కదిరి : ‘నేను అశోక్.. 2 ఏళ్ల క్రితం బొరుగులు అమ్ముకుని జీవనం సాగించేవాణ్ణి. ఇప్పుడు రూ కోట్లు సంపాదించాను. అదికూడా గదిలో కూర్చునే. అందరిలాగా ఎండలో తిరగలేదు.. వానలో తడవలేదు.. చమటోడ్చి కష్టపడలేదు.. కేవలం సిమ్ కార్డులతోనే రూ కోట్లు సంపాదించాను’ అని చెప్పిన 2 రోజులకే కదిరి పోలీసుల వలలో చిక్కాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తలుపుల మండలం పెన్నబడివాండ్లపల్లికి చెందిన అశోక్ 2 ఏళ్ల క్రితం ఆ మండల కేంద్రంలో బొరుగులు అమ్ముకొని జీవనం సాగించేవాడు. ఆ తర్వాత చిన్న బంకు పెట్టుకుని వివిధ కంపెనీలకు సంబంధించిన సిమ్ కార్డులు, రీచార్జి కార్డులు అమ్మడం మొదలెట్టాడు.
తర్వాత ఆ మండలానికి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఏజెన్సీ తీసుకున్నాడు. సిమ్‌కార్డులు అధికంగా అమ్మిన వారిని ప్రోత్సహించేందుకు ఆయా కంపెనీలు విదేశీ పర్యటనకు పంపడం, కార్లు లాంటి బహుమతులు ఇవ్వడం అశోక్ దృష్టిని ఆకర్షించింది. ఎలాగైనా తాను విదేశీ పర్యటనతో పాటు ఓ కారును బహుమతిగా కొట్టేయాలని ఫిక్స్ అయిపోయాడు. ఇందుకు సక్రమబాటలో వెళ్తే సాధ్యం కాదని.. అక్రమ బాట ఎంచుకున్నాడు. విదేశీ పర్యటనకు వెళ్లిరావడంతో పాటు కారును కూడా గిఫ్ట్‌గా అందుకున్నాడు. తలుపుల లాంటి చిన్న మండల ఏజెంట్ ఈ స్థాయికి ఎదగడం పలువురు సిమ్ కార్డుల ఏజెంట్లు, డీలర్లను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆయా కంపెనీలు సైతం అతన్ని ప్రశంశలతో ముంచెత్తాయి.
అశోక్ ఎదుగుదల ఇలా: ఎయిర్‌టెల్, వొడాఫోన్ కంపెనీలు కష్టమర్లను ఆకర్షించేందుకు పలు ఆఫర్లు ఇవ్వడం మొదలెట్టాయి. ఇందులో బాగంగా ట్రాయ్ ఆదేశాలతో ఆయా కంపెనీలు మొబైల్ నెంబర్ పోర్టబిలిటీని తీసుకొచ్చాయి. అదే అశోక్ పాలిట వరంగా మారింది. 6 నెలల క్రితం తలుపుల నుండి కదిరికి తన మకాంను మార్చేసి మున్సిపల్ పరిధిలోని సైదాపురంలో ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు.
తనకు తోడుగా మరికొందరు యువకులను సాయంగా తీసుకుని వారికి ఆకర్షణీయమైన వేతనాన్ని ఇస్తూ తన చీకటి వ్యాపారాన్ని మొదలెట్టాడు. ఉదాహరణకు ఒక కష్టమర్ మొదట ఎయిర్‌టెల్ సిమ్ తీసుకుంటే ఆ కంపెనీ ఏజెంట్ అశోక్ రూ 50 కంపెనీ అందజేస్తుంది. ఇదే కష్టమర్ 3 నెలల తర్వాత ఎంఎన్‌పీ (మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ)ద్వారా వొడాఫోన్ నెట్‌వర్క్‌లోకి మారితే అశోక్‌కు రూ 150 కంపెనీ నుంచి వస్తుంది.
ఇదే కష్టమర్ మరో 3 నెలల తర్వాత ఇంకో నెట్‌వర్క్‌లోకి మారితే అశోక్‌కు మరో రూ 300 వస్తుంది. ఇలా 100 మంది లోపు అయితే ఓ రేటు.. 100 నుండి 200 మధ్య మరో రేటు 1000 దాటితే ఇంకో రేటు ఆయా కంపెనీల నుండి అశోక్ ఖాతాలో పడుతోంది. ఇంతకీ అశోక్ అంతమంది కష్టమర్లను పోర్టబిలిటీ ద్వారా మార్చాడా అంటే మీరు పప్పులో సిమ్ వేసినట్లే. నకిలీ ధ్రువీకరణ పత్రాలను తీసుకొని ఈ వ్యవహారమంతా ఆ అద్దె గదిలో కూర్చునే రాత్రింబవళ్లు నడిపాడు. దీనికోసం భారీ సంఖ్యలో ఫోన్‌లు, కంప్యూటర్, జిరాక్స్ మిషన్ కొనుగోలు చేశాడు.
తాను ఎలాగో ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఏజెంటు కాబట్టి తానే కష్టమర్ పాత్ర కూడా పోషించాడు. 100 సెల్‌పోన్లకు ఒక కంపెనీ సిమ్‌లు వే యడం.. 3 నెలల తర్వాత ఆ కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినట్లు చేయడం.. మరో 3 నెలల తర్వాత ఇంకో కంపెనీకి మారడం.. ఎవరికీ అనుమానం రాకుండా పాత సిమ్ కార్డులను నిప్పు పెట్టి కాల్చివేస్తూ ఇలా తన చీకటి సిమ్‌ల వ్యాపారంతో ఇప్పటికే రూ కోట్లు సంపాదించాడు.
ఇదే వ్యాపారాన్ని జిల్లాలో పలు పట్టణాలకు వ్యాపింపజేశాడు. ఆయా కంపెనీలు కూడా పసిగట్టలేని వ్యవహారాన్ని కదిరి పోలీసులు డేగకన్నుతో పసిగట్టి ‘అశోక్’ ‘సిమ్’హాన్ని బందించారు. దీనిపై తమదైన శైలిలో విచారిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు మరికొంద రు ఉన్నట్లు సమాచారం రాబట్టి వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సోమవారం రాత్రి 8 గంటలకు కదిరి, తలుపుల, ముదిగుబ్బ, నల్లమాడ, కొత్తచెరువు, పుట్టపర్తి, హిందూపురం ఇంకా పలు పట్టణాల్లో ఉన్న అశోక్ ముఠా సభ్యులు సుమారు 20 మందిని అదుపులోకి తీసుకుని వేల సంఖ్యలో వివిధ కంపెనీలకు సంబంధించిన సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై వివరాలు వెల్లడించడానికి కదిరి పోలీసులు నిరాకరించారు. నేడో రేపో నిందితులను మీడియా ముందు ప్రవేశపెడతారని తెలిసింది.