నేడు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి
సందర్భం
నేడు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి
భౌతికంగా మన మధ్యలేకపోయినా చరిత్ర పుటల్లో సజీవంగా నిలిచిపోయే వ్యక్తులు కొందరే ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తులలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య (పీఎస్) ఒకరు. నెల్లూరు జిల్లా అలగానిపాడు గ్రామంలో 1913 మే 1వ తేదీన భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. తొలినాళ్లలో ఆయన మీద గాంధీజీ ప్రభావం ఉండేది. 1930లో మాలపర్రు గ్రామంలో కాంగ్రెస్ సత్యాగ్రహ కార్యక్రమంలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అయితే క్రమంగా ఆయనలో కాంగ్రెస్‌పై నమ్మకం సన్నగిల్లింది. మద్రాసు లయోలా కాలేజీలో చదువుతున్నప్పుడు కంభంపాటి సత్యనారాయణ, వీకే నరసింహన్, హెచ్‌డీ రాజాలతో పరిచయం ఏర్పడింది.
ఈ క్రమంలో సోషలిస్ట్ సాహిత్యాన్నీ, కమ్యూనిస్ట్ మేనిఫెస్టోనూ అధ్యయనం చేశారు. అపుడే, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అమీర్ హైదర్ ఖాన్ కమ్యూనిస్ట్ పార్టీలో పని చేయాలని ఆహ్వానించారు. దీంతో డిగ్రీ అయిపోయిన తర్వాత పీఎస్ ఫుల్‌టైమర్‌గా పార్టీలో చేరారు. 1934లో అమీర్ హైదర్ ఖాన్ అరెస్ట్ కాగా ఆయన బొంబాయి వెళ్లారు. అక్కడే సోషలిస్ట్ భావాలుగల వ్యక్తుల వివరాలు సేకరించి కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణానికీ, విస్తరణకూ కృషి చేశారు. ఆ క్రమంలో 1938–1939లో ఇఎంఎస్ నంబూద్రిపాద్ కమ్యూనిస్ ్టపార్టీలో చేరారు.
అలాగే తమిళనాడులో ఎంఆర్ వెంకట్రామన్, రామమూర్తి, తెలుగునాట మోటూరు హనుమంతరావు, లావు బాలగంగాధరరావు, తరిమెల నాగిరెడ్డి, ఈశ్వరరెడ్డి పార్టీలోకి వచ్చారు. 1940 ఆంధ్ర మహాసభ నుండి రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, చిర్రావూరి లక్ష్మీ నర్సయ్య, దేవులపల్లి వేంకటేశ్వరరావు, భీమిరెడ్డి నరసింహారెడ్డి, ధర్మబిక్షం, కృష్ణమూర్తి, ఆరుట్ల రామచంద్రారెడ్డి ఇంకా మరెందరో నిజాం స్టేట్‌లో కమ్యూనిస్ట్ పార్టీ లోకి వచ్చారు. అంతకు ముందే కవి మగ్దూవ్‌ు మొహియుద్దీన్ కమ్యూనిస్ట్ పార్టీవైపు వున్నారు.
1946–1951 మధ్య జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వేలాది మంది కమ్యూనిస్ట్ యోధులు ప్రాణాలు కోల్పోయారు. 1947 ఆగస్టు 15న దేశం స్వాతంత్య్రం పొందినప్పటికీ తన సంస్థానం ప్రత్యేక రాజ్యంగా కొనసాగాలని నిజాం రాజు పట్టుపట్టాడు. ఈ స్థితిలో 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం నిజాం సంస్థానాన్ని విలీనం చేసుకోవడానికి యాక్షన్ ప్రారంభించింది. తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగా అప్పటికి ఖమ్మం, వరంగల్, కరీంనగర్‌లో కొంత భాగం; నల్లగొండ జిల్లాలో మూడు వేల గ్రామాలు నిజాం, దొరల పాలన నుండి విముక్తి పొందాయి. పది లక్షల ఎకరాల భూమిని దేశ్‌ముఖ్‌ల, భూస్వాముల నుండి స్వాధీనం చేసుకొని దున్నేవారికి పంచారు.
ఆయా గ్రామాలలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన గ్రామ రాజ్యాల ఏర్పాటుతో నిజాం పాలన బలహీనపడింది, మరోవైపు భారతసైన్యం ప్రవేశించడంతో నిజాం రాజు విలీనానికి అంగీకరించాడు. విలీనం తర్వాత భారత సైన్యం కమ్యూనిస్ట్ దళాలతో తలపడి చాలామందిని చంపింది. కమ్యూనిస్ట్ నాయకులు, దళ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లారు. అత్యంత శిక్షణ పొందిన భారత సైన్యంతో సాధారణ ఆయుధాలతో పోరాడలేని పరిస్థితి వచ్చింది. ఈ స్థితిలో పోరాట విరమణకు సంబంధించి దళాలతో చర్చించి నిర్ణయం తీసుకోవడానికి సుందరయ్య మారుపేరుతో రహస్యంగా పోరాట ప్రాంతాలలో పర్యటించారు. పలు మార్లు దళ సభ్యులూ, పార్టీ నాయకులతో మాట్లాడిన తర్వాత సాయుధ పోరు విరమించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
1955 నుంచి 1957 వరకు మొదటి రెండేండ్లు ఆంధ్ర శాసన సభలో, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సభ్యుడిగా, ఇంతకు ముందు రాజ్యసభ సభ్యుడిగా సుందరయ్య పనిచేశారు. ఆయన సునిశిత పరిశీలన, అధ్యయనాలకు ‘సాయుధ తెలంగాణ పోరాటం– గుణ పాఠాలు’, ‘ఆంధ్రప్రదేశ్ లో సమగ్ర నీటి పథకం’ రచనలు అద్దం పడతాయి.
1934లో ఉమ్మడి పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఆ తర్వాత 1964లో పార్టీ చీలిక తర్వాత ఏర్పడిన సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శిగా పీఎస్ బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కూడా పని చేశారు. జీవితాంతం కమ్యూనిస్ట్ ఉద్యమ విస్తృతికి అవిశ్రాంతంగా పని చేసిన ఆయన 1985 మే 19న భౌతికంగా అస్తమించారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న విద్వేష రాజకీయాలను తిప్పికొడుతూ సామరస్య జీవనాన్ని కాపాడుకోవడమే సుందరయ్యకు మన మిచ్చే నిజమైన నివాళి అవుతుంది.
జాలకంటి రంగారెడ్డి
వ్యాసకర్త సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి
వర్గ సభ్యులు ‘ 9490098349
Comments
Please login to add a commentAdd a comment