కలెక్టరు బదిలీకి పోరాటం
► సీఎం చంద్రబాబుకు వారసుడిగా వ్యవహరిస్తున్న సిద్ధార్థ్‌జైన్
► అసెంబ్లీకి సైతం తప్పుడు నివేదికలు
► ఈ నెలఖారులోపు బదిలీ చేయాలి
► లేకుంటే మే 1 నుంచి ఆందోళనలు
► వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు,చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
తిరుపతిరూరల్: జిల్లా కలెక్టరు సిద్ధార్థ్‌జైన్ మంత్రి నారా లోకేష్‌కు బినామీగా వ్యవహరిస్తూ, టీడీపీకి తొత్తుగా మారిపోయారని వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు. అనధికారికంగా ‘నారా సిద్ధార్థ్‌గా’ చెలామణి అవుతున్న ఈయన్ను జిల్లా నుంచి పంపించి వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆయన విలేకరు ల సమావేశంలో కలెక్టర్ తీరుపై మండిపడ్డారు.
జిల్లాలో చంద్రబాబుకు ఇద్దరు వారసులు ఉన్నారని వారే..నారా సిద్ధార్థ్, నారా లోకేష్ అని వ్యంగ్యోక్తి విసిరారు. లోకేష్‌కు బినామీగా ఉండటమే కాకుండా చంద్రబాబు ఆస్తులకు సిద్ధార్థ్ సంరక్షకుడిగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. తన బినామీ కావటం వల్లే జిల్లాలో కలెక్టర్ తీరును నిరసిస్తూ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఎన్నిమార్లు ఫిర్యాదులు చేసిన ముఖ్యమంత్రి వెనకేసుకువస్తున్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీకి సైతం తప్పుడు నివేదికలను పంపిన కలెక్టర్‌పై కనీసం విచారణ కమిటీని కూడా వేయలేని దుస్థితిలో చంద్రబాబు ఉండటం సిగ్గుచేటన్నారు.
ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించాల్సిన జిల్లా స్థాయి సమావేశాలను సైతం తొమ్మిది నెలలకు ఒకసారి కూడా నిర్వహించలేని అసమర్థతలో ఉండటం బాధాకరమన్నారు. సిద్ధార్థపై అంతగా ప్రేమ ఉంటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి జిల్లాలోనే ఉంచుకోవాలని ఎద్దేవా చేశారు. ఆయన కలెక్టర్ స్థాయిలో నిర్వహించే ఏ సమావేశాలకూ తాను ఎమ్మెల్యేగా హాజరుకానని భీష్మించారు. ఈ నెల 30వ తేదీలోపు సిద్ధార్థ్‌ను జిల్లా నుంచి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే మే ఒకటో తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.