- ‘పంట విరామం’పై రైతులతో సర్కారు చర్చలు
- సమస్యలకు శాశ్వత పరిష్కారం కోరిన అన్నదాతలు
- అన్నింటినీ పరిష్కరిస్తామన్న ఉప ముఖ్యమంత్రి రాజప్ప
- ప్రధాన డిమాండ్లపై నిర్దిష్టమైన హామీలు ఇవ్వని సర్కారు
- 15 రోజులు చూసి ఉద్యమ కార్యాచరణ : రైతు సంఘాలు
అమలాపురం : పంట విరామానికి ఉద్యుక్తులైన కోనసీమ రైతులతో చర్చలు జరిపిన ప్రభుత్వం.. వారి ప్రధాన డిమాండ్లకు సంబంధించి నిర్దిష్టమైన హామీలివ్వలేదు. చర్చలు మొక్కుబడి తంతుగా జరిగాయని అన్నదాతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చర్చలకు వచ్చిన రైతు సంఘం ప్రతినిధుల్లో ఎక్కువ మంది అధికారపార్టీలో పదవులున్నవారు కావడంతో చర్చలు ఏకపక్షంగా సాగిపోయాయంటున్నారు. ఇచ్చిన హామీల అమలుకు 15 రోజులు చూసి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని రైతు సంఘాల ప్రతినిధులు అంటున్నారు.
కోనసీమ రైతులతో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లాస్థాయి అధికారులతో సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో చర్చలు జరిపారు. రైతులు స్వచ్ఛందంగా పంట విరామం ప్రకటించి, తమ సమస్యలపై ప్రభుత్వం చర్చలు జరపకుంటే ఈనెల 30న అమలాపురంలో రైతు సభ నిర్వహించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్న నేపథ్యంలో ప్రభుత్వం చర్చలకు వచ్చింది.
అయితే చర్చల్లో ప్రభుత్వం తరపున రాజప్ప చెప్పాల్సింది చెప్పారేకాని మాట్లాడేందుకు రైతులకు పెద్దగా అవకాశం ఇవ్వలేదు. తొలుత ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం తీసుకున్న చర్యల్ని వివరించిన రాజప్ప ఎన్ని సమస్యలనైనా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సాగు జరగకుండా కావాలని ఇబ్బందులు పెడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించే ధోరణిలో మాట్లాడడంతో రైతు సంఘం ప్రతినిధులు నొచ్చుకున్నారు.
మే 15కల్లా నీరిచ్చేది కల్లే..!
రైతు సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ అధ్వానంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ, మే 15 నాటికి సాగునీరు విడుదల చేయకపోవడం, ఇన్‌పుట్ సబ్సిడీ, పెట్టుబడులకు తగ్గ మద్దతు ధర లేకపోవడం, యూంత్రీకరణ, ధాన్యం కొనుగోలులో నిబంధనల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను లేవనెత్తారు. వీటిలో ఒక్కదానిపైనా నిర్దిష్టమెన హామీ రాలేదు.
ముఖ్యంగా మే 15 నాటికి నీరు విడుదల చేయాలన్న మధ్యడెల్టా రైతుల డిమాండ్‌పై వచ్చే ఏడాది ఇస్తామనే హామీ కూడా రాలేదు సరికదా, జూన్ 15 నాటికే ఇస్తామని రాజప్ప పదేపదే చెప్పడం గమనార్హం. రైతులు నాట్లు వేసేటప్పుడు, కోతల సమయంలో ఉపాధి హామీ పథకం పనులు నిలిపివేసేందుకు చర్యలు తీసుకుంటామని, కూనవరం, రామేశ్వరం మొగల వద్ద డ్రెడ్జింగ్ చేయడం ద్వారా ముంపు సమస్యను పరిష్కరిస్తామని, యాంత్రీకరణకు రూ.2.20 కోట్లు కేటాయించామని చెప్పిన ఆయన కనీస మద్దతు ధర పెంపు, కేంద్రం పెంచకుంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి బోనస్, డెల్టా ఆధునికీకరణ, ధాన్యం కొనుగోలు నిబంధనల సడలింపులకు సంబంధించి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. అవుట్‌ఫాల్ స్లూయిజ్‌లను రూ.45 లక్షలతో ఆధునీకరిస్తామని ఎస్‌ఈ ఎస్.సుగుణాకరరావు చెప్పారు.
ఆగ్రహంతో ఊగిపోయిన రాజప్ప..
రైతు పరిరక్షణ సమితి మాజీ అధ్యక్షుడు రంబాల బోస్ మాట్లాడుతూ రైతు సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న ఉద్యమాన్ని రాజకీయ కోణంతో చూడవద్దనగా రాజప్ప ఆగ్రహంతో ఊగిపోయారు. ‘మీరే రాజకీయాలు చేస్తున్నా’రంటూ విరుచుకుపడడంతో రైతులు అవాక్కయ్యారు. దాంతో బోస్ ‘కోప్పడకండి. మీ నాన్నగారు, మా నాన్నగారు సాగు చేసిన సమయంలో బస్తా ధాన్యాన్ని 20 మంది కూలీలకు పంచేవారు.
ఇప్పుడు బస్తా ధాన్యానికి ముగ్గురు కూలీలు వస్తున్నారా?’అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం దేశానికి ఆహార భద్రతను చూస్తోందే తప్ప రైతుకు ఆర్థిక భద్రతను చూడడం లేదని నిరసించారు. జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి, ఏఎంసీ చైర్మన్ గునిశెట్టి చినబాబు, రైతు సంఘం నాయకులు వా సంశెట్టి సత్యం, జున్నూరి బాబి, రాయపురెడ్డి జానకిరామయ్య, ముత్యాల జమ్మి, ఉప్పుగంటి భాస్కరరా వు, దొంగ నాగేశ్వరరా వు, ఆర్డీవో జి.గణేష్‌కుమార్, వ్యవసాయశాఖ జేడీ ప్రసాద్ చర్చల్లో పాల్గొన్నారు.
నేటికీ వీడని నాటి సమస్యలు..
2011లో సాగుసమ్మెకు కారణమైన సమస్యల్ని రైతులు ఇప్పటికీ ఎదుర్కొంటున్నారని రైతు సంఘం నాయకులు స్పష్టం చేశారు. భారతీయ కిసాన్‌సంఘ్ జాతీయ కార్యవర్గసభ్యుడు జలగం కుమారస్వామి మాట్లాడుతూ డ్రైన్లు సముద్రంలో కలిసే మొగల వద్ద శాశ్వతంగా రాతికట్టడాలు కట్టాలే తప్ప తాత్కాలిక చర్యలతో ప్రయోజనం లేదన్నారు. మే 15 నాటికి ఎట్టి పరిస్థితుల్లోను సాగునీరు ఇవ్వాలన్న డిమాండ్‌కు కట్టుబడి ఉన్నామన్నారు.
తొలకరి సాగుకు ముందు ప్రతి డివిజన్‌లో రైతు సమస్యలపై సమావేశం ఏర్పాటు చేయాలని సూచించగా రాజప్ప అంగీకరించారు. కోనసీమ రైతు పరిరక్షణ సమితి అధ్యక్షుడు యాళ్ల వెంకటానందం మాట్లాడుతూ ఇప్పుడున్న రెవెన్యూ డ్రైన్లను మాత్రమే ఆధునీకరిస్తున్నారని, చాలా డ్రైన్లు ఆక్రమణలతో కనిపించకుండా పోయాయన్నారు. ప్రస్తుతం తక్కువ వర్షానికే చేలు మునిగాయని, ముంపు తగ్గి నారుమడి వేయాలంటే పది రోజులు వర్షం కురవకుండా ఎండ కాయూలని అన్నారు. ఎమ్మెల్యే ఆనందరావు కలగజేసుకుని కూనవరం, రామేశ్వరం మొగల మధ్య పూడికను డ్రెడ్జింగ్ చేస్తే ముంపు సమస్య తగ్గుతుందన్నారు.