నేతల తీరు మారినా.. కమ్యూనిస్టు సిద్ధాంతాలు మారవు | Communist Theory Will Never Fail Said By Veerapaneni Ramadasu | Sakshi
Sakshi News home page

నేతల తీరు మారినా.. కమ్యూనిస్టు సిద్ధాంతాలు మారవు

Published Thu, Sep 5 2019 9:46 AM | Last Updated on Thu, Sep 5 2019 9:49 AM

Communist Theory Will Never Fail Said By Veerapaneni Ramadasu - Sakshi

సాక్షి, అమరావతి : ‘‘కమ్యూనిస్టు సిద్ధాంతాలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి... కానీ వాటిని అమలు చేయడంలో ప్రస్తుత నాయకుల తీరే మారుతోంది’’ అంటూ శతాధిక వృద్ధుడు, కమ్యూనిస్టు యోధుడు వీరపనేని రామదాసు స్పష్టం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో కమ్యూనిస్టు ఉద్యమకారుడిగా తనకంటూ చరిత్రలో స్థానం సంపాదించుకున్న రామదాసు 101 ఏళ్లు వయస్సులోనూ గత అనుభవాలను, ప్రస్తుత పరిస్థితిని కుండబద్దలుకొట్టినట్టు వివరించారు. విజయవాడలో ఆయనను కలిసిన ‘సాక్షి’ ప్రతినిధి వద్ద తన మనసులోని భావాలను పంచుకున్నారు.          

నేను చదివింది మూడవ తరగతి. కాని జీవితం చాలా పాఠాలు నేర్పింది. నా చుట్టూ ఉన్న సమాజంలో పేదలు, బాధితుల పక్షాన నిలిబడి అనేక పోరాటాలు చేశాను. గన్నవరం తాలూకా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా నేను పనిచేసిన కాలంలోనే కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎన్నికల్లో ఆయన గెలుపుకోసం నియోజకవర్గం అంతా రోజుల తరబడి కాలినడక పర్యటించిన సందర్భాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. గన్నవరం ఎమ్మెల్యేగా తొలిసారి విజయం సాధించిన దగ్గర్నుంచి సుందరయ్య నన్ను ఎంతగానో అభిమానించి ఉద్యమాల్లో ప్రోత్సహించారు.

సుందరయ్యతోపాటు నండూరి ప్రసాదరావు, చండ్ర రాజేశ్వరరావు, భీమిరెడ్డి నర్సింహారెడ్డి(బీఎన్‌ రెడ్డి), కొండపల్లి సీతారామయ్య, ఓంకార్, నెక్కలపూడి రామారావు, మైలవరపు రామారావు వంటి కాకలు తీరిన కమ్యూనిస్టు నేతలతో కలిసి ఉద్యమాల్లో పాలుపంచుకునే అవకాశం దక్కింది. చాలా సందర్భాల్లో బ్రిటీష్‌ పోలీసులు, అటు తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని పోలీసులు నా ఆచూకీ కోసం నా భార్య వెంకట సుబ్బమ్మను వేధించినప్పటికీ ఆమె నాకు అందించిన సహకారం మరిచిపోలేను. నా కుమార్తెకు విశాలాంధ్ర(స్వర్ణకుమారి), కుమారులకు డాంగే, కృశ్చేవ్‌ పేర్లు పెట్టుకున్నాను. నా పెద్ద కొడుకు రామారావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

జైలులో మూడేళ్లు..
క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న నన్ను బ్రిటీష్‌ పోలీసులు అరెస్టు చేసి మూడేళ్ల పాటు జైల్లో పెట్టారు. బళ్లారి జైలులో అక్కడ పురుగుల అన్నం, నల్లులతో పడిన ఇబ్బందులను నా జీవితంలో మరిచిపోలేను. అన్ని కష్టాలు పడి కమ్యూనిస్టు ఉద్యమంలో కొనసాగాను. అయినప్పటికీ గన్నవరం ప్రాంతంలో సర్పంచ్, సమితి ప్రెసిడెంట్‌ ఎన్నికల సమయంలో కొందరు నాయకుల తీరువల్ల తీవ్ర మనస్తాపంతో ఉద్యమానికి దూరం కావాలని తెలంగాణలోని వరంగల్‌ జిల్లా గోవిందరావుపేటకు వలస వెళ్లిపోయాను. నేను ఎక్కడ ఉన్నానో తెలుకుని అక్కడికి వచ్చిన సుందరయ్య తిరిగి గన్నవరం రావాలని కోరినా నేను సున్నితంగా తిరస్కరించాను.

అయితే వరంగల్‌ జిల్లాల్లో కమ్యూనిస్టు ఉద్యమం కోసం పనిచేయాలని సుందరయ్య కోరారు. అంత గొప్ప నాయకుడి కోరికను కాదనలేక అక్కడ రైతు, కూలీ ఉద్యమాలు నిర్మించాను. అప్పట్లో నాతో పాటు కమ్యూనిస్టు పార్టీలో పనిచేసి నక్సలిజంలోకి వెళ్లిన కొండపల్లి సీతారామయ్య, ఓంకార్, కేజీ సత్యమూర్తి వంటి వారి అచూకీ కోసం పోలీసులు నన్ను తీవ్రంగా వేధించేవారు. ఒక దశలో పోలీసులు నన్ను చంపాలని చూస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేసి సుందరయ్య కాపాడారు. కమ్యూనిస్టు ఉద్యమాన్ని దెబ్బతీయాలని అప్పట్లో కాంగ్రెస్‌ పాలకులు నన్ను 14 నెలలపాటు జైలులో కూడా నిర్బంధించారు. 

ఉద్యమ పంథాపై అసంతృప్తి
ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లు చూసిన నాకు అప్పటితరం, ఇప్పటి తరం మధ్య ఉద్యమ పంథా మారిన క్రమం కొంత అసంతృప్తికి గురిచేసింది. అప్పట్లో ఎంత గొప్ప కమ్యూనిస్టు నాయకుడైనా సిద్ధాంతానికి కట్టుబడి ఉండేవారు. ఇప్పుడు సిద్ధాంతాలు కూడా నాయకుల తీరుతో మారుతున్నాయి. కమ్యూనిస్టు సిద్ధాంతాలు చాలా గొప్పవి కాని, వాటిని అమలు చేయడంలోనే ఇప్పటి తరం నాయకుల తీరుతో నేను విభేదిస్తుంటాను. అదే విషయాన్ని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని సీపీఎం నేతలు నన్ను కలిసినప్పుడు ఉద్యమ పంథాలో వారు అనుసరిస్తున్న వ్యక్తిగత పోకడలను ప్రస్తావించి మనసులోని వేదనను వెళ్లగక్కుతుంటాను. ఏదిఏమైనా నా చివరి శ్వాసవరకు కమ్యూనిస్టుగానే ఉంటాను అంటూ రామదాసు చెప్పుకొచ్చారు. ఇది చదవండి : పుచ్చలపల్లి సుందరయ్య.. నీకు సాటిలేరయ్యా!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement