సోనియా.. మానియా | Sonia .. Mania | Sakshi
Sakshi News home page

సోనియా.. మానియా

Published Thu, Apr 17 2014 4:11 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

సోనియా.. మానియా - Sakshi

సోనియా.. మానియా

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాక కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. బహిరంగ సభ ఆశించిన రీతిలో విజయవంతం కావడంతో ఉత్తేజం కనిపిస్తోంది. తెలంగాణపై మాట ఇచ్చిన చోటే సోనియా సభ నిర్వహించి.. మాట నిలబెట్టు కున్నామని ప్రజలకు చెప్పించాలనే కాంగ్రెస్ నేతల ప్రయత్నం ఫలించినట్లే కనిపించింది  
  - న్యూస్‌లైన్, కరీంనగర్ సిటీ
 
 ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ బహిరంగ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నిండింది. తెలంగాణపై మాట ఇచ్చిన చోటే సభ నిర్వహించి మాట నిలబె ట్టుకున్నామని ప్రజలకు చెప్పించాలనే కాంగ్రెస్ నేతల ప్రయత్నం ఫలించినట్లే కనిపించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్‌తోనే సాధ్యమైందనే అంశాన్ని, తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీతోనే స్పష్టం చేసేందుకు కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మకంగా కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో బుధవారం సభ ఏర్పాటు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా సోనియా ప్రచార సభ ఒక్క కరీంనగర్‌లోనే నిర్వహించడంతో పార్టీ నేతలు ఈ సభపైనే గంపెడాశలు పెట్టుకున్నారు. సభకు వేలాది మంది జనం తరలిరావడంతో ఆ పార్టీ నేతలు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి, ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ నష్టపోయి తెలంగాణ ఇచ్చినందుకు, ప్రజల ఆదరాభిమానాలు కాంగ్రెస్‌కే దక్కాయనే సంకేతాన్ని సభ విజయవంతం ద్వారా సోనియాకు ఇచ్చామనే సంబరాల్లో ఉన్నారు. సభకు హాజరైన జనసందోహాన్ని చూసిన సోనియా కూడా సంతోషంతోనే ఉన్నారని, అందుకే ప్రసంగం అనంతరం ప్రజలకు అభివాదం చెప్పేందుకు ఎక్కువ సమయం కేటాయించారని పార్టీ నేతలు అంటున్నారు.

 కిక్కిరిసిన సభ..

 సోనియా రాక సందర్భంగా అంబేద్కర్ స్టేడియం జనంతో కిక్కిరిసిపోయింది. సాయంత్రం 4 గంటలకు సభ అయినప్పటికి మధ్యాహ్నం 2 గంటల నుంచే ప్రజలు స్టేడియంకు రావడం కనిపించింది. అనుకున్న సమయానికి కాస్త ఆలస్యంగా 4.20 గంటలకు సోనియా సభా వేదిక వద్దకు చేరుకొనే సమయానికి స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయింది. సమీపంలోని భవనాలపై జనం నిండిపోయారు. కొంతమంది చెట్లపెకైక్కి సోనియాను చూసేందుకు ఎగబడ్డారు. స్టేడియం సామర్థ్యం 50 వేలు కాగా, కుర్చీలు వేయడంతో అనుకున్న మేరకు ప్రజలు లోనికి రాలేకపోయారు. స్టేడియం లోపల ఎంతమంది ఉన్నారో అంతకు ఎక్కువ జనాలు బయటే ఉండిపోయారు. స్టేడియంలో పలుచోట్ల స్క్రీన్‌లు ఏర్పాటు చేయడంతో సోనియా ప్రసంగం వినేందుకు స్క్రీన్‌ల ముందు ప్రజలు గుమిగూడారు. ప్రసంగం ముగిసిన అనంతరం సోనియా వేదిక దిగి ప్రజల వద్దకు వచ్చారు. సోనియాతో కరచాలనం చేయడానికి మహిళలు పోటీపడ్డారు. ఒకదశలో అందరికి కనిపించేందుకు సోనియా బారికేడ్‌పెకైక్కి అభివాదం చేయడంతో మహిళలు, యువకులు కేరింతలు కొట్టారు.

 సోనియాతో కరచాలనానికి పోటీ..

 సోనియాగాంధీతో కరచాలనం చేయడానికి, కండువాలు కప్పేందుకు పార్టీ నాయకులు పోటీపడ్డారు. రాకరాక వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలనే తపనతో సీనియర్ల నుంచి జూనియర్ల వరకు అందరూ ఉత్సాహం చూపారు. సోనియా కలెక్టరేట్‌లోని హెలిప్యాడ్ వద్ద హెలిక్యాప్టర్ దిగి ప్రత్యేక వాహనంలో స్టేడియంలోని 4వ నంబర్ గేట్ ద్వారా లోనికి ప్రవేశించారు. అక్కడ వాహనం దిగిన సోనియా వేదిక వద్దకు నడుచుకుంటూ వచ్చారు. ఆ సమయంలో క్యూలో నిలుచున్న నేతలు ఆమెతో కరచాలనం చేశారు. కండువాలు కప్పారు.

వేదికకు కుడివైపున కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులు నిలుచుని ఉన్నప్పటికీ వారి వద్దకు వెళ్లకుండా సోనియా నేరుగా వేదికనెక్కారు. ప్రసంగం అనంతరం అభ్యర్థులను పేరుపేరునా పొన్నాల లక్ష్మయ్య సోనియాకు పరిచయం చేశారు. కరీంనగర్, సిరిసిల్ల అసెంబ్లీ అభ్యర్థులు చల్మెడ లక్ష్మీనర్సింహారావు, కొండూరు రవీందర్‌రావు సిల్వర్‌ఫిలిగ్రీతో చేసిన బహుకరణలు అందచేశారు. ఎంపీ పొన్నం ప్రభాకర్ సోనియా సమక్షంలో తెలంగాణ నినాదాలు చేసి, జనంతో జై కొట్టించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement