కలెక్టర్‌గారూ ఇంతకీ మీ బాధ్యతలు ఏంటి
శ్రీరంగరాజపురం: జిల్లా కలెక్టర్ ఆయన బాధ్యతలను పక్కవారిపై నెడుతూ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని జీడీనెల్లూరు ఎమ్మెల్యే కె.నారాయణస్వామి అన్నారు. మంగళవారం ఉదయం మండలంలోని నెళవాయిలో కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ నలభై సంవత్సరాలుగా ఇలాంటి కలెక్టర్‌ను చూడలేదన్నారు. మండలంలోని కటికపల్లె పంచాయతీలో పేదలు, దళితుల భూములకు సంబంధించిన పట్టాలు మారిపోయాయని, కొందరి భూములు పెద్దల ఆధీనంలో ఉన్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళితే తన పరిధిలోకి రాదని, జేసీని కలవాలని సూచించినట్లు తెలిపారు.
తాగునీటి సమస్యను జెడ్పీ సీఈవో దృష్టికి తీసుకెళ్లాలని, క్వారీల సమస్య గురించి అడిగితే మైన్స్ విభాగం దృష్టికి తీసుకెళ్లమని కలెక్టర్ చెబుతున్నారని తెలిపారు. గ్రీవెన్స్ సెల్‌లో వచ్చిన అర్జీలకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతున్నాయూ అనే విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. అలాంటప్పుడు ఆధికారులతో సమీక్షలు మాత్రం ఎందుకని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అందరికీ న్యాయం చేకూరేలా చూడాలని చెప్పారు.
వైఎస్సార్ పాలనలో అధికారులు ఇంటింటికీ వెళ్లి ఇందిరమ్మ గృహాలు, పింఛన్లకు అర్హులను ఎంపిక చేశారని, చంద్రబాబు పాలనలో పార్టీ కార్యకర్తలు పింఛన్లకు అర్హులను ఎంపిక చేయడం ఎంతవరకు సమంజసమని నారాయణస్వామి ప్రశ్నించారు. టీడీపీలో చిన్న కార్యకర్తలు చెప్పినా అధికారులు పనులు చేస్తున్నారని, ప్రతిపక్షంలో ప్రజాప్రతినిధులకు ఎందుకు పనులు చేయడం లేదని, ఇదేనా ప్రజాస్వామ్యమని ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన వెంట పార్టీ మండల కన్వీనర్ అనంతరెడ్డి, ఎంపీపీ మోహన్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యుడు విజయకుమార్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రమణప్రసాద్‌రెడ్డి ఉన్నారు.