వలంటీర్‌ పోస్టులకు అనూహ్య స్పందన | Grama Volunteers Interviews Began Thursday | Sakshi
Sakshi News home page

క్రేజీ కొలువు

Published Fri, Jul 12 2019 8:48 AM | Last Updated on Fri, Jul 12 2019 8:49 AM

Grama Volunteers Interviews Began Thursday - Sakshi

నిరుద్యోగులకు భరోసా ఇవ్వడమే కాకుండా సంక్షేమ ఫలాలు ప్రజల ముంగిటకే చేర్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి సంబంధించిన తొలి అడుగుకు అనూహ్య స్పందన లభిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 10 వేల వలంటీర్ల పోస్టులకు 39 వేల దరఖాస్తులు వచ్చాయి. గ్రామస్థాయిలో సగటున ప్రతి పోస్టుకు నలుగురు ఆశావహులు బరిలో నిలిచారు. కొన్ని మండలాల్లో వెయ్యికిపైగా దరఖాస్తులు అందాయి. జిల్లావ్యాప్తంగా వలంటీర్ల ఇంటర్వ్యూల ప్రకియ గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు జిల్లాలోని 20 మండలాలు, నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు మున్సిపాలిటీల్లో ఇంటర్వ్యూల ప్రకియను మొదలుపెట్టారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 46 మండలాల్లో ఇంటర్వ్యూలు పూర్తి స్థాయిలో శుక్రవారం ప్రారంభమవుతాయి. 

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: గ్రామ స్థాయిలో గ్రామ వలంటీర్లు, పట్టణంలో పట్టణ వలంటీర్లు, నగరంలో డివిజన్‌ వలంటీర్ల పోస్టులకు డిమాండ్‌ ఏర్పడింది. దరఖాస్తుల స్వీకరణ ప్రకియ ప్రారంభంలో కొంత తక్కువగా దరఖాస్తులు వచ్చినా, చివరి మూడు రోజులు వేల సంఖ్యలో అందాయి. జిల్లాలోని 46 మండలాల్లో 10,936 వలంటీర్ల పోస్టులకు గానూ 39,084 దరఖాస్తులు అందాయి. వీటిలో స్క్రూట్నీ అనంతరం 37,393 మంది అర్హత సాధించారు. వీరందరికీ ఇంటర్వ్యూలకు ఏయో తేదీల్లో హాజరుకావాలనేది మెసేజ్‌ రూపంలో పంపే ఏర్పాటు చేశారు. జిల్లాలోని 940 పంచాయతీల్లో 10,936 పోస్టులను కుటంబాల ప్రాతిపదికన నిర్ణయించారు. దీనికి అనుగుణంగా గత నెల 24 నుంచి ఈ నెల 8 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రకియను నిర్వహించారు.

ఈ క్రమంలో 10వ తేదీన దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి అర్హత గల అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసి ఇంటర్వ్యూలను ప్రారంభించారు. రోజుకు సగటున 60 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు వీలుగా కమిటీని నియమించారు. కమిటీకి ఎంపీడీఓ చైర్మన్‌గా, తహసీల్దార్, ఈఓపీఆర్డీలు సభ్యులుగా ఉండి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 900 మంది అభ్యర్థులు దాటిన మండలాల్లో రెండు ఇంటర్వ్యూ బోర్డులను ఏర్పాటు చేసి రోజూ 120 మందిని ఇంటర్వ్యూ చేసేలా చర్యలు తీసుకున్నారు. కలెక్టర్‌ శేషగిరిబాబు అధికారులతో మాట్లాడి మండలాల్లో జరగుతున్న ఇంటర్వ్యూల వివరాలను తెలుసుకున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో శుక్రవారం మొదలుకావాలని ఆదేశాలు జారీ చేశారు. 

కొన్ని మండలాల్లో వెయ్యికిపైగా..
మరోవైపు గ్రామ వలంటీర్ల పోస్టులకు కొన్ని మండలాల్లో వెయ్యికి పైగా దరఖాస్తులు అందాయి. మరికొన్ని మండలాల నుంచి 900కు పైగా దరఖాస్తులు అందాయి. చిల్లకూరు మండలం నుంచి 1288, బుచ్చిరెడ్డిపాళెం మండలం నుంచి 1228,  కోట నుంచి 1196, పొదలకూరు మండలం నుంచి 1137 దరఖాస్తులు అందాయి. ఇందుకూరుపేట నుంచి 1064, అల్లూరు నుంచి 1015, కోవూరు నుంచి 1012, గూడూరు నుంచి 990, చిట్టమూరు మండలం నుంచి 970, రాపూరు మండలం నుంచి 933, వెంకటాచలం నుంచి 942, విడవలూరు నుంచి 908 దరఖాస్తులు అందాయి. మిగిలిన మండలాల్లో 400 నుంచి 900 వరకు దరఖాస్తులు అందాయి. 

పారదర్శకంగానే..
నెల్లూరు(అర్బన్‌) :   గ్రామ వలంటీర్ల పోస్టులకు  పారదర్శకంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని  జిల్లా పంచాయతీ అధికారి, జడ్పీ సీఈవో సుధాకర్‌రెడ్డి తెలిపారు.  జడ్పీ ఆవరణలోని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో గురువారం జరిగిన  విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 10,936 గ్రామ వలంటీర్ల పోస్టులున్నాయన్నారు. వాటికి 39,084 మంది ధరఖాస్తు చేసుకున్నారన్నారు. అందులో 37,393 మంది అర్హత పొందారని తెలిపారు. తొలి రోజు 20 మండలాల్లో మాత్రమే ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయన్నారు. రెండో రోజు శుక్రవారం మిగతా మండలాల్లోఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయన్నారు.

ప్రతి మండలంలో రోజుకి 60 మంది చొప్పున ఇంటర్వ్యూ చేసేందుకు ఒక బోర్డును ఏర్పాటు చేశామన్నారు. ఆబోర్డులో ఎంపిడీవో ఛైర్మన్‌గా తహశీల్దారు, ఈవోపీఆర్డీలు సభ్యులుగా ఉంటారని తెలిపారు. 900 మంది కన్నా ఎక్కువగా దరఖాస్తులు వచ్చిన 13 మండలాల్లో రెండో బోర్డును ఏర్పాటు చేశామన్నారు. రెండో బోర్డులో మండల ప్రత్యేకాధికారి ఛైర్మన్‌గా , ఎంఈవో, డిప్యూటి తహశీల్దారు సభ్యులుగా ఇంటర్వూలు కొనసాగుతాయన్నారు. అర్హత పొందిన ప్రతి ఒక్కరికీ సెల్‌ పోన్‌లో ఆర్టీజీఎస్‌ ద్వారా ఇంటర్వూకి రావాల్సిన రోజు, సమయం మెసేజ్‌ రూపంలో పంపుతున్నామన్నారు. ఎవరైనా ఇబ్బందులుండి అనుకోని కారణాలు వల్ల ఇంటర్వ్యూలకు హాజరు కాలేకపోయిన వారు ఈనెల 24, 25 తేదీల్లో ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని తెలిపారు.

తొలి రోజు 300 మంది హాజరు
నెల్లూరు సిటీ: నగరపాలక సంస్థ కార్యాలయంలో వార్డు వలంటీర్ల పోస్టులకు ఇంటర్వ్యూలను నిర్వహించారు. కార్పొరేషన్‌ పరిధిలో 3040 పోస్టులకు గానూ బుధవారం రాత్రికి 4047 దరఖాస్తులు వచ్చాయి. కార్పొరేషన్‌ కార్యాలయంలో 10 కమిటీలతో వార్డుల వారీగా ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఒక్కో కమిటీలో ముగ్గురు చొప్పున అధికారులు, ఉద్యోగులు ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. గురువారం 300 మంది దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలను నిర్వహించారు. 310 మందికి ఇంటర్వ్యూలను శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ నెల 21 వరకు ఇంటర్వ్యూలు కొనసాగనున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement