సంక్షోభంలో కంకర మిల్లులు | Gravel mills in crisis | Sakshi
Sakshi News home page

సంక్షోభంలో కంకర మిల్లులు

Published Fri, Aug 7 2015 1:45 AM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM

సంక్షోభంలో కంకర  మిల్లులు

సంక్షోభంలో కంకర మిల్లులు

కంకరమిల్లులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. పెట్టిన పెట్టుబడికి, దాని మీద వచ్చే లాభాలకు పొంతన లేకుండా పోతుంది. ఒక్కో కంకర మిల్లుపై మిల్లుల యజమానులు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నిర్వహణ ఖర్చులు భరించలేక చివరకు నష్టాలు మూటగట్టుకుంటున్నారు.
 
- 1997లో స్లాబు కంకర యూనిట్ ధర రూ. 2800, నేడు రూ. 1600
- నాడు రా మెటీరియల్ రూ. 180, నేడు రూ. 700
- నాడు కరెంటు యూనిట్‌కు రూ. 0.50పై, ఇప్పుడు రూ. 7
- నష్టాలలో కూరుకుపోయిన కంకరమిల్లులు
చీమకుర్తి:
చీమకుర్తి మండలంలోని రామతీర్థం, యల్లయ్యనగర్, బూదవాడ, పల్లామల్లి ప్రాంతాల్లో దాదాపు 80 వరకు కంకర మిల్లులు ఉన్నాయి. వాటిలో దాదాపు 15 మిల్లుల వరకు మూతపడ్డాయి. మరో 20 మిల్లులు నష్టాలకు దగ్గరలో ఉన్నాయి. సొంత మిల్లు, రాజకీయ పలుకుపబడి ఉన్న వారు తప్ప మిగిలిన వారు మిల్లులు నడపడం కష్టమే అంటున్నారు. 1994-95లో స్లాబు కంకర(20 ఎం.ఎం)కు ఉపయోగించే మెటీరియల్ యూనిట్ ధర రూ. 2500 పలికింది. అది 1998వ సంవత్సరానికి వచ్చే సరికి అత్యధికంగా రూ. 2800 ధర పలికింది.

ఒకప్పుడు కరెంటు చార్జీలు యూనిట్ ధర రూ. 0.50పై నుంచి రూ. 1.00పై వరకు మాత్రమే ఉండేది. మిల్లులకు అందించే రా మెటీరియల్ కూడా రూ.180 మాత్రమే ఉండేది. అలాంటిది నేడు కరెంట్ యూనిట్ ధర రూ. 7కు పెరిగింది. రా మెటీరియల్ ధర రూ. 700కు పెరిగింది. కానీ స్లాబుకు ఉపయోగించే 20 ఎం.ఎం కంకర మాత్రం రూ.1600కు పడిపోయింది. వెయ్యి ఇటుక నేడు రూ. 4800 పలుకుతుండగా కంకర(20.ఎం.ఎం) మాత్రం రూ. 1600 వద్దే ఆగింది. ఈ లెక్కన ఒక్కో కంకర మిల్లు రోజుకు సరాసరిన 10 యూనిట్లు కంకర ఉత్పత్తి చేస్తున్నాయి. మండల పరిధిలోని 80 కంకర మిల్లులు సరాసరిన రోజుకు 800 యూనిట్లు ఉత్పత్తి చేస్తున్నాయి. ఉత్పత్తి చేసే కంకరలో సగానికి పైగా 20 ఎం.ఎం కంకర ఉత్పత్తి చేస్తుండగా మిగిలిన సగంలో 6ఎం.ఎం (బేబీ), 40 ఎం.ఎం (రోడ్డు మెటల్, డస్ట్)ఉంటుంది.  
 
నష్టాలకే అదే కారణమా?
రామతీర్థం పరిధిలో గ్రానైట్ క్వారీలు ఉండటంతో ఎక్కువ కంకర మిల్లులు ఏర్పడటానికి కారణమైంది. కాంట్రాక్టర్‌లుగా ఉన్న వారు, రాజకీయ పలుకుబడి ఉన్న కంకర మిల్లుల యజమానులే నష్టాలు వచ్చినా తట్టుకోగ లిగి ఇంకా కంకర మిల్లులు నడుపుతున్నారే తప్ప కేవలం కంకర మిల్లులే ఆధారంగా వ్యాపారం సాగించేవారి పరిస్థితి దయనీయంగా ఉంది.  మిల్లులకు ప్రభుత్వం కరెంటు రాయితీలు, అదృష్టం కలిసొచ్చి ఇళ్ల నిర్మాణం పెరగటం, కాంట్రాక్ట్ పనులు పెరిగితేనే కంకర మిల్లులు నష్టాల నుంచి బయట పడగలమని మిల్లు యజమానులు చెబుతున్నారు.
ధర పెరిగింది లేదు
 - మేదరమెట్ల శ్రీనివాసులు,
 
మిల్లు యజమాని, బూదవాడ

కంకర మిల్లులు పెట్టాక 1998వ సంవత్సరంలో మాత్రమే స్లాబు కంకరకు రూ. 2800 ధర వచ్చింది. అప్పటి నుంచి దాని ధర తగ్గుతూనే వచ్చింది. ప్రస్తుతం యూనిట్ ధర రూ. 1600కు పడిపోయింది. కరెంటు బిల్లులు, రా మెటీరియల్ ధరలు మాత్రం పెరుగుతునే ఉన్నాయి. ఇంక మిల్లు యజమాని కోలుకునేదెక్కడ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement