సాక్షి, వైఎస్సార్: రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 300వ రోజుకు చేరిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు వేడుకలు జరుపుకుంటున్నారు. ఇటీవల తనపై హత్యాయత్నం జరిగిన కూడా.. చికిత్స అనంతరం వైఎస్ జగన్ తిరిగి పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. నేటితో జననేత చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 300వ రోజుకు చేరుకున్న సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
వైఎస్సార్ జిల్లా కేంద్రంలోని ఆకులవీధి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వైఎస్సార్ సీపీ యువజన విభాగం నేతలు పండ్లు పంపిణీ చేశారు. వైఎస్సార్ సీపీ కడప అసెంబ్లీ యువజన విభాగం అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య ఆధ్వర్యంలో విద్యార్థుల మధ్య కేక్ కట్ చేశారు.
వైఎస్ జగన్ పాదయాత్ర దిగ్విజయంగా 300 రోజులకు చేరుకున్న సందర్భంగా వైఎస్సార్ జిల్లాలోని రైల్వేకోడూరు టోల్‌గేట్ వద్ద దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. ఆ తర్వాత కేక్ కట్‌చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు కొరుమట్ల శ్రీనివాసులు, అంజద్ భాష, పార్లమెంట్ అధ్యక్షుడు అమర్‌నాథ్ రెడ్డి పాల్గొన్నారు. తనపై హత్యాయత్నం జరిగిన లెక్కచేయకుండా.. జనం కోసం పరితపిస్తూ వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగిస్తున్నాడని నేతలు పేర్కొన్నారు.
విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 300 రోజులకు చేరుకున్న సందర్భంగా జగదాంబ సెంటర్లో విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త పైడి వెంకటరమణ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి బెలూన్లు ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షులు ముళ్ల విజయప్రసాద్, పార్లమెంట్ సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ, మహిళా కన్వీనర్ గరికిన గౌరి పాల్గొన్నారు.
అలాగే 57వ వార్డు అధ్యక్షుడు దాడి నూకరాజు ఆధ్వర్యంలో కోటనరవలో భారీ ర్యాలీ చేపట్టారు. ఆ తర్వాత కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్సార్ సీపీ అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త వరుదు కల్యాణి హాజరయ్యారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి టీడీపీ ఓర్వలేకపోతుందని కల్యాణి అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా 2019లో వైఎస్ జగన్ సీఎం అవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
అనంతపురం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర 300 రోజులకు చేరుకున్న సందర్భంగా గుంతకల్లు వైఎస్సార్ సీపీ కార్యాలయంలో కేక్ కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. జననేతపై ఎన్ని కుట్రలు చేసినా.. 2019లో ఆయన సీఎం కావడం ఖాయమని తెలిపారు.
11 జిల్లాలో పాదయాత్ర పూర్తి..
2017, నవంబర్ 6వ తేదీన ప్రారంభమయిన వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర ఇప్పటివరకు 11 జిల్లాలో పూర్తయింది. జననేత ఇప్పటి వరకు వైఎస్సార్, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్టణం జిల్లాల్లో ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేశారు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో జననేత పాదయాత్ర కొనసాగుతుంది. జిల్లాలో ఒక కురుపాం నియోజకవర్గం మాత్రమే మిగిలి ఉంది. ఇది పూర్తయ్యాక చివరిగా శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ జగన్ పాదయాత్ర ప్రవేశిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment