డర్టీ సిటీ!
ఎన్నిసార్లు చెప్పాలి?
► గ్రేటర్ విశాఖను చూసి నేర్చుకోండి
► కమిషనర్‌కు సీఎం చీవాట్లు
► కార్పొరేషన్‌లో హాట్ టాపిక్
సిటీ వరస్టుగా ఉంది. బందరురోడ్డు, ఏలూరురోడ్డు మినహా మరెక్కడ చూసినా చెత్తకుప్పలే.. చాలాసార్లు చెప్పా.. మీరు మారడం లేదు.. ఇక నేనే మారుస్తా.. అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నగరపాలక సంస్థ కమిషనర జి.వీరపాండియన్‌కు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం.
విజయవాడ సెంట్రల్ : కృష్ణా పుష్కర ఏర్పాట్లకు సంబంధించి గత వారాంతంలో హైదరాబాద్‌లో మున్సిపల్ శాఖ మంత్రి, కలెక్టర్, మేయర్, కమిషనర్, ఇతర అధికారులతో చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. విజయవాడ నగరంలో పారిశుద్ధ్యం అంశం ప్రస్తావనకు రాగా కమిషనర్‌పై సీఎం తీవ్ర స్థాయిలో ఫైర్ అయినట్లు తెలిసింది. ‘గ్రేటర్ విశాఖపట్నంలో పారిశుద్ధ్యం బాగోలేదని ఒక్కసారి చెబితే అక్కడి కమిషనర్ సెట్‌రైట్ చేశారు. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో! విజయవాడకు నేనొచ్చి ఎనిమిది నెలలైంది.. శానిటేషన్ బాగోలేదని చాలాసార్లు చెప్పా... ఏం ప్రయోజనం లేదు. ఏం చేస్తున్నట్లు?’ అంటూ చంద్రబాబు కమిషనర్‌ను గట్టిగా నిలదీశారని సమాచారం.
పనిలో పనిగా మున్సిపల్ మంత్రి పి.నారాయణకు సైతం సీఎం చురకలు వేశారని తెలిసింది. రాజధాని నగరంలోనే శానిటేషన్ బాగోపోతే ఎలా అంటూ మంత్రికి క్లాస్ తీసినట్లు వినికిడి. స్వచ్ఛభారత్ ర్యాంకింగ్‌లో 22వ స్థానంలో నిలిచామంటూ జబ్బలు చరుచుకున్న అధికారులకు సీఎం వ్యాఖ్యలతో దిమ్మతిరిగినంత పనైంది.
అన్నీ మాటలేనా!
నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగం పనితీరు అధ్వానంగా మారింది. 2,984 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, 850 మంది పర్మినెంట్ కార్మికులు పనిచేస్తున్నారు. ఒక్క ఔట్‌సోర్సింగ్ కార్మికులకే నెలకు రూ.4 కోట్లు జీతాలుగా చెల్లిస్తున్నారు. బందరు, ఏలూరురోడ్లతోపాటు నేషనల్ హైవేలో 24/7 శానిటేషన్ నిర్వహించే బాధ్యతను బీవీజీ ప్రైవేట్ కంపెనీకి అప్పగించారు. బందరు, ఏలూరు రోడ్లను లిట్టర్‌ఫ్రీ (చెత్తరహిత) జోన్లుగా ప్రకటించారు.
ఇవన్నీ కేవలం మాటలే.. గత నెలలో బందరురోడ్డులోని ఓ స్టార్ హోటల్‌లో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రాగా ఆ ప్రాంతంలో చెత్తకుప్పలు దర్శనమిచ్చాయి. దీనిపై అప్పట్లోనే సీఎం సీరియస్ అయిన సంగతి తెలిసిందే. కమిషనర్ పనితీరుపై ఇటీవలి కాలంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్‌తో కలిసి సమీక్షలు, సదస్సులతో బిజీగా ఉంటున్న కమిషనర్‌కు నగరపాలనపై పట్టు తప్పిందనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చీవాట్లు పెట్టడం కార్పొరేషన్లో హాట్ టాపిక్‌గా మారింది.
పాలన గాలికి..
ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ప్రజారోగ్య శాఖలో అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఏఎంవోహెచ్‌లు ప్రతిరోజు క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సి ఉంది. వారు కార్యాలయాలకే పరిమితమవుతున్నారనే ఆరోపణలున్నాయి. కొన్నేళ్లుగా పాతుకుపోయిన శానిటరీ ఇన్‌స్పెక్టర్లను (ఎస్.ఐ.లు) ఏడాది క్రితం లాటరీ ద్వారా డివిజన్లు మార్చారు. ఇదంతా మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. కొందరు ఎస్.ఐ.లు ఉన్నతాధికారుల్ని మేనేజ్ చేసుకొని తమకు కావాల్సిన డివిజన్లలో అనధికారికంగా విధులు నిర్వర్తిస్తున్నారు. అత్యధిక శాతం పర్మినెంట్ ఉద్యోగులు మస్తర్లు పూర్తయ్యాక వెళ్లిపోతున్నారు. ఇందుకుగాను సంబంధిత శానిటరీ ఇన్‌స్పెక్టర్లకు నెలకు రూ.7 వేల నుంచి రూ.10 వేలు ముట్టజెబుతున్నారన్నది బహిరంగ రహస్యం. ప్రిన్సిపల్ సెక్రటరీలు, వివిధ స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లలో సుమారు 400 మంది ఔట్‌సోర్సింగ్ కార్మికులు అనధికారికంగా విధులు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఫలితంగా నగరంలో పారిశుద్ధ్యం పడకేసింది.
చర్యలేవీ!
నగర పర్యటన సందర్భంలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉన్నట్లు కమిషనర్ గుర్తిస్తే కార్మికులపై చర్యలతో సరిపెడుతున్నారు. గడిచిన ఆరు నెలలుగా రెండు ఏఎంవోహెచ్ పోస్టుల్లో ఇన్‌చార్జులే ఉన్నారు. వీరికి అదనపు బాధ్యతలు ఉండడంతో మొక్కుబడిగా విధులు నిర్వర్తిస్తున్నారనే విమర్శలు న్నాయి. ఎస్.ఐ.లపై స్పష్టమైన ఫిర్యాదులు ఉన్నప్పటికీ చర్యలు తీసుకునే విషయంలో ఉన్నతాధికారులు మొహమాటం ప్రదర్శిస్తున్నారు. మలేరియా విభాగం పనితీరు అంతంతమాత్రంగానే ఉంది. కొందరు ఎస్.ఐ.ల కనుసన్నల్లో ప్రజారోగ్య విభాగం నడుస్తోందంటే అతిశయోక్తి కాదు. వీటన్నింటినీ చక్కదిద్దకపోవడం వల్లే కమిషనర్ సీఎం వద్ద మాటపడాల్సి వచ్చిందని ఉద్యోగులు గుసుగుసలాడుకోవడం కొసమెరుపు.