Puchalapalli Sundarayya
-
విద్వేష రాజకీయాలను తిప్పికొట్టడమే నివాళి!
భౌతికంగా మన మధ్యలేకపోయినా చరిత్ర పుటల్లో సజీవంగా నిలిచిపోయే వ్యక్తులు కొందరే ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తులలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య (పీఎస్) ఒకరు. నెల్లూరు జిల్లా అలగానిపాడు గ్రామంలో 1913 మే 1వ తేదీన భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. తొలినాళ్లలో ఆయన మీద గాంధీజీ ప్రభావం ఉండేది. 1930లో మాలపర్రు గ్రామంలో కాంగ్రెస్ సత్యాగ్రహ కార్యక్రమంలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అయితే క్రమంగా ఆయనలో కాంగ్రెస్‌పై నమ్మకం సన్నగిల్లింది. మద్రాసు లయోలా కాలేజీలో చదువుతున్నప్పుడు కంభంపాటి సత్యనారాయణ, వీకే నరసింహన్, హెచ్డీ రాజాలతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో సోషలిస్ట్ సాహిత్యాన్నీ, కమ్యూనిస్ట్ మేనిఫెస్టోనూ అధ్యయనం చేశారు. అపుడే, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అమీర్ హైదర్ ఖాన్ కమ్యూనిస్ట్ పార్టీలో పని చేయాలని ఆహ్వానించారు. దీంతో డిగ్రీ అయిపోయిన తర్వాత పీఎస్ ఫుల్‌టైమర్‌గా పార్టీలో చేరారు. 1934లో అమీర్ హైదర్ ఖాన్ అరెస్ట్ కాగా ఆయన బొంబాయి వెళ్లారు. అక్కడే సోషలిస్ట్ భావాలుగల వ్యక్తుల వివరాలు సేకరించి కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణానికీ, విస్తరణకూ కృషి చేశారు. ఆ క్రమంలో 1938–1939లో ఇఎంఎస్ నంబూద్రిపాద్ కమ్యూనిస్ ్టపార్టీలో చేరారు. అలాగే తమిళనాడులో ఎంఆర్ వెంకట్రామన్, రామమూర్తి, తెలుగునాట మోటూరు హనుమంతరావు, లావు బాలగంగాధరరావు, తరిమెల నాగిరెడ్డి, ఈశ్వరరెడ్డి పార్టీలోకి వచ్చారు. 1940 ఆంధ్ర మహాసభ నుండి రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, చిర్రావూరి లక్ష్మీ నర్సయ్య, దేవులపల్లి వేంకటేశ్వరరావు, భీమిరెడ్డి నరసింహారెడ్డి, ధర్మబిక్షం, కృష్ణమూర్తి, ఆరుట్ల రామచంద్రారెడ్డి ఇంకా మరెందరో నిజాం స్టేట్‌లో కమ్యూనిస్ట్ పార్టీ లోకి వచ్చారు. అంతకు ముందే కవి మగ్దూవ్ు మొహియుద్దీన్ కమ్యూనిస్ట్ పార్టీవైపు వున్నారు. 1946–1951 మధ్య జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వేలాది మంది కమ్యూనిస్ట్ యోధులు ప్రాణాలు కోల్పోయారు. 1947 ఆగస్టు 15న దేశం స్వాతంత్య్రం పొందినప్పటికీ తన సంస్థానం ప్రత్యేక రాజ్యంగా కొనసాగాలని నిజాం రాజు పట్టుపట్టాడు. ఈ స్థితిలో 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం నిజాం సంస్థానాన్ని విలీనం చేసుకోవడానికి యాక్షన్ ప్రారంభించింది. తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగా అప్పటికి ఖమ్మం, వరంగల్, కరీంనగర్లో కొంత భాగం; నల్లగొండ జిల్లాలో మూడు వేల గ్రామాలు నిజాం, దొరల పాలన నుండి విముక్తి పొందాయి. పది లక్షల ఎకరాల భూమిని దేశ్‌ముఖ్‌ల, భూస్వాముల నుండి స్వాధీనం చేసుకొని దున్నేవారికి పంచారు. ఆయా గ్రామాలలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన గ్రామ రాజ్యాల ఏర్పాటుతో నిజాం పాలన బలహీనపడింది, మరోవైపు భారతసైన్యం ప్రవేశించడంతో నిజాం రాజు విలీనానికి అంగీకరించాడు. విలీనం తర్వాత భారత సైన్యం కమ్యూనిస్ట్ దళాలతో తలపడి చాలామందిని చంపింది. కమ్యూనిస్ట్ నాయకులు, దళ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లారు. అత్యంత శిక్షణ పొందిన భారత సైన్యంతో సాధారణ ఆయుధాలతో పోరాడలేని పరిస్థితి వచ్చింది. ఈ స్థితిలో పోరాట విరమణకు సంబంధించి దళాలతో చర్చించి నిర్ణయం తీసుకోవడానికి సుందరయ్య మారుపేరుతో రహస్యంగా పోరాట ప్రాంతాలలో పర్యటించారు. పలు మార్లు దళ సభ్యులూ, పార్టీ నాయకులతో మాట్లాడిన తర్వాత సాయుధ పోరు విరమించేందుకు నిర్ణయం తీసుకున్నారు. 1955 నుంచి 1957 వరకు మొదటి రెండేండ్లు ఆంధ్ర శాసన సభలో, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సభ్యుడిగా, ఇంతకు ముందు రాజ్యసభ సభ్యుడిగా సుందరయ్య పనిచేశారు. ఆయన సునిశిత పరిశీలన, అధ్యయనాలకు ‘సాయుధ తెలంగాణ పోరాటం– గుణ పాఠాలు’, ‘ఆంధ్రప్రదేశ్ లో సమగ్ర నీటి పథకం’ రచనలు అద్దం పడతాయి.1934లో ఉమ్మడి పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఆ తర్వాత 1964లో పార్టీ చీలిక తర్వాత ఏర్పడిన సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శిగా పీఎస్ బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కూడా పని చేశారు. జీవితాంతం కమ్యూనిస్ట్ ఉద్యమ విస్తృతికి అవిశ్రాంతంగా పని చేసిన ఆయన 1985 మే 19న భౌతికంగా అస్తమించారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న విద్వేష రాజకీయాలను తిప్పికొడుతూ సామరస్య జీవనాన్ని కాపాడుకోవడమే సుందరయ్యకు మన మిచ్చే నిజమైన నివాళి అవుతుంది. జాలకంటి రంగారెడ్డి వ్యాసకర్త సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ‘ 9490098349 -
‘ఆయన జీవించి వుంటే ఈ పథకాలు చూసి ఆనందపడేవారు’
ఉయ్యూరు(కృష్ణా జిల్లా ): దివంగత ప్రముఖ సీపీఎం నేత పుచ్చలపల్లి సుందరయ్య జీవించి వుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న పథకాలను చూసి ఆనందపడేవారని సీపీఎం మాజీ ఎమ్మెల్యే, పత్రిక మాజీ సంపాదకులు పాటూరు రామయ్య అభిప్రాయపడ్డారు. 31 లక్షల ఇళ్ల స్థలాలు పేదలకివ్వడం సీఎం జగన్ ఘనతేనని ఆయన అన్నారు. విద్య, వైద్య రంగంలో పేదలకు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ప్రెస్ అకాడమి ఆధ్వర్యంలో ఉయ్యూరులో సీపాటూరు రామయ్యను ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు సత్కరించారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ.. కొన్ని మీడియా సంస్థలు జగన్‌కు వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా అసత్యాలు ప్రచారం చేయటం సరికాదన్నారు. -
ఆయన వారసత్వాన్ని నిలబెడదాం!
ఆదర్శవంతమైన రాజకీయనేతగా, దక్షిణ భారత కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాతగా, పీడిత ప్రజల ప్రియ తమ నాయకునిగా కామ్రేడ్ పుచ్చల పల్లి సుందరయ్య (పీఎస్)కు ఆధునిక భారత చరిత్రలో చెరగని స్థానం ఉంది. 1913 మే 1వ తేదీన నెల్లూరు జిల్లా అలగానిపాడులో ఒక భూస్వామ్య కుటుంబంలో జన్మించిన పీఎస్... చిన్న వయసులోనే సంఘ సంస్కరణ, స్వాతంత్ర పోరాట దీక్ష అలవర్చుకున్నారు. 1930వ దశకంలో దక్షిణ భారత దేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాణానికి బీజాలు వేశారు. దేశంలోనే తొలి వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించారు. తన వాటాకి వచ్చిన యావదాస్తినీ పార్టీకీ, ఉద్యమానికీ ధారబోసి అత్యంత నిరాడంబరంగా, నియమబద్ధంగా, నిర్మాణాత్మకంగా జీవించారు. 1934లో ఏర్పడిన తొలి ఆంధ్ర కమ్యూనిస్ట్ కమిటీలో సభ్యుడైన సుందరయ్య వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ప్రత్యక్షంగా నాయకత్వం వహించారు. భూమి లేని నిరు పేదలకు ఆ పోరాటం 10 లక్షల ఎకరాల భూమిని పంచింది. 3,000 గ్రామాల్లో గ్రామ రాజ్యాలు ఏర్పర్చారు. నైజాంను భారతదేశంలో విలీనం చేయడానికి భారత సైన్యాలు వచ్చినప్పటికీ అవి కమ్యూనిస్టులను అణచివేయ చూసినప్పుడు... సాయుధ పోరాటం కొనసాగిస్తూ ఉద్య మాన్ని ముందుకు తీసుకు వెళ్లడంలో ఆయన కృషి గణ నీయమైనది. కమ్యూనిస్ట్ పార్టీ తొలి కేంద్ర కమిటీలో సభ్యుడైన సుందరయ్య ఆఖరి వరకు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యునిగా ఉన్నారు. మితవాద, ఉగ్రవాద పెడ ధోరణులు తలెత్తినపుడు మార్క్సిజం సిద్ధాంత స్వచ్ఛతను కాపాడడం కోసం అంతర్గత పోరాటాన్ని సాగించడమే గాక చాలా కాలం కారాగారవాసం కూడా అనుభవించారు. సీపీఎం ఏర్పడినప్పుడు తొలి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి ప్రధాన కమ్యూనిస్టు పార్టీగా తీర్చిదిద్దడానికి పునాదులు వేశారు. పశ్చిమబెంగాల్లో ‘అర్ధ ఫాసిస్టు బీభత్స కాండ’ కాలంలో రంగంలో ఉండి వారికి చేయూతనందించారు. ఎమర్జెన్సీ తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వచ్చి మళ్ళీ ఉద్యమ నిర్మాణాన్ని పటిష్టం చేసేం దుకూ, విస్తృత పరిచేందుకూ అంకితమైనారు. రెండేళ్ల పాటు రాష్ట్ర కార్యదర్శిగానూ పనిచేశారు. ప్రజా ఉద్యమాలు పోరాటాలతో పాటు చట్టసభల్లోనూ సుందరయ్య ప్రజల వాణి వినిపించడంలో గొప్పపాత్ర నిర్వహించారు. భారత పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిగా 1952– 54 మధ్య రాజ్యసభలో ఉండి నాటి ప్రధాన ప్రతిపక్షమైన కమ్యూనిస్టు సభ్యులకు నేతృత్వం వహించారు. పార్లమెంటుకు సైకిల్‌పై వెళ్లిన ఆయన నిరాడంబరత్వం చరిత్రలో నిలిచిపోయింది. 1955లో ఆంధ్ర శాసనసభ మధ్యంతర ఎన్నికలలో పాలకవర్గాలు, బడా పత్రికలు విషపు ప్రచారాలు సాగించినా వాటిని లెక్కచేయకుండా నికరంగా పోరాడారు. 1962లో గెలుపొంది విశాఖ ఉక్కు సమస్యపై రాజీనామా చేసి మళ్ళీ 1978 – 83 మధ్య శాసనసభ్యుడుగా ఉన్నారు. సుందరయ్య, ఆయనను వివాహమాడిన కమ్యూనిస్ట్ కార్యకర్త కామ్రేడ్ లీల ఇద్దరూ... సంతానాన్ని కూడా వద్దనుకుని ఉద్యమ నిర్మాణానికే అంకితమైన తీరు ఒక ఉదాత్త ఉదాహరణగా మిగిలిపోయింది. కామ్రేడ్ సుందరయ్య రాజకీయాలతో పాటు కళా, సాహిత్య, సాంస్కృతిక రంగాలలోనూ మహత్తర కృషి చేశారు. తెలుగు జాతి సాహిత్య సాంస్కృతిక పునరు జ్జీవనానికి సదా శ్రద్ధ వహించారు. ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ పుస్తకం రాసి భావి బాషా రాష్ట్రాల స్థాపన బాట చూపారు. ‘నవ శక్తి’, ‘స్వతంత్ర భారత్’, ‘ప్రజాశక్తి’, ‘విశాలాంధ్ర’, తిరిగి ‘ప్రజాశక్తి’ వంటి పత్రికలు స్థాపించడం ద్వారా కమ్యూనిస్ట్ భావాల వ్యాప్తికి కృషి చేశారు. (చదవండి: రాజ్యాంగస్ఫూర్తే విరుగుడు!) అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో గౌరవాభిమానాలు పొందిన సుందరయ్య... శ్రామిక వర్గ అంతర్జాతీయతను నిలబెట్టిన యోధుడు. ఈ నిర్విరామ కృషిలో ఆయన అనారోగ్యంతో పెనుగులాడుతూ వచ్చారు. రాష్ట్ర కార్యదర్శిగా ఉండగానే 1985 మే 19వ తేదీన ఆయన కన్నుమూశారు. బహుముఖ కార్యక్రమాలతో సుందరయ్య స్ఫూర్తిని ఈ తరానికి అందించడం మనందరి కర్తవ్యం. (Enugula Veeraswamy: ఆ యాత్ర ఓ చరిత్ర) - జూలకంటి రంగారెడ్డి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు (మే 19న పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి) -
కుమ్రంభీమ్‌ను పట్టించిన ఇన్ఫార్మర్ను వేటాడి..
సాక్షి, బెల్లంపల్లి: భూమికోసం.. భుక్తికోసం, నిజాం నిరంకుశ, రాచరిక పాలన విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ గెరిల్లా పోరాటానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అనేక గ్రామాలు బాసటగా నిలిచాయి. ‘దొర నీబాంచెన్ కాల్మోక్తా..’ అని మోకరిల్లిన గ్రామీణులు కమ్యూనిస్టు సాయుధ దళాలకు ఆయుధమయ్యారు. పోరాటయోధులకు ఆశ్రయం ఇచ్చి అక్కున చేర్చుకున్నారు. పోలీసుల కంటపడకుండా కంటికి రెప్పలా కాపాడుకున్న పల్లెలు ఇక్కడ అనేకం ఉన్నాయి. ఇందులో బెల్లంపల్లి మండలం లంబాడితండా ఒకటి. నిజాం నిరంకుశ పాలన అంతం కోసం సాగించిన పోరాటంలో ఆ గ్రామస్తులు పోషించిన పాత్ర అద్వితీయం, అనిర్వచనీయం. షెల్టర్ జోన్ బెల్లంపల్లి.. బెల్లంపల్లి ఏరియాను రహస్య స్థావరంగా చేసుకుని కమ్యూనిస్టు దళాలు సాయుధ పోరాటం చేశాయి. కమ్యూనిస్టు యోధులు బాసెట్టి గంగారాం, జె.కుమారస్వామి, పోతుగంటి పోశెట్టి తదితరులు పోరాటంలో ముఖ్యభూమిక పోషించారు. అజ్ఞాతవాసం గడిపారు. ఆసిఫాబాద్, సిర్పూర్ (టి), జన్నారం, ఉట్నూర్, చెన్నూర్ ప్రాంతాల్లో కమ్యూనిస్టు కార్యకలాపాలు నిర్వహించారు. ప్రజలను పీల్చిపిప్పిచేస్తున్న దొరలు, భూస్వాముల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. భూస్వాముల ఇళ్లపై కరువు, మెరుపు దాడులు సాగించి ధాన్యం, మిర్చి, నిత్యావసర వస్తువులను తీసుకెళ్లి పేదలకు పంచారు. దొరలు, భూస్వాముల భూముల దస్తావేజులను బహిరంగంగా దహనం చేశారు. సాయుధ దళాల చర్యలు దొరలు, భూస్వాములకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. ఈక్రమంలో సాయుధ దళాలపై పోలీసు నిఘా పెరగడంతో దళనాయకులు షెల్టర్ జోన్‌గా భావించిన లంబాడితండా గ్రామానికి వచ్చి తలదాచుకునేవారు. అజ్ఞాతవాసం గడుపుతున్న దళాన్ని పోలీసులబారిన పడకుండా ఆ గ్రామస్తులు కడుపులో దాచుకుని కాపాడుకున్నారు. ఉద్యమకారులు చీల విఠల్, చీల శంకర్ ఓ రోజు ఏం జరిగిందంటే..? లంబాడితండా గ్రామానికి ఓ రోజు పోలీసులు ఆకస్మికంగా చేరుకుని ఇంటింటా సోదాలు ప్రారంభించారు. అప్పటికే దళనాయకుడు కుమారస్వామి తలదాచుకున్నాడు. పోలీసులు వచ్చిన సమాచారాన్ని గ్రామస్తులు క్షణాల్లో దళ నాయకుడికి ఉప్పందించారు. అంతలోనే ఆశ్రయం పొందిన ఇంటి దరిదాపుల్లోకి పోలీసులు రావడాన్ని పసిగట్టిన కుమారస్వామి మహిళ వేషధారణ వేసుకున్నాడు. ఇంట్లోకి పోలీసులు రాగానే మహిళ ముసుగులో పోలీసుల కంట పడకుండా తప్పించుకున్నాడు. గ్రామానికి చెందిన సుకాసి బాలయ్య, సుకాసి పోశం, సల్లం పోశం తదితరులు దళ నాయకులకు నమ్మిన కొరియర్లుగా వ్యవహరించినట్లు చెబుతుంటారు. కుమ్రంభీమ్‌ను పట్టించిన ఇన్ఫార్మర్ను.. జల్, జంగిల్, జమీన్ కోసం పోరాడుతున్న గిరిజన వీరుడు కుమ్రం భీంను అంతమొందించడానికి నిజాంసైన్యం ఎప్పటినుంచో పన్నాగం పన్నింది. పోలీసులపై తిరుగుబాటు చేసిన భీం కంటగింపుగా మారాడు. భీమ్ ఆచూకీ కోసం నిజాం పోలీసులు ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. గిరిజనుడైన మడావి కొద్దు భీమ్ గురించి పోలీసులకు ఉప్పందించడంతో నిజాంసైన్యం కుమ్రంభీమ్ ను కాల్చి చంపింది. వీరుడి ఆచూకీ చెప్పడంతోనే పోలీసులు కాల్చి చంపినట్లు ప్రచారం జరిగింది. అప్పటికే గిరి గూడాలు అగ్నిజ్వాలలై మండుతున్నాయి. ఆ సమాచారం తెలంగాణ సాయుధ గెరిల్లా పోరాటానికి నాయకత్వం వహిస్తున్న కమ్యూనిస్టు అగ్రనేతలు రావి నారాయణరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వర్‌రావుకు అందడంతో తీవ్రంగా స్పందించారు. నిజాం సైన్యానికి ఉప్పందించిన ఇన్ఫార్మర్ను గుర్తించి తుదముట్టించాలని తిర్యాణి ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బాసెట్టి గంగారం నాయకత్వంలోని సాయుధదళాన్ని ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు మడావి కొద్దును వేటాడిన సాయుధ దళం కాల్చి చంపి పగ తీర్చుకుంది. భూస్వామిగా భావించి... ఆసిఫాబాద్‌కు చెందిన భూస్వామి పైకాజీని తుదముట్టించాలని నిర్ణయం తీసుకుంది. తాండూర్ మండలం రాంపూర్ గ్రామానికి పైకాజీ వచ్చినట్లు దళానికి సమాచారం అందింది. ఓ ఇంట్లో పైకాజీ నిద్రపోతున్నట్లు తెలుసుకుని దళం దాడి చేసింది. అదృష్టవశాత్తు ఆరోజు పైకాజీ అక్కడికి రాకపోవడంతో బతికిపోయారు. మంచంలో నిద్రిస్తున్న భూస్వామి గుమస్తా చనిపోయాడు. ఆ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. తప్పుడు సమాచారంతోనే ఆ ఘటన జరిగినట్లు సాయుధదళం తర్వాత గుర్తించింది. కరువు దాడుల్లో ప్రసిద్ధి సాయుధ పోరాటం సాగిస్తున్న కమ్యూనిస్టు దళాల్లో బాసెట్టి గంగారాం నాయకత్వంలోని దళం ఎంతో చురుకునైదిగా ప్రసిద్ధిగాంచింది. దొరలు, భూస్వాముల ఇళ్లపై కరువు, మెరుపుదాడులు చేయడంలో నేర్పరిగా చెబుతుంటారు. తిర్యాణి మండలం గిన్నేదరి, రోంపల్లి, గంగాపూర్ శివారు అటవీప్రాంతాల్లో ఆ దళం ప్రముఖంగా కార్యకలాపాలు నిర్వహించింది. ఆసిఫాబాద్, ఉట్నూర్, జన్నారం ప్రాంతాల్లో ఉన్న భూస్వాములు, దొరల ఇళ్లపై మెరుపుదాడులు సాగించి కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఆ ప్రాంతాల్లోని అటవీవనాలను నరికి వేయించి గిరిపుత్రులకు భూ పంపిణీ చేశారు. భూస్వాముల ఇళ్లపై ఎన్నోమార్లు కరువు దాడులు చేసి వస్తు, సామగ్రిని అపహరించుకుపోయి అన్నార్థులకు పంపిణీ చేశారు. రజాకార్లపై పోరులో అద్దాల మేడ చెన్నూర్: రజాకార్లపై పోరాటంలో అద్దాలమేడ ప్రధాన భూమిక పోషించింది. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని సిరొంచాలో ఆనాడు నిర్మించిన అద్దాలమేడ నేటికి చెక్కుచెదరకుండా ఉంది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సరిహద్దుకు మూడు కిలోమీటర్ల దూరంలో.. ప్రాణహితనది అవతలి ఒడ్డున ఉన్న సిరోంచాలోని అద్దాలమేడ నుంచే రజాకార్ల ఉద్యమానికి వ్యతిరేకంగా ఇండియా మిలటరీ సైనిక్‌లు పోరాటాలు చేశాయి. ఇక్కడినుంచి హైదరాబాద్ నిజాంపై సైతం సైనికులు ఉద్యమాన్ని నిర్వహించారు. 1906లో అప్పటి కలెక్టర్ గ్లాస్‌ఫోర్డ్ ఈ అద్దాలమేడ నిర్మించారు. ఆనాడు కలెక్టర్ బంగ్లాగా అద్దాలమేడను వినియోగించేవారు. అప్పటి మద్రాసు ప్రెస్డెన్సీలో అప్పటి గోదావరి జిల్లా కేంద్రంగా సిరోంచా ఉండేది. సిరొంచా జిల్లా పరిధిలో అప్పటి ఆంధ్రప్రదేశ్‌లోని భద్రాచలం, ఖమ్మం, ఏటూరునాగారం, కరీంనగర్, మరోవైపు జన్నారం, లక్సెట్టిపేట వరకు విస్తరించి ఉండేది. స్వాతంత్య్రానంతరం రాష్ట్రాల విభజన తర్వత ఈ పట్టణాలు ఆంధ్రప్రదేశ్‌లో కలువగా.. సిరొంచా మహారాష్ట్రలో భాగమైంది. మహారాష్ట్రలోని సిరొంచాలో గల అద్దాల మేడ అద్దాలమేడలో ఎన్నో విశేషాలు.. మూడంతస్తులు కలిగిన ఈ భవనంపైకి ఎక్కితే చుట్టూ 12 కిలోమీటర్లు మేర కన్పిస్తుంది. ఇలాగే శత్రువుల రాకను సైనికులు కనిపెట్టేవారు. భవనం లోపలి నుంచి సుమారు 10 కిలోమీటర్ల మేర సొరంగం ఉండేది. ఈ సొరంగం ద్వారానే సైనికులకు ఆయుధాలు అందుతుండేవని ప్రచారంలో ఉంది. ఇక్కడి నుంచి పోరాడిన ఇండియన్ మిలటరీ సైనికుల్లో సుమారు 211 మంది స్వాతంత్య్ర సంగ్రామంలో తుది శ్వాస విడిచారు. వేలాదిమంది రజాకార్లను మట్టి కరిపించారు. చెన్నూర్, నస్పూర్, కోటపల్లి మండలాలకు చెందిన అప్పటి సమరయోధులు ఇండియన్ మిలటరీ సైనికులకు రజాకార్ల కదలికలపై సమాచారాన్ని చేరవేసేవారు. సైనికులు వాడిన ఫిరంగులు కాలగర్భం లో కలసిన ఆనవాళ్లు నేటికీ ఇక్కడ కన్పించడం విశేషం. 1947లో మద్రాసు గవర్నర్ పట్టాభిసీతారామయ్య ఈ భవనంలో బసచేశారు. రజాకార్ల ఉద్యమం అనంతరం నిజాంతో చర్చలు జరపడానికి అప్పటి హోంశాఖ మంత్రి వల్లభాయ్ పటేల్ ఇక్కడకు వచ్చినట్లు సమాచారం. దివంగత పీఎం పీవీ సైతం అద్దాలమేడను సందర్శించారు. ఇలా రజాకార్ల వ్యతిరేక ఉద్యమకేంద్రంగా ప్రధాన భూమిక పోషించి మరాఠీ, హిందీ, తెలుగు సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచిన అద్దాలమేడ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రహస్య జీవనం సాగించారు చెన్నూర్: చెన్నూర్ పట్టణానికి చెందిన సాయుధ పోరాట యోధుడు సుడిగాల విశ్వనాథాసూరి రజాకార్ల నిరంకుశ పాలను వ్యతిరేకంగా పోరాటం సాగించాడు. అధిష్టానం ఆదేశాల మేరకు చెన్నూర్‌లో ఉండి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం సాగించారు. నిజాం సర్కార్ నిర్భంధం పెరగడంతో రాష్ట్ర అధిష్టానం పిలుపు మేరకు రెండేళ్లు అజ్ఞాత జీవనాన్ని సాగించాడు. 1946లో సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని సిరోంచ గ్రామంలో ఏర్పాటు చేసిన రహస్య శిబిరానికి తరలివెళ్లారు. విశ్వనాథ్సూరి శత్రువులపై దాడి ఎలా చేయాలో అక్కడ ఏడాదిపాటు శిక్షణ పొందారు. అక్కడినుంచి బల్లార్ష శిబిరానికి చేరుకుని స్వాతంత్య్రానంతరం జనజీవనంలో కలిసిపోయారు. 1952లో చెన్నూర్, లక్సెట్టిపేట ఉమ్మడి అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో సోషలిస్ట్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. 1952 నుంచి 57 వరకు ఎమ్మెల్యేగా పని చేశారు. 1957 నుంచి నేటివరకు స్థానికుడు చెన్నూర్ ఎమ్మెల్యే అయ్యింది కేవలం విశ్వనాథాసూరి మాత్రమే. – సుడిగాల విశ్వనాతాసూరి (ఫైల్) – సుడిగాల విశ్వనాతాసూరి (ఫైల్), దండనాయకులు గోపాల కిషన్‌రావు నైజాంకు వ్యతిరేకంగా పోరాడిన ఆసిఫాబాద్: నైజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి జైలుకు వెళ్లా. చాందా క్యాంపులో శిక్షణ పొందాను. సాయుధ పోరాటంతో నైజాంను తరిమికొట్టాం. నైజాం పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించింది. తెలంగాణ విమోచన దినం రాష్ట్రంలో అధికారికంగా నిర్వహించాలి. పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో అధికారికంగా నిర్వహిస్తున్నా.. తెలంగాణలో నిర్వహించకపోవడం శోచనీయం. – దండనాయకులు గోపాల కిషన్‌రావు, స్వాతంత్ర సమరయోధుడు,ఆసిఫాబాద్ -
నేతల తీరు మారినా.. కమ్యూనిస్టు సిద్ధాంతాలు మారవు
సాక్షి, అమరావతి : ‘‘కమ్యూనిస్టు సిద్ధాంతాలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి... కానీ వాటిని అమలు చేయడంలో ప్రస్తుత నాయకుల తీరే మారుతోంది’’ అంటూ శతాధిక వృద్ధుడు, కమ్యూనిస్టు యోధుడు వీరపనేని రామదాసు స్పష్టం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో కమ్యూనిస్టు ఉద్యమకారుడిగా తనకంటూ చరిత్రలో స్థానం సంపాదించుకున్న రామదాసు 101 ఏళ్లు వయస్సులోనూ గత అనుభవాలను, ప్రస్తుత పరిస్థితిని కుండబద్దలుకొట్టినట్టు వివరించారు. విజయవాడలో ఆయనను కలిసిన ‘సాక్షి’ ప్రతినిధి వద్ద తన మనసులోని భావాలను పంచుకున్నారు. నేను చదివింది మూడవ తరగతి. కాని జీవితం చాలా పాఠాలు నేర్పింది. నా చుట్టూ ఉన్న సమాజంలో పేదలు, బాధితుల పక్షాన నిలిబడి అనేక పోరాటాలు చేశాను. గన్నవరం తాలూకా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా నేను పనిచేసిన కాలంలోనే కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎన్నికల్లో ఆయన గెలుపుకోసం నియోజకవర్గం అంతా రోజుల తరబడి కాలినడక పర్యటించిన సందర్భాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. గన్నవరం ఎమ్మెల్యేగా తొలిసారి విజయం సాధించిన దగ్గర్నుంచి సుందరయ్య నన్ను ఎంతగానో అభిమానించి ఉద్యమాల్లో ప్రోత్సహించారు. సుందరయ్యతోపాటు నండూరి ప్రసాదరావు, చండ్ర రాజేశ్వరరావు, భీమిరెడ్డి నర్సింహారెడ్డి(బీఎన్ రెడ్డి), కొండపల్లి సీతారామయ్య, ఓంకార్, నెక్కలపూడి రామారావు, మైలవరపు రామారావు వంటి కాకలు తీరిన కమ్యూనిస్టు నేతలతో కలిసి ఉద్యమాల్లో పాలుపంచుకునే అవకాశం దక్కింది. చాలా సందర్భాల్లో బ్రిటీష్ పోలీసులు, అటు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలోని పోలీసులు నా ఆచూకీ కోసం నా భార్య వెంకట సుబ్బమ్మను వేధించినప్పటికీ ఆమె నాకు అందించిన సహకారం మరిచిపోలేను. నా కుమార్తెకు విశాలాంధ్ర(స్వర్ణకుమారి), కుమారులకు డాంగే, కృశ్చేవ్ పేర్లు పెట్టుకున్నాను. నా పెద్ద కొడుకు రామారావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. జైలులో మూడేళ్లు.. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న నన్ను బ్రిటీష్ పోలీసులు అరెస్టు చేసి మూడేళ్ల పాటు జైల్లో పెట్టారు. బళ్లారి జైలులో అక్కడ పురుగుల అన్నం, నల్లులతో పడిన ఇబ్బందులను నా జీవితంలో మరిచిపోలేను. అన్ని కష్టాలు పడి కమ్యూనిస్టు ఉద్యమంలో కొనసాగాను. అయినప్పటికీ గన్నవరం ప్రాంతంలో సర్పంచ్, సమితి ప్రెసిడెంట్ ఎన్నికల సమయంలో కొందరు నాయకుల తీరువల్ల తీవ్ర మనస్తాపంతో ఉద్యమానికి దూరం కావాలని తెలంగాణలోని వరంగల్ జిల్లా గోవిందరావుపేటకు వలస వెళ్లిపోయాను. నేను ఎక్కడ ఉన్నానో తెలుకుని అక్కడికి వచ్చిన సుందరయ్య తిరిగి గన్నవరం రావాలని కోరినా నేను సున్నితంగా తిరస్కరించాను. అయితే వరంగల్ జిల్లాల్లో కమ్యూనిస్టు ఉద్యమం కోసం పనిచేయాలని సుందరయ్య కోరారు. అంత గొప్ప నాయకుడి కోరికను కాదనలేక అక్కడ రైతు, కూలీ ఉద్యమాలు నిర్మించాను. అప్పట్లో నాతో పాటు కమ్యూనిస్టు పార్టీలో పనిచేసి నక్సలిజంలోకి వెళ్లిన కొండపల్లి సీతారామయ్య, ఓంకార్, కేజీ సత్యమూర్తి వంటి వారి అచూకీ కోసం పోలీసులు నన్ను తీవ్రంగా వేధించేవారు. ఒక దశలో పోలీసులు నన్ను చంపాలని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేసి సుందరయ్య కాపాడారు. కమ్యూనిస్టు ఉద్యమాన్ని దెబ్బతీయాలని అప్పట్లో కాంగ్రెస్ పాలకులు నన్ను 14 నెలలపాటు జైలులో కూడా నిర్బంధించారు. ఉద్యమ పంథాపై అసంతృప్తి ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లు చూసిన నాకు అప్పటితరం, ఇప్పటి తరం మధ్య ఉద్యమ పంథా మారిన క్రమం కొంత అసంతృప్తికి గురిచేసింది. అప్పట్లో ఎంత గొప్ప కమ్యూనిస్టు నాయకుడైనా సిద్ధాంతానికి కట్టుబడి ఉండేవారు. ఇప్పుడు సిద్ధాంతాలు కూడా నాయకుల తీరుతో మారుతున్నాయి. కమ్యూనిస్టు సిద్ధాంతాలు చాలా గొప్పవి కాని, వాటిని అమలు చేయడంలోనే ఇప్పటి తరం నాయకుల తీరుతో నేను విభేదిస్తుంటాను. అదే విషయాన్ని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని సీపీఎం నేతలు నన్ను కలిసినప్పుడు ఉద్యమ పంథాలో వారు అనుసరిస్తున్న వ్యక్తిగత పోకడలను ప్రస్తావించి మనసులోని వేదనను వెళ్లగక్కుతుంటాను. ఏదిఏమైనా నా చివరి శ్వాసవరకు కమ్యూనిస్టుగానే ఉంటాను అంటూ రామదాసు చెప్పుకొచ్చారు. ఇది చదవండి : పుచ్చలపల్లి సుందరయ్య.. నీకు సాటిలేరయ్యా! -
పుచ్చలపల్లి సుందరయ్య.. నీకు సాటిలేరయ్యా!
ఆయన సత్యాన్ని మాత్రమే నమ్మేవాడు. అదే మాట్లాడేవాడు. తాను చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పేవాడు. ప్రజా సమస్యలపై శివమెత్తేవాడు. సమస్యల పరిష్కారం కోసం ఎంతటి వారినైనా నిలదీసి అడిగేవాడు. అవసరమైతే కడిగేసే వాడు. ఎంపీగా ఉన్నా సైకిల్‌పైనే సభకు వెళ్లేవాడు. నిలువెల్లా నిరాడంబరతను నింపుకున్న ఆయన విలువల్లోనూ అగ్రభాగాన నిలిచారు. ఆయనే పుచ్చలపల్లి సుందరయ్య 1952.. న్యూఢిల్లీ.. రాజ్యసభ అధ్యక్ష స్థానంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, సభలో ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు. ఉన్నట్టుండి ఓ గొంతు ఖంగుమంది. ‘అధ్యక్షా.. లేడీ మౌంట్ బాటన్ భారత పర్యటనకు ఎందుకు వస్తున్నారో ప్రధానమంత్రి నెహ్రూ చెప్పాలి. మన అంతర్గత వ్యవహారాలలో బ్రిటిష్ వాళ్ల జోక్యాన్ని మేం అంగీకరించబోం’ అంటూ ప్రతిపక్ష నాయకుడు, సీపీఐ పార్లమెంటరీ పక్షనాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య సభలో మండిపడుతున్నారు. నెహ్రూ అదే స్థాయిలో.. ‘సుందరయ్య గారూ. మీరేం మాట్లాడుతున్నారో తెలుసా? మీ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోండి’ అన్నారు. ‘నేనెందుకు ఉపసంహరించుకోవాలి. అసలింతకీ ఆమె ఎందుకు వస్తోంది? మన వ్యవహారాలలో జోక్యం చేసుకోవడానికి కాకపోతే ఇప్పుడామెకు ఇండియాలో ఏం పని’ అని సుందరయ్య అనటం తో సభలో దుమారం చెలరేగింది. సుందరయ్య పట్టు వీడలేదు. సంయమనం పాటించాలని, సహనం కోల్పోవద్దన్న సర్వేపల్లి ఆదేశంతో గొడవ సద్దుమణిగింది. ఆ మర్నాడు ఉదయం సుందరయ్యను సర్వేపల్లి రాధాకృష్ణన్ అల్పాహారానికి ఆహ్వానించారు. మాటల మధ్యలో సుందరయ్యకు అసలు విషయం తెలిసింది. ’నెహ్రూకు అంత కోపం ఎందుకొచ్చిం దో నీకు తెలిసినట్టు లేదు. లేడీ మౌంట్ బాటన్‌తో ఆయనకు సన్నిహిత సంబంధం ఉన్నట్టు అందరూ మాట్లాడుకోవడం నెహ్రూకు నచ్చదు. అందుకే ఆయనకు అంత కోపం వచ్చింది’ అని సర్వేపల్లి చెప్పారు. సుందరయ్య ఖంగుతిన్నారు. ’అయ్యో.. నేను అనవసరంగా మాట్లాడానే. సారీ.. నా మనసులో ఎటువంటి దురుద్దేశం లేదు సర్. నాకీ విషయం తెలిసుంటే ప్రశ్నలను మరోలా అడిగేవాణ్ణి’ అని చిన్నబుచ్చుకున్నారు. ఇది జరిగిన మర్నాడే నెహ్రూ తన ఇంటికి రాజ్యసభ సభ్యుల్ని డిన్నర్‌కు పిలిచారు. సుందరయ్య కూడా వెళ్లారు. ఆయన్ను చూసిన నెహ్రూ దగ్గరకు వెళ్లి ఏదో మాట్లాడబోతుండగా.. ’సారీ మిస్టర్ నెహ్రూ. నిన్న సభలో జరిగిన దానికి బాధపడుతున్నా’ అని తీవ్ర ఆవేదనతో అన్నారు. నెహ్రూ సైతం అంతే క్రీడాస్ఫూర్తితో ఓ చిర్నవ్వు నవ్వి ’నేనూ సారీ చెబుతున్నా సుందరయ్య గారూ. నేను కూడా అంత కఠినంగా మాట్లాడకుండా ఉండాల్సింది’ అన్నారు. ఆ తర్వాత ఏ విషయం వచ్చినా సుందరయ్యను ఆదర్శంగా తీసుకోమని నెహ్రూ పదేపదే తన పార్టీ సభ్యులకు చెబుతూ వచ్చేవారు. సాధికారత ఆయన సొంతం చట్టసభలలో మాట్లాడేటప్పుడు చదవకుండా, పూర్వపరాలు, ప్రభావం, పర్యావసానాలు తెలుసుకోకుండా సుందరయ్య సభకు వచ్చేవారు కాదు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు మేధావులు, నిపుణులతో పాఠాలు చెప్పించే వారు. అంకెలు, సంఖ్యలతో సభకు వెళ్లమని చెప్పేవారు. మద్రాసు శాసనసభ నుంచి సుందరయ్య 1952లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికైనప్పుడు ఆయనే సీపీఐ పార్లమెంటరీ నేత. ఉభయ సభలలో సీపీఐ పార్లమెంటరీ పార్టీ సభా నాయకుడు కూడా. ఆనాడు ఆంధ్రా నుంచి 17 మంది కమ్యూనిస్టులు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తే సుందరయ్య పార్టీ నేతగా ఢిల్లీలో ఉండి అన్నీ చక్కబెట్టేవారు. మారుమూల పల్లె నుంచి.. ప్రపంచ కార్మిక దినోత్సవమైన మే 1న 1913లో నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా అలగానిపాడులో భూస్వామ్య కుటుంబంలో సుందరయ్య జన్మించారు. వెంకట్రామిరెడ్డి, శేషమ్మ దంపతుల ఆరో సంతానం. సుందరరామిరెడ్డి అని తల్లిదండ్రులు పేరు పెడితే కులం ముద్ర ఉండకూడదనుకుని పేరు చివర్న రెడ్డిని తొలగించుకున్నారు. ఓ అన్న, నలుగురు అక్కల తర్వాత పుట్టిన వాడు కావడంతో అల్లారుముద్దుగా పెరిగారు. ఆయన తర్వాత ఓ తమ్ముడు డాక్టర్ రామచంద్రారెడ్డి పుట్టినప్పటికీ ఆ కుటుంబంలో సుందరయ్యది ప్రత్యేక స్థానమే. వీధి బడిలో చదివారు. పెద్ద బాలశిక్ష ఆయన తొలి పాఠ్యపుస్తకం. ఆరేళ్ల వయసులో తండ్రి చనిపోతే తన పెద్దక్క సుందరయ్య, రామచంద్రారెడ్డిని తిరువళ్లూరు తీసుకెళ్లి చదివించింది. మూడు, నాలుగైదు తరగతులు తిరువళ్లూరులో చదివిన సుందరయ్య ఆ తర్వాత ఏలూరు, రాజమండ్రి, చెన్నైలో విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. పిల్లల్ని ఎందుకు వద్దనుకున్నారంటే.. రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. పీపుల్స్ వార్ సిద్ధాంతాన్ని నెత్తికెత్తుకున్న కమ్యూనిస్టు పార్టీ 1942 ప్రాంతంలో ఆ పనిమీద సుందరయ్యను బొంబాయి పంపింది. దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీపై నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ నిజాం ప్రభుత్వం కమ్యూనిస్టులు వేర్పాటు వాదులనే ముద్రవేసి అణచివేసింది. నిర్బంధాన్ని కొనసాగించింది. ఆ సమయంలో అజ్ఞాతంలో ఉన్న కామ్రేడ్స్‌తో సంబంధాల కోసం బొంబాయిలోని దిల్సాద్ చారీ, ఏఎస్ఆర్ చారీ అనే పార్టీ నేతల ఇంటికి సుందరయ్య వెళ్లి వస్తుండేవారు. అక్కడ పరిచయమైన లీలా అనే సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగిని 1943 ఫిబ్రవరి 27న పార్టీ ప్రధాన కార్యదర్శి పీసీ జోషీ, మరికొద్ది మంది పార్టీ నేతల సమక్షంలో వివాహం చేసుకున్నారు. పెళ్లైన మరుసటి ఏడాది 1944 చివర్లో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నారు. పార్టీకి పూర్తి కాలం సేవలు అందించాలనే ఉద్దేశంతో పిల్లలకు దూరంగా ఉండిపోయిన ఆ జంట పెళ్లి చేసుకుని, పరిమిత సంతానాన్ని కని సుఖంగా ఉండమని మాత్రం పార్టీ కార్యకర్తలకు ఉద్బోధించేవారు. సర్వస్వం పార్టీకే అంకితం తన వాటా కింద వచ్చిన యావదాస్తిని ప్రజా ఉద్యమాల కోసం సుందరయ్య ఖర్చు చేశారు. ఆయన అనేక విలువైన పుస్తకాలను రచించారు. విశాలాంధ్రలో ప్రజారాజ్యం, తెలంగాణ ప్రజా పోరాటం–కొన్ని గుణపాఠాలు, ఆత్మకథ వంటివి వాటిలో కొన్ని. 1952లో రాజ్యసభ సభ్యునిగా, 1955 నుంచి 1967, 1978 నుంచి 1983 వరకు రెండుసార్లు రాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన సూచనలు, సలహాలు, వాదనలు ఇప్పటికీ విలువైనవే. అందరూ కార్లు వాడుతున్న కాలంలో పార్లమెంటుకు, అసెంబ్లీకి సైకిల్‌పై వెళ్లిన అతి సామాన్యుడు. 1985 మే 19న మరణించే వరకు ఆయన ప్రజల కోసం అహరహం శ్రమించారు. పేదరికం, దోపిడీ నుంచి పేదల విముక్తికి జీవితాన్ని అంకితం చేసిన మచ్చలేని మహామనిషి, దేశభక్తుడు. ఆకలి, దారిద్య్రం లేని సమసమాజం కోసం పోరాడిన విప్లవకారుడు. బడుగు, బలహీన వర్గాల పాలిట ఆశాజ్యోతి. 17 ఏళ్ల వయసులోనే అరెస్ట్ విద్యార్థి దశనుంచే ఆదర్శ భావాలు, త్యాగనిరతి పుణికి పుచ్చుకున్న సుందరయ్య 1930 ఏప్రిల్‌లో మహాత్మాగాంధీ పిలుపుతో చదువుకు స్వస్తి చెప్పి స్వాతంత్య్ర ఉద్యమంలో చేరి 17 ఏళ్ల వయసులోనే అరెస్ట్ అయ్యారు. మైనారిటీ తీరకపోవడంతో ఆయన్ను రాజమండ్రిలోని బోస్టన్ స్కూల్‌కు తరలించారు. అక్కడ కమ్యూనిస్టులతో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బయటకు వస్తూనే వ్యవసాయ కార్మికులను ఏకం చేసి భూస్వాములపై తిరుగుబాటు చేశారు. తన ఆత్మకథలో చెప్పుకున్నట్టుగా సుందరయ్యను కమ్యూనిస్టుగా తీర్చిదిద్దిన వారిలో అమీర్ హైదర్ ఖాన్ ప్రథములు. సామాన్య కార్యకర్తగా కమ్యూనిస్టు పార్టీలోకి అడుగుపెట్టిన ఆయన ఆ తర్వాత అదే పార్టీకి ప్రధాన కార్యదర్శి అయ్యారు. అమీర్ హైదర్ ఖాన్ అరెస్ట్ తర్వాత దక్షిణ భారత దేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించే పనిని తన భుజానికెత్తుకున్నారు. 1943లో బొంబాయిలో జరిగిన పార్టీ మహాసభలో కేంద్ర కమిటీ సభ్యునిగా ఎన్నికైన సుందరయ్య మరణించే వరకు ఉమ్మడి పార్టీలోనూ ఆ తర్వాత ఏర్పడిన సీపీఐ (ఎం)లో వివిధ హోదాలలో పని చేశారు. 1939, 1942 మధ్య అజ్ఞాత వాసానికి వెళ్లిన సమయంలో సుందరయ్య కమ్యూనిస్టు సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. 1943లో పార్టీపై నిషేధం ఎత్తివేసిన తర్వాత పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించి, కలకత్తా థీసిస్ ఆధారంగా సాయుధ పోరాటాన్ని ప్రభోదించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్య పాత్ర పోషించారు. 1948, 1952 మధ్య కాలంలో మరోసారి అజ్ఞాతంలోకి వెళ్లారు. –ఆకుల అమరయ్య, సాక్షి, అమరావతి -
సుందరయ్యా... నిన్ను మరవమయ్యా..
సాక్షి, కృష్ణా : కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, తెలంగాణా సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు పుచ్చలపల్లి సుందరయ్యను గన్నవరం వాసులు మూడుసార్లు తమ శాసనసభ్యుడిగా ఎన్నుకున్నారు. కమ్యూనిస్టు ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన గన్నవరం ప్రాంతంపై ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉండేది. ఆయన అసలు పేరు పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి. అయితే ‘రెడ్డి’ అనే కులసూచికను తొలగించుకుని నిరాడంబరతతో ఆదర్శ జీవితం గడిపారు. పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం కలిగితే తన ప్రజాసేవకు బంధాలు, బాంధవ్యాలు అడ్డుగా నిలుస్తాయని భావించిన ఆయన వివాహ అనంతరం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నారు. అంతే కాకుండా తండ్రి నుంచి వంశపార్యంపరగా వచ్చిన ఆస్తులను కూడా నిరుపేదలకు వితరణ చేశారు. నియోజకవర్గం ఆవిర్భవించిన తర్వాత తొలిసారి 1955లో జరిగిన ఎన్నికల్లోనూ, తరువాత 1962, 1978లలో మళ్లీ ఆయననే విజయం వరించింది. పేదలకు కిలో రూపాయి బియ్యాన్ని అందించాలని మొదలైన ఉద్యమానికి శ్రీకారం చుట్టింది సుందరయ్యే. -
కడ వరకు విప్లవ స్వప్నాలే
నక్సల్బరీ విప్లవోద్యమంలో కొండపల్లి సీతారామయ్యది చాల విశిష్టమైన పాత్ర. ఈ 16 ఏళ్ల పాటు పూర్తిగా విస్మృతికి గురైన ఆయన పేరిట సంస్మరణలు లేవు, స్మృతి గీతాలు లేవు, స్తూపాలు లేవు.. ఓ గుర్తింపులేని హీరోగా మిగిలిపోయారు. వ్యవస్థ మార్పు కోసం, సమ సమాజ స్థాపన కోసం తన జీవితాన్ని అంకితం చేసి పోరాడిన త్యాగశీలి, మార్గదర్శకుడు కొండపల్లి సీతారామయ్య అమరులై నేటికి 16 సంవత్సరాలు. ఆయన సహచరులు, అనుచరులు, అభిమానులు ఆయన్ని కె. ఎస్ అనీ, పెద్దాయన అనీ పిలుచుకుంటారు. దాదాపు దశాబ్దం పైబడి అల్జీమర్స్ వ్యాధితో బాధపడి 2002 ఏప్రిల్ 12న ఆయన తన సుదీర్ఘ విప్లవ ప్రస్థానం చాలిం చారు. కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సమాజంలో, ఇతర రాష్ట్రాలలోను వ్యవస్థ మార్పుకోసం సాగుతున్న ఉద్యమాలను వారు ప్రభావితం చేసిన సంగతి తెలి సిందే. చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి, చారు మజుందార్ వంటి ఉన్నత స్థాయి కలిగిన అగ్రశ్రేణి నాయకుడాయన. నక్సల్బరీతో ప్రారంభమైన విప్లవోద్యమంలో ఆయనది చాల విశిష్టమైన, విస్మరించరాని పాత్ర. ఈ16 ఏళ్ల పాటు పూర్తిగా విస్మృతికి గురైనారు. ఆయన పేరిట సంస్మరణలు లేవు, స్మృతి గీతాలు లేవు, స్తూపాలు లేవు, స్మారకోపన్యాసాలు లేవు. ఓ గుర్తింపులేని హీరోగా మిగిలిపోయారు. అల్జీమర్స్‌తో బాధ పడుతున్న జార్జి ఫెర్నాండేజ్‌ని వారి అనుయాయులు ఎంతో అపురూపంగా చూసుకుం టున్నారట. అల్జీమర్స్ వ్యాధి గురించి మన సమాజానికి, ప్రత్యేకంగా ఉద్యమ శ్రేణులకు సరైన అవగాహన ఉండి వుంటే ఆయన పట్ల మరింత సహానుభూతి, సానుకూల దృక్పథం కలిగి ఉండే వారేమో! కాని చనిపోయే నాటికి ఒక దశాబ్దం ముందు నుంచే నిశ్శబ్దంగా, దొంగలా ఆయనలో ప్రవేశించిన అల్జీమర్స్ మాత్రం ఆయన్ని తన సహచరులకు దూరం చేసింది. అలాంటి స్థితిలో ఉండి కూడా ఆయన విప్లవ స్వప్నాలే కన్నారు. రోగ లక్షణంగా ఆయనకొచ్చిన మానసిక భ్రాంతుల్లో కూడ విప్లవ సైన్యం కదలికలు, కవాతులే ఉండేవి. మొగల్రాజపురంలోని ఇంటి పైన టెర్రస్ మీద కూర్చుని ఎదురుగా రోడ్డు పైన వెళ్తున్న జనాన్ని, వాహనాలను చూపిస్తూ రెడ్ ఆర్మీ కవాతుగా భ్రమించేవారు. ఆయన్ని చూడటానికి వచ్చిన అందరినీ పార్టీ పని చేయమని ప్రేరేపించేవారు. ఏ కారణం వల్లనైనా మేము అభ్యంతరపెడితే.. మీరు చెయ్యరు.. చేసేవాళ్లతో చేయిం చుకుంటుంటే అడ్డుపడతారు అనేవారు. తన మనవరాలు సుధ, నేను పూర్తి స్థాయి పార్టీ కార్యకర్తల్లా పని యకుండా ఆమె లా కాలేజీ లెక్చరర్ గాను, నేను హాస్పిటల్ నడుపుతూ ఉండటం ఆయనకంతగా నచ్చేది కాదు. ఒకరోజు నా మూడేళ్ల కూతురితో ‘మీ నాన్న దొంగ. పార్టీ పని చేయకుండా డాక్టరై హాస్పిటల్ నడుపుతున్నాడు’ అన్నారు. దానికా పసిది పెద్దగా ఏడుస్తూ తనమీద కొట్లాటకు దిగింది. దాంతో కలవరపడి పసిదాన్ని బాధ పెట్టానే అని కలత చెందిన సున్నిత మనస్కుడాయన. భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో కె.ఎస్.ది ఒక ప్రత్యేకమైన, ముఖ్యమైన అధ్యాయం. తెలంగాణా సాయుధ పోరాటకాలంలో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ కృష్ణాజిల్లా కార్యదర్శిగా ఆయన చాల కీలక పాత్ర నిర్వహించారు. చండ్ర రాజేశ్వరరావుతో కలిసి అనుబంధ ప్రజాసంఘాల నిర్మాణంలో, ముఖ్యంగా రైతు సంఘం, ప్రజా నాట్యమండలి నిర్మాణంలో కె.ఎస్ది ముఖ్యపాత్ర. అనంతర కాలంలో నక్సల్ బరీ ఉద్యమంతో సి.పి.ఐ(ఎం.ఎల్) పార్టీ ఏర్పడినప్పుడు, ఆ తర్వాత పీపుల్స్ వార్ పార్టీ నిర్మాణంలో తన పూర్వ అనుభవాన్నంతా రంగరించి పార్టీకి ‘మాస్ లైన్’ అందించటంలో తనదే ముఖ్య పాత్ర. రాడికల్ విద్యార్థి సంఘానికి వేసవి సెలవుల్లో ‘గ్రామాలకు తరలండి. పేద మధ్య తరగతి ప్రజలతో మమేకం కండి’ అని పిలుపునిచ్చారు. గ్రామాలకు వెళ్ళినప్పుడు ముందుగా దళితవాడల్లో, బీసీవాడల్లో కాంపెయిన్ చెయ్యాలని, దళితవాడల్లో వాళ్లు పెట్టిందే తిని, రాత్రిపూట బస కూడా అక్కడే చేయాలని, వారితో పూర్తిగా మమేకం కావాలని ఆయనిచ్చిన డైరెక్షన్. ఆ పిలుపు మేరకు ప్రొఫెషనల్ కాలేజీలు, యూనివర్సిటీల నుంచి వేలాది మంది విద్యా ర్థులు గ్రామీణ ప్రాంతాలకు తరలి వెళ్లి సామాన్య ప్రజ లతో మమేకమై ఉద్యమ స్ఫూర్తి రగిలించారు. 2009లో కూర రాజన్న అనారోగ్యంతో హైదరాబాద్‌లో ఆసుపత్రిలో ఉన్నప్పుడు కొందరు మిత్రులం ఆయన్ని చూడటానికి వెళ్ళాం. నన్ను చూడగానే రాజన్న ప్రస్తావించిన మొదటి విషయం కె.ఎస్.కు విజయవాడలో స్తూపం కట్టాలని. నాతో వచ్చిన మిత్రుడొకరు కె.ఎస్. గురించి మీ అభిప్రాయం ఏమిటి అని రాజన్నను అడిగాడు. దానికాయన ‘కె.ఎస్. మా గురువు’ అన్నారు. అదేంటి మీ పార్టీ ఆయన పార్టీ వేరు వేరు కదా... కరీంనగర్ జిల్లాలో మీ రెండు గ్రూపుల దళాలు చంపుకునే వరకు వెళ్లాయి కదా అని ఆ మిత్రుడు మళ్లీ ప్రశ్నించాడు. దానికాయన ‘అవన్నీ క్షేత్రస్థాయిలో ఆచరణలో దొర్లిన పొరపాట్లు. ఉద్యమపరమైన ఎత్తుగడల విషయంలో ఆయన మాకు గురువే. ఉద్యమంపై ప్రభుత్వ నిర్బంధం పెరిగినప్పుడు మేము ప్రతిఘటనా పోరాటానికి పిలుపు నిచ్చాం. కె. ఎస్. అందుకు భిన్నంగా దండకారణ్యానికి విస్తరించమని పిలుపునిచ్చారు. ఆయనే కరెక్ట్ అని చరిత్ర రుజువు చేసింది‘ అన్నారు. రాజన్న అంచనా వేసిన రీతి లోనే చరిత్ర, భవిష్యత్తు తరాలు కొండపల్లి సీతారామయ్యని అంచనా వేస్తాయని నా ప్రగాఢ నమ్మకం. డాక్టర్ జి.గంగాధర్ (నేడు విప్లవోద్యమనేత కొండపల్లి సీతారామయ్య 16వ వర్థంతి సందర్భంగా) వ్యాసకర్త ప్రముఖ వైద్యులు, విజయవాడ మొబైల్ 98483 34761 -
సుందరయ్య స్ఫూర్తిగా సమస్యలపై పోరాటం
► సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుల పిలుపు ► పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహానికి పూలమాలలు కర్నూలు సిటీ : పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తిగా సమస్యలపై ఉద్యమాలు చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి.షడ్రక్, జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. పుచ్చలపల్లి సుందరయ్య 31వ వర్ధంతి సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యం లో గురువారం ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళ్లు ఆర్పిం చారు. పార్టీ కార్యకర్తలందరూ సుందరయ్య చరిత్రను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాల్జేస్తున్నాయన్నారు. ఒక పార్టీ తరుఫున గెలిచిన వారు సొంత ప్రయోజనాల కోసం అధికార పార్టీలోకి మారుతుండడం ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయడమేనన్నారు. పార్టీ కార్యకర్తలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నా రు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు, రాజశేఖర్, నగర కార్యదర్శి గౌస్ దేశాయ్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ,ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.నిర్మల, అలివేలమ్మ, అరుణ, సుజా త, సీఐటీయూ నగర నాయకులు రాముడు, అంజిబాబు పాల్గొన్నారు.