ఈసారి అక్కడ జెండా ఎగరేసేది అమ్మాయిలే..
అహ్మదాబాద్: గుజరాత్ ప్రభుత్వం ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలను అందరికీ స్ఫూర్తిదాయకంగా నిర్వహించనుంది. తమ రాష్ట్రంలోని అన్ని (ప్రభుత్వ, ప్రభుత్వేతర) పాఠశాలల్లో జాతీయ పతాకాలను ఆయా గ్రామాల్లో బాగా చదివిన బాలికలు, యువతులతో ఎగరేయిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని జిల్లాల ప్రాథమిక విద్యాశాఖ అధికారులకు ఆదేశాలను పంపించింది.
అంతేకాకుండా, ఈ ఏడాది అంటే 2016లో ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులను ప్రత్యేకంగా ప్రభుత్వం తరుపున ఆ రోజు సన్మానించనుంది. ఇందుకోసం ఆయా పాఠశాలకు ప్రభుత్వమే రూ.300 కేటాయించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి రిపబ్లిక్ డే నాడు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి థీమ్ గా 'బేటీ కో సలాం, దేశ్ కే నామ్' అని నిర్ణయించారు. బాలికల విషయంలో లింగవివక్షను రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వంతోపాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.