కత్తెరపల్లెకు రుణపడి ఉంటా
కార్వేటినగరం : తనను గెలిపించి ఎమ్మెల్యేగా చూడాలని 1977 నుంచి ప్రాణాలను లెక్కచేయక పోరాడిన కత్తెరపల్లె గ్రామస్తులకు రుణపడి ఉంటానని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కె.నారాయణస్వామి అన్నారు. గురువారం కత్తెరపల్లెలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ గ్రామంలో తన గెలుపుకోసం ప్రాణాలను సైతం లెక్కచేయక కాళ్లు, చేతులు, కళ్లు పోగొట్టుకుని వికలాంగులుగా ఉన్న వారి సమస్యలను తీర్చలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. సమితి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు చేసిన చిన్నచిన్న పనులను గ్రామస్తులు గుర్తుంచుకుని ఇప్పటికీ తనపై అభిమానాన్ని చాటుకుంటున్నారని తెలిపారు.
తన గెలుపునకు కృషిచేసిన వారి రుణం తీర్చుకుంటానని, నిరుద్యోగ సమస్య నిర్మూలనకు కృషిచేస్తానని చెప్పారు. కత్తెరపల్లె గ్రామానికి మేలు జరిగేంతవరకు సన్మానాలకు స్వస్తి పలకాలని సూచించారు. అనంతరం పింఛన్లు రాలేదంటూ వృద్ధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఆయన స్పందిస్తూ జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని హామిఇచ్చారు. అంతకుముందు ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. నాయకులు హేమసుందర్‌రెడ్డి,వెంకటప్రక్య(యూఎస్‌ఏ), చిరంజీవిరెడ్డి.మాజీ సర్పంచ్ మురగయ్య,శోభన్‌బాబు.అర్జునయ్య,కుప్పయ్య.రామచంద్రన్ పాల్గొన్నారు.