మహా మార్పు
- జీవీఎంసీ కమిషనర్సత్యనారాయణను తప్పించిన సర్కారు
- పేరుకుపోయిన ఆరోపణల చిట్టా
- జేసీకి తాత్కాలిక బాధ్యతలు
- వుడా ఇన్‌చార్జిగా ఈపీడీసీఎల్ సీఎండీ
సాక్షి, విశాఖపట్నం : జీవీఎంసీ కమిషనర్ పోస్టు నుంచి సత్యనారాయణ ప్రభుత్వం తప్పిం చింది. ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి పోస్టింగ్ ఇచ్చేంత వరకు సాధారణ పరిపాలనా విభాగంలో రిపోర్టింగ్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఆయన ఇప్పటి వరకు జీవీఎంసీ కమిషనర్‌తోపాటు, వుడా వీసీగా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ రెండు స్థానాలూ ఖాళీ అయ్యాయి.
కమిషనర్‌గా జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం జీవీఎంసీ అదనపు కమిషనర్ ఎం.జానకి ఫేజ్-3 మిడ్ కెరీర్ శిక్షణలో ఉన్నారు. ఆమె అక్టోబర్ 8న తిరిగి విధుల్లో చేరనున్నారు. ఆమె విధుల్లో చేరాక జేసీ ప్రవీణ్ కుమార్ నుంచి జీవీఎంసీ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టేలా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వుడా వీసీగా ఈపీడీసీఎల్ సీఎండీ ఎం.వి.శేషగిరిబాబుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి రానున్నాయి.
ఆరోపణలే కారణమా?
1993 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఎం.వి.సత్యనారాయణను 2012 ఆగస్టు 27న జీవీఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆరంభంలో పాలనాపరంగా కాస్త కఠినంగానే వ్యవహరించినప్పటికీ రాన్రానూ స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు లోనై పక్కదారిపట్టారన్న ఆరోపణలున్నాయి.
పార్టీతో సంబంధం లేకుండా పూర్తిగా ఓ మంత్రికే అనుకూలంగా వ్యవహరించడం కూడా మిగిలిన వారిలో ఆగ్రహానికి కారణమయింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ వైఖరి మరింత పెరిగింది. మున్సిపల్ మంత్రితో జరిగిన సమీక్షా సమావేశంలో ఇదే విషయంపై టీడీపీకే చెందిన కొందరు ఎమ్మేల్యేలు బాహాటంగానే ఆరోపణలు గుప్పించారు.
గాజువాక ప్రాంతానికి చెందిన టీడీపీ మాజీ కార్పొరేటర్లు కమిషనర్ తీరును ఎండగట్టారు. జీవీఎంసీ నీటి సరఫరా విభాగానికి చెందిన పర్యవే క్షక ఇంజినీరు(ఎస్‌ఈ) మరియన్న ఆరోపణలు కల్లోలం రేపాయి. కమిషనర్ రెండేళ్ల పాలనలో రూ.వందల కోట్ల బిల్లులు ప్రాధాన్యతతో పనిలేకుండా కమీషన్ల కోసం అడ్డగోలుగా చెల్లించినట్టు సమాచారహక్కు చట్టం(ఆర్‌టీఏ) ద్వారా సేకరించిన సమాచారాన్ని బయటపెట్టారు.
కొన్నాళ్లుగా వివిధ విభాగాల్లో అవినీతి, అక్రమాలపై పత్రికల్లో వచ్చిన కథనాల్ని జోడించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. జీవీఎంసీ కాంట్రాక్టర్లు కొందరు కమిషనర్ అవినీతికి పాల్పడుతున్నారంటూ కోర్టులో కేసు దాఖలు చేయడం అప్పట్లో చర్చనీయాంశమయింది. వీటితోపాటు ఓ మంత్రికే అనుకూలంగా వ్యవహరించడంతో టీడీపీకి చెందిన మరో మంత్రి ముఖ్యమంత్రి వద్ద ఈయనకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ ఫిర్యాదుల కారణంగానే ఆయన్ని బదిలీ చేసినా ఎక్కడా పోస్టింగ్ కేటాయించలేదని సమాచారం.
‘ప్రత్యూష’ కమిటీతో కొత్త నియామకాలు!
ఐఏఎస్‌ల కేటాయింపుపై ప్రత్యూష సిన్హా కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ కమిటీ నివేదిక అమలైతే రాష్ట్రానికి ఐదుగురు ఐఏఎస్‌లను కేటాయించే అవకాశాలున్నట్టు సమాచారం. ఈ కేటాయింపులు పూర్తయ్యాకే జీవీఎంసీకి, వుడాకు పూర్తి స్థాయి అధికారుల్ని కేటాయించనున్నట్టు తెలిసింది. జీవీఎంసీ కమిషనర్‌గా వచ్చేందుకు ఇప్పటికే కొందరు ప్రయత్నిస్తున్నారు. పంచాయితీరాజ్ కమిషనర్ వరప్రసాద్, అనంతపురం జేసీ సత్యనారాయణ, గతంలో విశాఖ జేసీగా పనిచేసిన గిరిజాశంకర్ పోటీలో ఉన్నట్టు సమాచారం. గతంలో ఈ స్థానానికి విజయనగరం కలెక్టర్‌గా పనిచేసిన వీరబ్రహ్మయ్య పేరు దాదాపు ఖరారైనప్పటికీ ఆయన్ని తెలంగాణాకు కేటాయించడంతో కొత్తవారు ప్రయత్నాలు మొదలెట్టారు.