ఉద్యమాలకు, రాజకీయ చైతన్యానికి నెలవైన జిల్లా మలిదశ తెలంగాణ ఉద్యమానికి కోటగా నిలిచింది. ఉద్యమం ప్రారంభం నుంచి దశాబ్దాల కల నెరవేరిన క్షణం వరకు ప్రతి సందర్భంలో ఉత్తేజకరమైన పాత్రను నిర్వర్తించింది. అణిచివేత, నిర్భంధం, వేధింపులు, బైండోవర్లు, అరెస్టులు వీటన్నింటినీ అధిగమించి ఉద్యమం గమ్యానికి చేరేదాకా వెన్ను చూపని సాహసాన్ని ప్రదర్శించింది. 2001 నుంచి 2014 వరకు అన్ని ముఖ్య ఘట్టాలకు, కీలక మలుపులకు కేంద్రబిందువుగా నిలిచింది. ఈ పదమూడేళ్ల ఉద్యమ ప్రస్థానం ఇలా సాగింది.
సింహగర్జనతో మొదలు..
తెలంగాణ రాష్ట్ర సమితికి కరీంనగర్ అచ్చొచ్చిన జిల్లా. పార్టీ ఆవిర్భావం తరువాత ముఖ్యమైన అన్ని కార్యక్రమాలకు ఇక్కడనుంచే శ్రీకారం చుట్టారు. జలదృశ్యంలో పార్టీని ప్రారంభించిన కేసీఆర్ మొదటి బహిరంగసభను కరీంనగర్‌లోనే ఏర్పాటు చేశారు. 2001లో ఎస్సారార్ కళాశాల మైదానంలో జరిగిన సింహగర్జన విజయం పార్టీపై అంచనాలను పెంచింది. అదే సంవత్సరం జరిగిన స్థానిక ఎన్నికల్లో జిల్లాలో టీఆర్‌ఎస్ 28 జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకుని జెడ్పీపై గులాబీ జెండా ఎగురవేసింది. తెలంగాణ భావజాలాన్ని నింపుకున్న జిల్లా ప్రజలు పార్టీకి అండగా నిలవడంతో అప్పటినుంచి టీఆర్‌ఎస్‌కు కరీంనగర్ సెంటిమెంటుగా మారింది.
మాటిచ్చిన సోనియా
తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏమిటో తనకు తెలసుననీ... తాము అధికారంలోకి వస్తే వారి ఆకాంక్షను నెరవేరుస్తానని సోనియా గాంధీ కరీంనగర్‌లోనే ప్రకటించారు. 2004 మార్చి 11న అంబేద్కర్ స్టేడియంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె ఈ మాటలు చెప్పారు. ఈ మాట ప్రకారమే యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిద్ధమయ్యింది. కాంగ్రెస్ శ్రేణులు కూడా ఉద్యమంలో పాలు పంచుకున్నారు. ఎంపీ పొన్నం ప్రభాకర్ రైలురోకో సందర్భంగా జైలుకే వెళ్లారు. శ్రీధర్‌బాబు మంత్రి పదవికి రాజీనామా చేసి కిరణ్‌కు షాకిచ్చారు.
మద్దతిచ్చిన సుష్మా..
భారతీయ జనతాపార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణకు మొదటినుంచి అనుకూలంగా ఉన్నా జనంలో ప్రాచుర్యం పొందింది మాత్రం కరీంనగర్‌లో సుష్మాస్వరాజ్ సభ తర్వాతే. 2011 మే 31న ఆమె భారీ బహిరంగసభలో తెలంగాణ ఏర్పాటుకు తమ పూర్తి సహకారం ఉంటుందన్న ప్రకటన చేశారు. అప్పటికే జేఏసీలో భాగస్వామిగా ఉన్న బీజేపీ ఆ తర్వాత మరింత క్రియాశీలంగా వ్యవహరించింది. పార్టీ జిల్లా అగ్ర నేతలు ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు.
తెలంగాణ భవన్ కేంద్రంగా...
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ 2004 ఎన్నికల్లో కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. తొలిసారి ఎంపీగా ఎన్నికయిన కేసీఆర్ కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలో లాబీయింగ్ చేస్తూ తెలంగాణ అంశంపై ఏకాభిప్రాయ సాధనకు కృషిచేశారు. యూపీఏ అజెండాలో, రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని చేర్చడం ద్వారా రాజకీయ ప్రక్రియను మొదలుపెట్టారు. ఉత్తర తెలంగాణ ఉద్యమానికి కేంద్రంగా కరీంనగర్‌లో పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్ కేసీఆర్ వ్యూహాలకు కేంద్రంగా మారింది.
రాజీనామాల అస్త్రం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగమైన టీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ మంత్రిపదవులకు రాజీనామాలు చేశారు. జిల్లా నుంచి రాష్ట్ర కేబినెట్‌లో ఉన్న కెప్టెన్ లక్ష్మీకాంతరావు, కేంద్ర కేబినెట్ నుంచి కేసీఆర్ వైదొలగారు. తెలంగాణ సెంఇమెంటు లేదన్న వ్యాఖ్యలకు జవాబుగా కేసీఆర్ ఎంపీ పదవికి 2006 సెప్టెంబర్ 12న రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో రెండు లక్షల ఆధిక్యాన్ని సాధించి ఉద్యమాన్ని సజీవంగా నిలిపారు. 2008 మార్చిలో మరోసారి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామాలు చేశారు. జిల్లానుంచి కేసీఆర్‌తో పాటు నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తిరిగి ఎన్నికయ్యారు.
కేసీఆర్ అరెస్టుతో ఆజ్యం
తెలంగాణ ఉద్యమం 2009 ఎన్నికల తర్వాత ఉప్పెనగా మారింది. 2009 సెప్టెంబర్ 29న ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో..’ అంటూ కేసీఆర్ సిద్దిపేటలో ఆమరణ నిరాహారదీక్ష తలపెట్టారు. ఉత్తర తెలంగాణ భవన్ నుంచి దీక్షకు బయల్దేరిన ఆయనను అల్గునూరు చేరుకోగానే పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం జైలుకు తరలించగా కేసీఆర్ అక్కడే దీక్షను కొనసాగించారు. ఆయన దీక్షకు మద్దతుగా జిల్లాలో అన్ని వర్గాలు ఆందోళనలకు దిగాయి. తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం రాజుకుంది. ఫలితంగా డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ ప్రకటన చేసింది. సీమాంధ్ర ఉద్యమంతో డిసెంబర్ 23న తెలంగాణ ప్రకటనను వెనక్కివెళ్లింది. ఆ తర్వాత ఉద్యమం నిరంతరంగా సాగింది.
టీడీపీ నిర్ణయం ఇక్కడే..
ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం తెలంగాణ ప్రక్రియను తిరిగి ప్రారంభించింది. కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సమయంలో ఈ భేటీ జరిగింది. అప్పటికి టీడీపి వైఖరిపై అనుమానాలు తలెత్తాయి. అఖిలపక్షంలో ఏం చెప్పాలన్నది నిర్ణయించేందుకు టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశాన్ని జిల్లాలోనే నిర్వహించారు. అఖిలపక్షానికి పార్టీ తరఫున పంపే లేఖను ఇక్కడే తయారు చేశారు.
- సాక్షి, కరీంనగర్
జేఏసీలో కీలకం...
తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు ఉద్యమంలో చరిత్రాత్మక ఘట్టం. రాజకీయ పార్టీలతో పాటు విభిన్న భావజాలాలుగల సంఘాలు సంస్థలన్నీ ఒకే వేదికకు వచ్చి ఉద్యమాన్ని ఉరకలేత్తించాయి. జేఏసీలో కీలకమైన కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, కో ఆర్డినేటర్ పిట్టల రవీందర్ ఇద్దరూ జిల్లావారే. మిలియన్‌మార్చ్, సడక్‌బంద్, రైలురోకో, సాగరహారం, సహాయ నిరాకరణ, సకల జనులసమ్మె... జేఏసీ ఆమ్ములపొది నుంచి వెలువడిన అస్త్రాలు. ఒక్కొక్కటీ ప్రభుత్వం మీద తెచ్చిన ఒత్తిడి అంతా ఇంతాకాదు. ఈ ఆందోళనలన్నింటికి జిల్లానుంచి ఉద్యమకారులు ఆటంకాలన్నింటినీ ఛేదించుకుంటూ వెళ్లారు. ప్రపంచాన్ని తనవైపు ఆకర్శించిన సకలజనుల సమ్మె ప్రకటన కూడా జిల్లా నుంచే వెలువడింది.
ఉద్యమ కన్నారం దుర్గం
Published Sun, Feb 23 2014 4:11 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement