బీపీఎస్‌కు గ్రీన్‌సిగ్నల్
మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లకు పెరగనున్న ఆదాయం
నెల్లూరు, సిటీ : అనధికార నిర్మాణాల యజమానులకు రాష్ట్రప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. భవన అపరాధ రుసుము(బీపీఎస్) పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర కేబినెట్‌లో సోమవారం తీర్మానించింది. ఈ పథకం మున్సిపాలిటీలు, నెల్లూరు కార్పొరేషన్‌ల ఖజానాకు అదనపు ఆదాయం సమకూరనుంది. నెల్లూరు నగరంలో సుమారు 4 వేల వరకు అనధికార కట్టడాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. సూళ్ళూరుపేట, వెంకటగిరి, గూడూరు, కావలి, ఆత్మకూరు, నాయుడుపేట మున్సిపాలిటీల్లో మరో 3 వేల అక్రమ కట్టడాలు ఉంటాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఈ భవనాలను క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం బీపీఎస్ స్కీమ్‌ను అమలు చేయనుంది. 1998 నుంచి 2007 వరకు నిర్మితమైన భవనాలకు 2007లో బీపీఎస్ చేసుకునే విధంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. 2007 నుంచి 2010 వరకు మొదట బీపీఎస్‌ను అందుబాటులో ఉంచారు. ప్రజల సౌకర్యార్థం అప్పటి ప్రభుత్వం బీపీఎస్‌ను మరో రెండేళ్లు పొడిగించింది. ఈ వ్యవధిలో ఒక నెల్లూరు నగరంలోనే 3,800 దరఖాస్త్తులు అందాయి. అయితే కేవలం 1,700 దరఖాస్తుదారులకు మాత్రమే ఈ స్కీమ్‌ను వర్తింపజేశారు. మున్సిపాలిటీ అధికారులు సరిగా స్పందించకపోవడంతో దాదాపు 2 వేలకు పైగా దరఖాస్తులు మూలనపడ్డాయి.
బీపీఎస్ విధానం అమలులో మున్సిపాలిటీ అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. ఒకరు కట్టిన ‘డీడీ’ని మరొకరికి వినియోగించినట్లు సమాచారం. బీపీఎస్ స్కీమ్‌తోఐదేళ్లలో నెల్లూరు మున్సిపాలిటీకి రూ. 3కోట్ల ఆదాయం వచ్చింది. 2012 తరువాత బీపీఎస్ స్కీమ్‌ను నిలిపివేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడేళ్ల వ్యవధిలో ఏడాదికి కనీసం 500 అనుమతి లేని కట్టడాలు ఉండొచ్చని మున్సిపల్ వర్గాల అంచనా. నెల్లూరు నగరంలోనే 4వేలకుపైగా అనుమతులు లేని కట్టడాలు ఉండొచ్చని అంచనా. ప్రభుత్వ తాజా నిర్ణయంతో కార్పొరేషన్‌కు రూ.4 కోట్లకు పైగా ఆదాయం సమకూరనుంది.
కార్పొరేషన్‌కు ఆదాయం పెరిగే అవకాశం..
నెల్లూరు నగర పాలక సంస్థకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. నూతన కమిషనర్ చక్రధర్‌బాబు అక్రమ కట్టడాల కూల్చివేతకు శ్రీకారం చుట్టారు. దీంతో అనుమతులు లేని కట్టడాల యజమానులు ఆందోళనలో పడ్డారు. రాష్ట్రప్రభుత్వం బీపీఎస్‌ను ఆమోదిస్తూ తీసుకోవడంతో అనధికార నిర్మాణాల యజమానులకు ఊరట లభించింది.ఈ సమయంలో యజమానులు బీపీఎస్‌ను అధిక సంఖ్యలో వినియోగించుకోనుండడంతో కార్పొరేషన్‌కు ఆదాయం భారీగా పెరిగే అవకాశం ఉంది.