సాక్షి నెల్లూరు: వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, నెల్లూరు జిల్లా ఓజిలి మండలం సగుటూరులో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జెండా వందనం చేశారు. అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగ రచనకు కృషి చేసిన మహనీయులను గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు విశ్వవ్యాప్తంగా ఉన్న భారతీయులకు వైఎస్ జగన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని, చట్టబద్ధ పాలనను నిలబెట్టడంతోపాటు పౌరహక్కులను పరిరక్షిండంలో సామాజిక న్యాయాన్ని అందించడంలో రాజ్యాంగం మహోన్నత పాత్ర పోషించిందని, ఒక రక్షణ కవచంగా నిలిచిందని వైఎస్ జగన్ పేర్కొన్నారు,
కేంద్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు : వైఎస్ఆర్‌సీపీ కేంద్రకార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పార్టీ సీనియర్ నేతలు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, వివేకానంద రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్ర కార్యాలయంలో : విజయవాడలోని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగ ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరాలని ఆయన ఆకాక్షించారు. ప్రజలకు సంక్షేమాన్ని చేరువ చేసేందుకే వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర చేపట్టారని అన్నారు. నిజమైన ప్రజాసంక్షేమరాజ్యం వైఎస్ జగన్ ద్వారానే సాధ్యం అని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, పార్టీ నేతలు కె.పార్థసారథి, ఎమ్మెల్యేలు మేకా ప్రతాప్ అప్పారావు, రక్షణనిధి, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment