కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ మార్చిలో జిల్లాలో పర్యటించే అవకాశాలున్నాయి. ఢిల్లీలో ఉన్న జిల్లా కాంగ్రెస్ నాయకులు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ నేతృత్వంలో శుక్రవారం రాత్రి సోనియాను కలుసుకున్నారు. తెలంగాణ ప్రజల అరవై ఏళ్ల కలను సాకారం చేసినందుకు జిల్లా ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాకు రావాల్సిందిగా నాయకులు ఆహ్వానించడంతో సోనియా సుముఖత వ్యక్తం చేశారు. మార్చి మొదటి వారం లేదా చివరి వారంలో వస్తానని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను సంప్రదించి పర్యటనను నిర్ధారణ చేసుకోవాలని ఆమె నాయకులకు సూచించారు. సోనియాను కలిసిన వారిలో కోలేటి దామోదర్, హర్కర వేణుగోపాల్, కె.రవీందర్‌రావు ఉన్నారు.
విజయోత్సవ సభగా..
తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు సోనియాకు కృతజ్ఞత సభ , తెలంగాణ విజయోత్సవ సభను భారీ స్థాయిలో నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నేతలు యోచిస్తున్నారు. గతంలో పలుమార్లు సభ వాయిదాపడగా, ప్రస్తుతం తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం, రాజపత్రం కొద్దిరోజుల్లో రానుండడం, ఎన్నికల సమయం కావడంతో సభను భారీ స్థాయిలో ఏర్పాటు చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సోనియాతోనే సభ నిర్వహించే దిశగా అడుగులు వేస్తున్నారు. 2004లో కరీంనగర్‌లోనే తెలంగాణకు అనుకూలంగా మాట ఇచ్చినందున, మళ్లీ అదే కరీంనగర్‌లో విజయోత్సవ సభ నిర్వహిస్తే, తెలంగాణలో పార్టీకి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని జిల్లా నేతలు అధిష్టానాన్ని ఒప్పిస్తున్నారు.
మార్చిలో జిల్లాకు సోనియా!
Published Sun, Feb 23 2014 4:14 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement