పుచ్చలపల్లి సుందరయ్య
సాక్షి, కృష్ణా : కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, తెలంగాణా సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు పుచ్చలపల్లి సుందరయ్యను గన్నవరం వాసులు మూడుసార్లు తమ శాసనసభ్యుడిగా ఎన్నుకున్నారు. కమ్యూనిస్టు ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన గన్నవరం ప్రాంతంపై ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉండేది. ఆయన అసలు పేరు పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి. అయితే ‘రెడ్డి’ అనే కులసూచికను తొలగించుకుని నిరాడంబరతతో ఆదర్శ జీవితం గడిపారు. పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం కలిగితే తన ప్రజాసేవకు బంధాలు, బాంధవ్యాలు అడ్డుగా నిలుస్తాయని భావించిన ఆయన వివాహ అనంతరం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నారు. అంతే కాకుండా తండ్రి నుంచి వంశపార్యంపరగా వచ్చిన ఆస్తులను కూడా నిరుపేదలకు వితరణ చేశారు. నియోజకవర్గం ఆవిర్భవించిన తర్వాత తొలిసారి 1955లో జరిగిన ఎన్నికల్లోనూ, తరువాత 1962, 1978లలో మళ్లీ ఆయననే విజయం వరించింది. పేదలకు కిలో రూపాయి బియ్యాన్ని అందించాలని మొదలైన ఉద్యమానికి శ్రీకారం చుట్టింది సుందరయ్యే.
Comments
Please login to add a commentAdd a comment