కట్టుబడ్డాం.. కల నెరవేర్చాం
కరీంనగర్ సభలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ
కాంగ్రెస్‌తోనే తెలంగాణ సాధ్యమైంది
అందరూ అడ్డుకున్నా ఇచ్చాం
బిల్లులో టీఆర్‌ఎస్ పాత్ర లేదు
బీజేపీతో దేశానికి ముప్పు.. టీడీపీది మతతత్వ బాట
సీమాంధ్రకు న్యాయం చేస్తాం..తెలంగాణను అభివృద్ధి చేస్తాం
వాగ్దానాలన్నీ నెరవేర్చుతాం.. మాట చెబితే చేసి చూపిస్తాం
ఉజ్వల భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌ను గెలిపించండి
కరీంనగర్: ‘మీ కల నెరవేర్చాం.. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చాం. అన్ని పార్టీలు అడ్డుకున్నా.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. వెనక్కితగ్గలేదు. దృఢ సంకల్పంతో నాలుగు కోట్ల ప్రజల న్యాయమైన కోరికను నెరవేర్చాం. కాంగ్రెస్ వల్లే ఇది సాధ్యమైంది. ఇక అభివృద్ధే నేను మీకిచ్చే హామి. జవాబుదారి పాలన అందిస్తాం. మీ రాష్ర్ట ఉజ్వల భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌కే ఓటెయ్యండి’ అని యూపీఏ చైర్‌పర్సన్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో బుధవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సోనియా ప్రసంగించారు. ‘మీరు మీ కలను సాకారం చేసుకునేందుకు 60 ఏళ్ల పాటు వేచి ఉన్నారు. దేనికోసమైతే ఉద్యమించారో ఆ కల సాకారమైంది. చివరకు అనుకున్నది సాధించారు.
మీ సంతోషాన్ని పంచుకునేందుకు నేను ఇక్కడికి వచ్చాను. కాంగ్రెస్ పార్టీ మీ కలను సాకారం చేసి చూపించింది. జూన్ 2న దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించబోతోంది’ అంటూ సోనియా తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి నివాళులు అర్పించడంతో పాటు.. ఉద్యమంలో పాలుపంచుకున్న వారందరికీ శిరస్సు వంచి వందనం చేశారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో సాయంత్రం 4.15 నిమిషాలకు కరీంనగర్ చేరుకున్న సోనియా.. సభా వేదికపై 13 నిమిషాల పాటు ప్రసంగించారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ సోనియా వెంట రాగా.. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కూడా వేదికపై ప్రసంగించారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వందన సమర్పణ చేశారు. సిట్టింగ్ ఎంపీలు పొన్నం ప్రభాకర్, వివేక్, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు సభ జరిగినంతసేపు వేదికపై ఉన్నారు. ప్రసంగాల అనంతరం.. పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులందరినీ పేరుపేరునా వేదికపైకి పిలిచి సభకు పరిచయం చేశారు.
సోనియా ప్రసంగ పాఠం..
‘‘కాంగ్రెస్ పార్టీ మీ ఆకాంక్షను అర్థం చేసుకుంది. కానీ మీ కల నెరవేర్చడానికి చాలా సమయం పట్టింది. అందరినీ మెప్పించడంలోనే ఆలస్యమైంది. చివరకు ప్రయత్నం ఫలించింది. మీకు మీ అధికారం.. మీ వాటా ఇవ్వాలని నిర్ణయించాం. రెండు ప్రాంతాలు నా హృదయంలో ఉన్నాయి. సీమాంధ్రకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. వాళ్లను నిరాశకు గురి చేయం. రాష్ట్రంలోని 10 జిల్లాలు.. అందులో నివసించే నాలుగు కోట్ల ప్రజల న్యాయమైన కోరికను నెరవేర్చేందుకే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. సామాజిక న్యాయాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నాం. కాంగ్రెస్ దృష్టిలో సామాజిక న్యాయమంటే.. దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలందరికి సమానావకాశాలు కల్పించడం, వారి చేతికి రాజ్యాధికారమివ్వడం. ఇతర పార్టీలకు తెలంగాణ అంశం రాజకీయ ప్రయోజనం కావచ్చు. కానీ.. కాంగ్రెస్ పార్టీ దృఢ సంకల్పంతోనే తెలంగాణ ఇచ్చింది. కేవలం కాంగ్రెస్‌తోనే తెలంగాణ వచ్చింది. ఇందులో ఎలాంటి అనుమానమూ లేదు. తెలంగాణ బిల్లు రూపకల్పనతో పాటు లోక్‌సభ, రాజ్యసభల్లో ఆమోదం పొందేలా చూడటం కాంగ్రెస్‌కే సాధ్యమైంది.
అన్ని పార్టీలు అడ్డుపడ్డాయి
రాజ్యసభలో బీజేపీ చివరి వరకు తెలంగాణను వ్యతిరేకించింది. లోక్‌సభలో బిల్లును అడ్డుకునేందుకు టీడీపీ ప్రయత్నించింది. వైఎస్సార్‌సీపీ ప్రతి సందర్భంలోనూ అడ్డుపడింది. తెలంగాణ బిల్లు ఆమోదంలో టీఆర్‌ఎస్ పాత్రేమీ లేదు. 2001 ఏప్రిల్‌లో టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించింది. అంతకంటే.. ఏడు నెలల ముందే 2000 సెప్టెంబర్‌లో మహబూబ్‌నగర్‌లో జరిగిన పార్టీ సమావేశంలో 40 మంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తెలంగాణ కావాలని కోరుతూ నాకు నివేదించారు.
మతతత్వ బీజేపీ బాటలో టీడీపీ
లంగాణ ప్రాంత ప్రజలు లౌకిక విలువలను, సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. అది మన దేశానికి ప్రతీక. ఈ విలువలు కాపాడేందుకు మహాత్మగాంధీ, ఇందిరమ్మ, రాజీవ్‌గాంధీ ఇంకా ఎందరో మహానుభావులు బలిదానాలు చేశారు. ఇప్పుడు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌తో దేశంలో సెక్యులరిజం ప్రమాదంలో పడింది. బీజేపీ సంబంధిత పార్టీలు మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనిపైనే రాజకీయం చేస్తున్నాయి. టీడీపీ అదే సాంప్రదాయాన్ని అనుసరిస్తోంది. అధికారంలోకి రావాలనే ఆరాటంతో రాబోయే రోజుల్లో మరిన్ని పార్టీలు బీజేపీతో జత కట్టవచ్చు. ఈ ప్రమాదాన్ని గుర్తెరిగి.. అందరూ జాగ్రత్తగా ఉండాలి. వాళ్ల మాయమాటల్లో పడకండి. కాంగ్రెస్ పార్టీ ఏ మతానికి.. ధర్మానికి తలొగ్గకుండా సమానంగా చూస్తోంది. అదే మా అభిమతం.
ప్రాణహితకు జాతీయ హోదా
యూపీఏ ప్రభుత్వం తరఫున తెలంగాణ అభివృద్ధికి ఎన్నో హామీలిచ్చాం. ఆ దిశగానే మేనిఫెస్టోను రూపొందించాం. 4000 మెగావాట్ల పవర్ ప్లాంటుకు హామీ ఇచ్చాం. దేశంలోనే ఇది అతి పెద్ద విద్యుదుత్పత్తి కేంద్రమవుతుంది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి పదేళ్ల పాటు పన్ను మినహాయింపులిస్తాం. హైదరాబాద్‌లో వచ్చే ఆదాయమంతా తెలంగాణ అభివృద్ధికే కేటాయిస్తాం. రానున్న రోజుల్లో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా కల్పిస్తాం. అన్ని వర్గాలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కాంగ్రెస్ నెరవేరుస్తుంది. మాట చెబితే.. చేసి చూపిస్తాం. పారదర్శకమైన జవాబుదారీ పాలన అందిస్తాం.
టీఆర్‌ఎస్ పార్టీవి బెదిరింపు మాటలు
ఉద్యమాల సమయం అయిపోయింది. ఆందోళనలన్నీ అయిపోయాయి. ఇప్పుడు బాధ్యతాయుతమైన ప్రభుత్వం అవసరం. ఇది కేవలం కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల మాట వింటుంది. అందరినీ కలుపుకొనిపోతుంది. టీఆర్‌ఎస్ కేవలం భయపెట్టి.. బెదిరించే మాటలు మాట్లాడుతుంది. రాష్ట్రాన్ని సాధించుకోవడం కన్నా ప్రయోజనమేముంటుంది? తెలంగాణ, సీమాంధ్ర ప్రజలంతా విశాల హృదయంతో సోదరభావం.. స్నేహభావంతో మెలగాలని విజ్ఞప్తి చేస్తున్నా.
అభివృద్ధే మా హామీ
సమాజంలోని అన్ని వర్గాలు.. అన్ని ప్రాంతాల అభివృద్ధికి యూపీఏ ప్రభుత్వం పరితపించింది. ఆ దిశగా ఎన్నో చర్యలు చేపట్టింది. ప్రతి పౌరుడి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని చట్టపరమైన హక్కులు కల్పించింది. మేమేం చేశామో ప్రజలందరికీ తెలుసు. భవిష్యత్తులో కూడా తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా ఇలాంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే చేపడతాం. ఇదే నా సంకల్పం. ఇదే నేను మీకిచ్చే హామీ. ఏప్రిల్ 30న ఎన్నికలు జరగబోతున్నాయి. మీ రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం.. తెలంగాణలో శాంతి, సామాజిక న్యాయం, ఆర్థిక ప్రగతితో పాటు అందరూ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌కు ఓటెయ్యండి’’
తెలంగాణ దేవత సోనియా: పొన్నాల
ఎక్కడైతే మాట ఇచ్చిందో.. ఆ మాటను నెరవేర్చి అక్కడికే వచ్చిన దేవత సోనియా అని పొన్నాల లక్ష్మయ్య కొనియాడారు. సామాజిక తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుందన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం కూడా కాంగ్రెస్‌తోనే సాధ్యపడుతుందన్నారు. ఆచరణ సాధ్యమయ్యే, ఆమోదయోగ్యమైన, ప్రజలకు అవసరమైన అంశాలనే తాము ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచామన్నారు. ఎలాగూ అధికారంలోకి రాలేమనే భావనతోనే టీఆర్‌ఎస్.. ఆచరణ సాధ్యం కాని హామీలిస్తోందని విమర్శించారు.
కేసీఆర్ మోసగాడు: దామోదర
తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని, దళితుడిని సీఎం చేస్తానని, ముస్లింను డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మాట తప్పారని దామోదర రాజనర్సింహ ధ్వజమెత్తారు. ఇలాంటి మోసగాని చేతిలో తెలంగాణ పెడతామా? అని ప్రశ్నించారు. ముమ్మాటికి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా.. టీఆర్‌ఎస్ దగా పార్టీ అని వ్యాఖ్యానించారు. సీమాంధ్రలో పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా.. తెలంగాణ కలను సోనియా నిజం చేశారన్నారు. కాగా, తెలంగాణను ప్రగతి శీల రాష్ట్రంగా మార్చుతామని, సామాజిక న్యాయం అమలు చేస్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్‌లో ఇచ్చిన మాటను నెరవేర్చినందుకు సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రసంగం అర్థం కాక..
సభకు భారీగా జనం తరలివచ్చారని కాంగ్రెస్ నేతలు హుషారుగా ఉన్నప్పటికీ సోనియా ప్రసంగం వినబడక.. ఆమె కనబడక జనం ఢీలా పడ్డారు. పైగా ఆమె 13 నిమిషాల పాటు హిందీలో ప్రసంగించారు. దాన్ని అనువదించే వారెవరూ లేకపోవడంతో.. ఆమేం మాట్లాడుతున్నారో అర్థం కాని వారందరూ ప్రేక్షక పాత్ర పోషించారు. ప్రసంగం అనంతరం వేదిక ముందున్న గ్యాలరీల వైపు సోనియా రావడంతో.. ఆమెతో కరచాలనం చేసేందుకు జనం ఎగబడ్డారు. ఏకంగా బారీకేడ్లు ఎక్కి సోనియా అభివాదం చేయడంతో మహిళలు అరుపులు కేకలతో జై కొట్టారు.
వేదికపై నేతల కుర్చీలాట!
సభా వేదికపై ఆ పార్టీ నేతలు మ్యూజికల్ చైర్ ఆడుకున్నారు! సోనియాతో కలిసి వేదికపై కూర్చునేందుకు నేతలు పోటీ పడ్డారు. ఎవరు ఎక్కడ కూర్చోవాలో.. ఎంత మందిని వేదికపైకి అనుమతించాలన్న స్పష్టత లేక గందరగోళం ఏర్పడింది. వేదికపై తొమ్మిది మంది కూర్చునేందుకు వీలుగా సీట్లు వేశారు. వేదికపైకి సోనియా వెళ్లకముందే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పరిచయ కార్యక్రమం ఉంటుందని భద్రతా సిబ్బందితోపాటు పార్టీ సీనియర్లు హడావుడి చేశారు. మేడమ్ హెలికాప్టర్ కిందకు దిగకముందే.. అభ్యర్థులను వేదికకు కుడివైపు క్యూలో నిలబెట్టారు. కానీ.. ఎడమవైపు నుంచి వచ్చిన సోనియా నేరుగా వేదికపైకి వెళ్లారు. ఆమెతోపాటు పీసీసీ అధ్యక్షుడు పొన్నాల, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాజనర్సింహ, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్ వేదికపైకి చేరుకున్నారు. ఎవరికివారుగా కండువా కప్పి సోనియాకు కృతజ్ఞతలు తెలిపారు. వేదికపైకి వచ్చిన దిగ్విజయ్ కాసేపు సోనియాతో మాట్లాడి.. ప్రసంగానికి సంబంధించిన నోట్స్ ఇచ్చి వెళ్లారు. కొంతసేపటి వరకు అక్కడి సీట్లలో కూర్చునేందుకు నేతలెవరూ సాహసం చేయలేదు.
కానీ ఎవరికి వారుగా మేడమ్‌తో మాట్లాడాలని.. ఆమె దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాజనర్సింహ కొద్దిసేపు వెనుక సీట్లలో కూర్చున్న సమయంలో.. పొన్నం ప్రభాకర్ సోనియా పక్కనే కూర్చొని వెళ్లారు. తర్వాత పొన్నాల, రాజనర్సింహ ఇరుపక్కల సీట్లలో ఆసీనులయ్యారు. మధ్యలో వచ్చిన ఎంపీ వివేక్ కాసేపు సోనియా పక్కన కూర్చున్నారు. తన ప్రసంగం అనంతరం సోనియా.. పక్కనే ఉన్న రాజనర్సింహ, వెనుక సీట్లో ఉన్న శ్రీధర్‌బాబుతో ముచ్చటించడం కనిపించింది. ఇక సీనియర్ నాయకులు జానారెడ్డి, డి.శ్రీనివాస్ ఈ సభలో అంటీముట్టన్నట్లు ఉన్నారు. సభ జరిగినంత సేపూ వేదికపై కనిపించని వీరిద్దరూ.. చివరకు పేరు పేరునా అభ్యర్థులను పరిచయం చేసే సమయంలోనే సోనియాను కలిసి నమస్కరించారు. డీఎస్‌ను చూసిన సోనియా.. ఆయన పేరు పిలువలేదా అంటూ మైక్ దగ్గరున్న పొన్నాలను ప్రశ్నించారు. ‘ఆల్ రెడీ ఐ టోల్డ్ మేడమ్ (ఇప్పటికే చెప్పాను)’ అంటూ పొన్నాల విన్నవించుకోవడం చర్చనీయాంశమైంది.