bps scheme
-
చిన్న పొదుపు ఖాతాదారులకు కేంద్రం శుభవార్త
న్యూఢిల్లీ: వరుసగా రేట్ల తగ్గింపులతో చిన్నబోయిన చిన్న మొత్తాల పొదుపు పథకాలకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యోల్బణం కట్టడికి కీలకమైన వడ్డీ రేట్లను పెంచుతూ వెళుతున్నాయి. మన ఆర్బీఐ కూడా ఇదే బాటలో నడుస్తోంది. మే చివరి నుంచి ఇప్పటి వరకు 1.4 శాతం మేర రెపో రేటును పెంచింది. దీంతో మార్కెట్ తీరుకు అనుగుణంగా, తొమ్మిది వరుస త్రైమాసికాల యథాతథ స్థితి తర్వాత.. చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లను సైతం కేంద్ర సర్కారు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 0.30 శాతం వరకు పలు పథకాల రేట్లను పెంచుతూ ప్రకటన విడుదల చేసింది. పన్ను పరిధిలోకి వచ్చే పథకాలపై ప్రధానంగా రేట్లను పెంచింది. అదే సమయంలో కొన్ని పథకాల రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. ప్రతి త్రైమాసికానికీ ఈ పథకాల రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంటుంది. ఇందులో భాగంగా అక్టోబర్ 1 నుంచి మొదలయ్యే తదుపరి మూడు నెలల కాలానికి తాజా రేట్లపై కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. మూడేళ్ల టైమ్ డిపాజిట్‌పై ప్రస్తుతం 5.5 శాతం రేటు ఉంటే, ఇక మీదట ఇది 5.8 శాతం కానుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై రేటు 0.20 శాతం పెరిగి 7.6 శాతానికి చేరింది. ప్రస్తుతం ఈ పథకంలో రేటు 7.4 శాతంగా ఉంది. కిసాన్ వికాస్ పత్ర రేటును 6.9 శాతం నుంచి 7 శాతానికి (123 నెలలకు మెచ్యూరిటీ).. పోస్టాఫీసు మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌లో రేటును 6.6 శాతం నుంచి 6.7 శాతానికి కేంద్రం సవరించింది. వీటిల్లో మార్పు లేదు..: ఏడాది, ఐదేళ్ల ఎఫ్డీలు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) పథకాల రేట్లు ప్రస్తుతమున్న మాదిరే మరో మూడు నెలలు కొనసాగుతాయి. ఈ పథకాల రేట్లను కేంద్రం సవరించలేదు. సవరించిన రేట్లు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. -
‘బీపీఎస్’పై అధికారుల నిర్లక్ష్యం
పట్టణంలో ఓ చిరుద్యోగి తన తండ్రి నుంచి వచ్చిన స్థలంలో చిన్న ఇల్లు కట్టుకున్నాడు. ప్లాన్‌కు విరుద్ధంగా కొంత నిర్మాణం జరిగింది. బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్)లో రెగ్యులరైజ్ చేయించుకునేందుకు ఓ సారి దరఖాస్తు చేశాడు. అయితే ఆ దరఖాస్తును పక్కన పెట్టేశారు. మళ్లీ రెండోసారి దరఖాస్తు చేశారు. అయినా పట్టించుకోలేదు. చివరకు ఓ మాజీ ప్రజాప్రతినిధి ద్వారా బేరసారాలకు దిగాడు. చేద్దాం.. చూద్దాం అంటూ బదులిస్తున్నారు. ఈ సమస్య.. ఈ ఒక్క చిరుద్యోగిదే కాదు.. జిల్లా వ్యాప్తంగా బీపీఎస్‌లో దరఖాస్తు చేసుకున్న వారిలో సగానికి పైగా ఇదే పరిస్థితి. జిల్లాలో అందిన దరఖాస్తుల్లో 12 శాతానికి మించి పరిష్కారానికి నోచుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యనికి నిదర్శనం. సాక్షి, మచిలీపట్నం : బీపీఎస్ పథకం కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలకు ఆదాయం సమకూర్చే ఓ సాధనం. అయితే ఈ పథకంపై జిల్లాలో ఆయా సంస్థల అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా అందుతున్నా.. పరిష్కారమవుతున్న సమస్యలు బహుస్వల్పంగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలకు విడుదలయ్యే గ్రాంట్స్‌లో కేంద్రం ఏటా వివిధ కారణాలు చూపి కోతలు విధిస్తోంది. ఈ తరుణంలో ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు ఉద్దేశించిన బీపీఎస్ పథకాన్ని నిర్లక్ష్యం చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బంది కొరత సాకుతో టౌన్ ప్లానింగ్ విభాగం బీపీఎస్ దరఖాస్తుల పరిష్కారంలో తీవ్ర నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తుండడంతో ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బీపీఎస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని స్థానిక సంస్థలు మౌలిక సదుపాయాల కల్పన కోసం వెచ్చించుకునే వెసులుబాటు ఉంది. అయినా సరే తమకేమి పట్టనట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. చివరకు కమిషనర్లు కూడా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కేవలం కమిషనర్ సంతకం కోసం జిల్లా వ్యాప్తంగా 600కు పైగా దరఖాస్తులు ఎదురు చూస్తుండడం ఇందుకు నిదర్శనం. కొన్ని చోట్ల ఒక్కో పనికి ఒక్కో రేటు బిల్డింగ్ పీనలైజ్ స్కీమ్ (బీపీఎస్) కింద రెగ్యులరైజ్ చేసుకునేందుకు ప్రభుత్వం జనవరిలో అవకాశమిచ్చారు. ఇందుకోసం ఆగస్టు 31వ తేదీ గడువు విధించింది. గడువు ముగిసే నాటికి సీఆర్డీఏ పరిధితో çసహా జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లు, తొమ్మిది మున్సిపాల్టీల్లో 8,321 దరఖాస్తులు అందాయి. వాటిలో ఇప్పటి వరకు 980 దరఖాస్తులను మాత్రమే పరిష్కరించడం ఈ పథకం పట్ల ఏ స్థాయిలో నిర్లక్ష్యం తాండవిస్తోందో అర్థం చేసుకోవచ్చు. 20 దరఖాస్తులను తిరస్కరించగా, 6,689 దరఖాస్తులు వివిధ దశల్లో ఉన్నాయని చెబుతున్నారు. కాగా 623 దరఖాస్తులను కనీసం పరిశీలన కూడా చేయలేదు. ఇప్పటి వరకు పరిష్కరించిన దరఖాస్తుల ద్వారా జిల్లాలోని నగర, మున్సిపాల్టీలకు రూ.21 కోట్ల ఆదాయం సమకూరింది. అత్యధికంగా సీఆర్డీఏ పరిధిలో 3,875 దరఖాస్తులందగా వాటిలో రెగ్యులరైజ్ చేసినవి 447 మాత్రమే. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 3,008 దరఖాస్తులందగా, రెగ్యులరైజ్ చేసినవి 343 మాత్రమే. అత్యల్పంగా నందిగామలో 257 దరఖాస్తులకు కేవలం రెండు దరఖాస్తులను మాత్రమే పరిష్కరించగలిగారు. అయితే చేయి తడిపితే కానీ బీపీఎస్ దరఖాస్తులను పట్టించుకోవడం లేదని దరఖాస్తుదారులు వాపోతున్నారు. కొన్ని మున్సిపాల్టీల్లో ఒక్కో పనికి ఒక్కో రేటు పెట్టి మరీ వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. బీపీఎస్ కింద అందిన దరఖాస్తులు 8,321 ఇప్పటి వరకు పరిష్కరించినవి 980 వచ్చిన ఆదాయం రూ. 21 కోట్లు వివిధ దశల్లో ఉన్న దరఖాస్తులు 6,689 దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టడం సరికాదు టౌన్ ప్లానింగ్‌లో సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమే. కానీ దాన్ని సాకుగా చూపి దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టడం సరికాదు. కమిషనర్లు బాధ్యతగా తీసుకుని వీటి పరిష్కారంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని స్థానికంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉందన్న విషయాన్ని గుర్తించుకోవాలి. – వైపీ రంగనాయకులు, ఆర్డీడీ, టౌన్‌ప్లానింగ్ విభాగం, రాజమండ్రి రీజియన్ -
మరోసారి బీపీఎస్
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించనుంది. బిల్డింగ్ పీనలైజేషన్ పథకాన్ని (బీపీఎస్) తిరిగి అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన పలు షరతులు, నిబంధనలు, ఇతర అంశాలపై రాష్ట్ర కంట్రీ ప్లానింగ్ విభాగం కొద్ది రోజులుగా చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చింది. ఈ నెలాఖరులోపు బీపీఎస్ పథకం అమలు చేసేందుకు అనువైన ఉత్తర్వులు జారీ కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. చిత్తూరు అర్బన్: అనుమతి లేని నిర్మాణాలు, అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం 2007లో బీపీఎస్ పథకాన్ని స్వచ్ఛంద విధానంలో ప్రవేశపెట్టింది. 2015లో మరోసారి ప్రవేశపెట్టినా నిర్బంధ పద్ధతి అమల్లోకి తెచ్చింది. దీని ఆధారంగా చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లతో పాటు పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, నగరి, పుత్తూరు, శ్రీకాళహస్తి మున్సిపాలిటీల్లో 20 వేల మందికి పైగా భవన యజమానులు తమ అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించుకున్నారు. తద్వారా రెండు నగరపాలక సంస్థలకు రూ.12 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. ఆ స్కీముల కాలపరిమితి ముగియడంతో ప్రస్తుతం విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు పెరిగిపోయాయి. వాటిని తిరిగి క్రమబద్ధీకరించడం ద్వారా భారీగా ఆదాయం సమకూర్చుకునే వీలుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. పైగా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీపీఎస్ ద్వారా స్థానిక సంస్థలకు ఆర్థిక పరిపుష్టి కల్పించడం కూడా ఓ ఎత్తుగా ప్రభుత్వం దీన్ని అమల్లోకి తీసుకొస్తోంది. వెసులుబాటు.. బీపీఎస్ కింద అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ప్రస్తుతం తగిన వెసులు బాటు కల్పించనుంది. 2007లో ఆ పథకం కిం ద దరఖాస్తు చేసుకుని క్రమబద్ధీకరించుకోకుం డా మిగిలిపోయిన వారికి సైతం ఈసారి అవకాశం ఇవ్వనున్నారు. జిల్లాలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో 2007 నాటి దరఖాస్తులు 400 వరకు, 2015 నాటి దరఖాస్తులు 700 వరకు పరిష్కారం కాకుండా మిగిలిపోయాయి. వీటితోపాటు నూతన దరఖాస్తులను సైతం స్వీకరించి పీనలైజేషన్ ఫీజుల కింద ఆదాయం సమకూర్చుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఖర్చు తక్కువే... 2015లో అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించుకునేందుకు 15 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వాటిల్లో దాదాపు 14 వేల వరకు పరిష్కారమయ్యాయి. అయితే అధికారుల క్షేత్రస్థాయి పరిశీలనలో కొన్ని లోపాలు, ఇతర సమస్యలు, అడ్డంకుల కారణంగా అనేక మంది ఆ పథకంలో ప్రవేశించినా తమ భవనాలను క్రమబద్ధీకరించుకోలేకపోయారు. అటువంటి వారికి సైతం ప్రస్తుతం వెసులుబాటు కల్పించడంతో పాటు గతంలో ఉత్పన్నమైన సమస్యలను అధిగమించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బీపీఎస్ పథకం కింద భవనాలను క్రమబద్ధీకరించుకునే యజమానులు 2015 నాటి లెక్కల ప్రకారమే ఫీజులు చెల్లించేలా ప్రభుత్వం ప్రస్తుతం నిబంధనలు పొందుపరిచినట్లు అధికా రులు చెబుతున్నారు. దీంతో భవన యజమానులపై అధిక భారం పడే పరిస్థితి ఉండదని భావిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు లోపు నిర్మాణాలు పూర్తి చేసి ఉండాలనే నిబంధన పొందుపరచడం ద్వారా ఇటీవల వరకు నిర్మించిన వాటినీ క్రమబద్ధీకరించుకునే వెసులుబాటు కల్పించనున్నారు. రూ.20 కోట్ల వరకు ఆదాయం... ఈసారి జిల్లాలో బీపీఎస్ ద్వారా మున్సిపాలిటీలకు ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశముంది. ప్లాన్ ప్రకారం కాకుండా జరిగిన ఉల్లంఘనలు, డీవియేషన్లు ఇందులో క్రమబద్ధీకరించుకోవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు అవకాశం ఉండకపోచ్చు. వీటిని మాత్రం కూల్చివేస్తాం. – నాగేంద్ర, పట్టణ ప్రణాళిక అధికారి, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ -
బీపీఎస్.. చివరి అవకాశం బాస్
తాడేపల్లిగూడెం : అనుమతులు లేకుండా చేపట్టిన భవనాలను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం రూపొందించిన బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్) గడువు ఈ నెలాఖరున ముగియనుంది. దీంతో ఈ పథకాన్ని మునిసిపాలిటీల్లోని ప్రజలు వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఈ పథకంలో చేసుకున్న దరఖాస్తుల్లో కొన్నింటిని తిరస్కరించగా మరికొన్ని పెండింగ్‌లో ఉంచారు. వాటిపై కూడా టౌన్ అండ్ కంట్రీప్లానింగ్ అ«ధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించడం, తిరస్కరించిన దరఖాస్తులను క్రమబద్ధీకరించేందుకు ఉన్న అవకాశాలను చూసేందుకు డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. మునిసిపాలిటీల్లోని పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు , లైసెన్స్డ్ సర్వేయర్లను వెంట పెట్టుకుని దరఖాస్తు చేసి క్రమబద్ధీకరించుకోని వారి ఇంటి తలుపులు తట్టనున్నారు. బీపీఎస్ గడువు నెలాఖరుతో ముగుస్తున్నందున డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేపట్టి అర్హులైన దరఖాస్తుదారుల నుంచి సొమ్ములు కట్టించుకోవాలనే ఆదేశాలు ఇప్పటికే మునిసిపాలిటీల్లోని పట్టణ ప్రణాళికా విభాగానికి వచ్చాయి. జిల్లాలో వచ్చిన దరఖాస్తులు 4,635 బీపీఎస్ పథకం కింద జిల్లాలోని మునిసిపాలిటీల నుంచి 4,635 దరఖాస్తులు వచ్చాయి. భీమవరంలో 1,155 దరఖాస్తులు రాగా 16 తిరస్కరించారు. 81 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, 1058 దరఖాస్తులను అనుమతించారు. ఏలూరులో 695 దరఖాస్తులు రాగా 28 దరఖాస్తులను తిరస్కరించారు. 70 పెండింగ్‌లో ఉండగా, 597 దరఖాస్తులను అప్రూవల్ చేశారు. జంగారెడ్డిగూడెంలో 78 దరఖాస్తులు రాగా, ఏడింటిని తిరస్కరించగా, ఆరు పెండింగ్‌లో ఉంచి, 65 దరఖాస్తులను అప్రూవల్ చేశారు. కొవ్వూరులో 242 దరఖాస్తులు రాగా ఆరింటిని తిరస్కరించారు. 58 పెండింగ్‌లో ఉన్నాయి. 178 దరఖాస్తులను అప్రూవల్ చేశారు. నరసాపురంలో 142 దరఖాస్తులు రాగా, రెండింటిని పెండింగ్‌లో ఉంచి, 140 దరఖాస్తులను అప్రూవల్ చేశారు. నిడదవోలులో 122 దరఖాస్తులు రాగా, పదింటిని తిరస్కరించగా, 16 పెండింగ్‌లో ఉన్నాయి. మిగిలిన 96 దరఖాస్తులను ఆమోదించారు. పాలకొల్లులో 567 దరఖాస్తులు రాగా, ఒక దరఖాస్తును తిరస్కరించగా, 14 పెండింగ్‌లో ఉంచారు. 552 దరఖాస్తులను ఆమోదించారు. తణుకులో 1,087 దరఖాస్తులు రాగా 15 దరఖాస్తులను తిరస్కరించారు. 347 దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచి, 725 దరఖాస్తులను ఆమోదించారు. తాడేపల్లిగూడెంలో 547 దరఖాస్తులు రాగా122 దరఖాస్తులను తిరస్కరించారు. 13 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 412 దరఖాస్తులను ఆమోదించారు. తిరస్కరించిన దరఖాస్తుల్లో అర్హత కలిగిన వాటిని అధికారులు గుర్తిస్తారు. అర్హత ఉంటే వాటిని క్రమబద్ధీకరించుకోవడానికి తగిన రుసుములు కట్టించుకోవాలి. ఈ అవకాశాన్ని సద్వినియో చేసుకోవాలని జిల్లా ప్రణాళిక శాఖ ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టాం బీపీఎస్ కింద దరఖాస్తు చేసుకున్న వారు వారి దరఖాస్తులను నెలాఖరులోగా క్రమబద్ధీకరించుకోవాలి. దీనికోసం పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు. లైసెన్స్డ్ సర్వేయర్లతో డోర్ టు డోర్ కార్యక్రమం చేపట్టాం. అర్హత కలిగిన దరఖాస్తులు ఉంటే క్రమబద్ధీకరిస్తారు. ఈ అవకాశాన్ని దరఖ> స్తుదారులు సద్వినియో చేసుకోవాలి.– బీఎన్ఎస్.సాయిబాబా, ఆర్డీ, టౌన్ అండ్ కంట్రీప్లానింగ్ డిపార్టుమెంట్ -
ఫీల్డ్ వెరిఫికేషన్ లేకుండా బీపీఎస్ దరఖాస్తులు మంజూరు
నెల్లూరు, సిటీ : బీపీఎస్(బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్) కింద దరఖాస్తు చేసుకున్న వాటిని ఫీల్డ్ వెరిఫికేషన్ లేకుండా మంజూరు చేయునున్నట్లు టౌన్‌ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ రంగరాజు పేర్కొన్నారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ఎల్బీఎస్(లైసెన్స్ బిల్డింగ్ సర్వేయర్లు)తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రంగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీపీఎస్‌లో కొన్ని మార్పులు చేసినట్లు తెలిపారు. బీపీఎస్‌లో దరఖాస్తు చేసుకున్న వారి ఫైల్స్‌ను టౌన్‌ప్లానింగ్ అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్ లేకుండా మంజూరు చేస్తామన్నారు. ఆన్లైన్ పద్ధతి ప్రకారం బీపీఎస్ కూడా సులభ పద్ధతిలో చేయడం జరిగిందన్నారు. సెప్టెంబర్ 15వ తేదీలోపు బీపీఎస్‌లో దరఖాస్తు చేసుకున్న వారు వారి డాక్యుమెంట్లు అప్‌లోడ్‌చేయాలని సూచించారు. సమావేశంలో టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్ సుధాకర్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, ఎల్‌బీఎస్‌లు పాల్గొన్నారు. -
కాసుల గలగలలే..
- బీపీఎస్‌కు ప్రభుత్వం పచ్చజెండా - కార్పొరేషన్‌కు రూ.100కోట్లు ఆదాయం వచ్చే అవకాశం - ఆశల పల్లకీలో పాలకులు విజయవాడ సెంట్రల్ : బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బీపీఎస్)కు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. విధివిధానాలను విడుదల చేసింది. దీనిపై టౌన్‌ప్లానింగ్ అధికారులు ఈనెల 27 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుదారులు తొలివిడతగా రూ.10వేలు, రెండు నెలల్లో మిగిలిన అపరాధ రుసుం చెల్లించాలి. బీపీఎస్ ద్వారా నగరపాలక సంస్థకు రూ.100 కోట్లపైనే ఆదాయం వస్తుందని అధికారుల అంచనా. భవన నిర్మాణాలను క్రమబద్దీకరిచేందుకు 2007లో నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మునిసిపాల్టీలు, నగరపాలక సంస్థల్లో బీపీఎస్ స్కీమ్ అమలు చేశారు. ఈ పథకం ద్వారా గృహ నిర్మాణ యజమానులు అక్రమాలను సరిదిద్దుకున్నారు. అప్పట్లో బీపీఎస్ కింద నగరపాలక సంస్థకు 15,826 దరఖాస్తులు అందాయి. 11,287 దరఖాస్తులకు సంబంధించిన గృహాలను క్రమబద్దీకరించారు. తద్వారా రూ.68.3 కోట్ల ఆదాయం ఖజానాకు జమ అయింది. కోర్టు కేసులు, డబ్బు సకాలంలో చెల్లించకపోవడం వంటి కారణాలతో 4,539 దరఖాస్తులను తిరస్కరించారు. బీపీఎస్ మళ్లీ తెరపైకి రావడంతో వీరికి చాన్స్ దక్కే అవకాశం ఉంది. దండిగా ఆదాయం నగరంలో భవన నిర్మాణాలకు సంబంధించి టౌన్‌ప్లానింగ్ విభాగం ఏడాదికి 2,500 ప్లాన్లు మంజూరు చేస్తుంది. ఇందులో 200 గజాల లోపు రెండో అంతస్తుకు అనుమతికి నిరాకరిస్తున్నారు. మార్ట్గేజ్ చేసేందుకు ఇష్టపడని గృహ నిర్మాణదారులు ఆమ్యామ్యాలు సమర్పించుకుని అడ్డదారిలో రెండు, మూడు అంతస్తులు ని ర్మాణం చేపడుతున్నారు. టౌన్‌ప్లానింగ్ మం జూరుచేసే 75 శాతం ప్లాన్లలో నిబంధనల ఉల్లంఘన జరుగుతోందన్నది బహిరంగ రహస్యం. 1985 జనవరి ఒకటో తేదీ తరువాత నుంచి 2014 డిసెంబర్ 31 వరకు నిర్మాణమైన భవనా ల క్రమబద్దీకరణకు అవకాశమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈక్రమంలో నగరంలో 12వేల నుంచి 15వేల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని టౌన్‌ప్లానింగ్ అధికారులు లె క్కలేస్తున్నారు. తద్వారా రూ.70 కోట్ల నుంచి రూ.100 కోట్ల ఆదాయం వ అవకాశం ఉంది. స్పెషల్ డ్రైవ్ బీపీఎస్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడం ద్వారా స్థానిక సంస్థల్లో ఆర్థికలోటును పూడ్చుకోవాలనే యోచనలో సర్కార్ ఉంది. సాధ్యమైనన్ని ఎక్కువ దరఖాస్తులు వచ్చేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. భవన నిర్మాణాల్లో అక్రమాలకు క్రమబద్దీకరించుకోకుంటే నీటి, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడంతో పాటు ఆస్తిపన్నును నూరుశాతం పెంచే అవకాశం ఉంది. ఈ విషయమై గృహ నిర్మాణదారుల్లో అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బీపీఎస్ పథకం కింద గతంలో అందిన దరఖాస్తుల్ని పరిగణనలోకి తీసుకుంటామని అసిస్టెంట్ సిటీప్లానర్ (ఏసీపీ-2) మధుకుమార్ ‘సాక్షి’కి చెప్పారు. రెనిడెన్షియల్, నాన్‌రెసిడెన్షియల్, కమర్షియల్ కేటగిరిల్లో ఈ పథకాన్ని అమలు చేస్తారు. -
బీపీఎస్‌కు గ్రీన్‌సిగ్నల్
మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు పెరగనున్న ఆదాయం నెల్లూరు, సిటీ : అనధికార నిర్మాణాల యజమానులకు రాష్ట్రప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. భవన అపరాధ రుసుము(బీపీఎస్) పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర కేబినెట్లో సోమవారం తీర్మానించింది. ఈ పథకం మున్సిపాలిటీలు, నెల్లూరు కార్పొరేషన్ల ఖజానాకు అదనపు ఆదాయం సమకూరనుంది. నెల్లూరు నగరంలో సుమారు 4 వేల వరకు అనధికార కట్టడాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. సూళ్ళూరుపేట, వెంకటగిరి, గూడూరు, కావలి, ఆత్మకూరు, నాయుడుపేట మున్సిపాలిటీల్లో మరో 3 వేల అక్రమ కట్టడాలు ఉంటాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ భవనాలను క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం బీపీఎస్ స్కీమ్‌ను అమలు చేయనుంది. 1998 నుంచి 2007 వరకు నిర్మితమైన భవనాలకు 2007లో బీపీఎస్ చేసుకునే విధంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. 2007 నుంచి 2010 వరకు మొదట బీపీఎస్‌ను అందుబాటులో ఉంచారు. ప్రజల సౌకర్యార్థం అప్పటి ప్రభుత్వం బీపీఎస్‌ను మరో రెండేళ్లు పొడిగించింది. ఈ వ్యవధిలో ఒక నెల్లూరు నగరంలోనే 3,800 దరఖాస్త్తులు అందాయి. అయితే కేవలం 1,700 దరఖాస్తుదారులకు మాత్రమే ఈ స్కీమ్‌ను వర్తింపజేశారు. మున్సిపాలిటీ అధికారులు సరిగా స్పందించకపోవడంతో దాదాపు 2 వేలకు పైగా దరఖాస్తులు మూలనపడ్డాయి. బీపీఎస్ విధానం అమలులో మున్సిపాలిటీ అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. ఒకరు కట్టిన ‘డీడీ’ని మరొకరికి వినియోగించినట్లు సమాచారం. బీపీఎస్ స్కీమ్తోఐదేళ్లలో నెల్లూరు మున్సిపాలిటీకి రూ. 3కోట్ల ఆదాయం వచ్చింది. 2012 తరువాత బీపీఎస్ స్కీమ్‌ను నిలిపివేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడేళ్ల వ్యవధిలో ఏడాదికి కనీసం 500 అనుమతి లేని కట్టడాలు ఉండొచ్చని మున్సిపల్ వర్గాల అంచనా. నెల్లూరు నగరంలోనే 4వేలకుపైగా అనుమతులు లేని కట్టడాలు ఉండొచ్చని అంచనా. ప్రభుత్వ తాజా నిర్ణయంతో కార్పొరేషన్‌కు రూ.4 కోట్లకు పైగా ఆదాయం సమకూరనుంది. కార్పొరేషన్‌కు ఆదాయం పెరిగే అవకాశం.. నెల్లూరు నగర పాలక సంస్థకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. నూతన కమిషనర్ చక్రధర్‌బాబు అక్రమ కట్టడాల కూల్చివేతకు శ్రీకారం చుట్టారు. దీంతో అనుమతులు లేని కట్టడాల యజమానులు ఆందోళనలో పడ్డారు. రాష్ట్రప్రభుత్వం బీపీఎస్‌ను ఆమోదిస్తూ తీసుకోవడంతో అనధికార నిర్మాణాల యజమానులకు ఊరట లభించింది.ఈ సమయంలో యజమానులు బీపీఎస్‌ను అధిక సంఖ్యలో వినియోగించుకోనుండడంతో కార్పొరేషన్‌కు ఆదాయం భారీగా పెరిగే అవకాశం ఉంది.