవని కార్యక్రమాలను పరిశీలించనున్నారు. అనంతరం 10.30 గంటలకు అదే గ్రామంలో మల్చింగ్, డ్రిప్ సేద్యం ద్వారా లబ్ధిపొందిన రైతుల పొలాలను సందర్శిస్తారు. 11 గంటల వరకు డ్రిప్ సేద్యంతో రైతులు సాగు చేసిన అంజూర పంటను పరిశీలిస్తారని డీఆర్‌ఓ తెలిపారు. తర్వాత 11 గంటల నుంచి 11.45 వరకు గార్లదిన్నెలో ఏర్పాటు చేసిన ఫీజియో మీటర్ల పనితీరుని పరిశీలించనున్నారు, 11.45 అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు ఆర్‌అండ్‌బీ అతిథిగృహం చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు రోడ్డు మార్గంలో తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.