మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించనుంది. బిల్డింగ్ పీనలైజేషన్ పథకాన్ని (బీపీఎస్) తిరిగి అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన పలు షరతులు, నిబంధనలు, ఇతర అంశాలపై రాష్ట్ర కంట్రీ ప్లానింగ్ విభాగం కొద్ది రోజులుగా చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చింది. ఈ నెలాఖరులోపు బీపీఎస్ పథకం అమలు చేసేందుకు అనువైన ఉత్తర్వులు జారీ
కానున్నట్లు అధికారులు చెబుతున్నారు.
చిత్తూరు అర్బన్: అనుమతి లేని నిర్మాణాలు, అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం 2007లో బీపీఎస్ పథకాన్ని స్వచ్ఛంద విధానంలో ప్రవేశపెట్టింది. 2015లో మరోసారి ప్రవేశపెట్టినా నిర్బంధ పద్ధతి అమల్లోకి తెచ్చింది. దీని ఆధారంగా చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లతో పాటు పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, నగరి, పుత్తూరు, శ్రీకాళహస్తి మున్సిపాలిటీల్లో 20 వేల మందికి పైగా భవన యజమానులు తమ అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించుకున్నారు.
తద్వారా రెండు నగరపాలక సంస్థలకు రూ.12 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. ఆ స్కీముల కాలపరిమితి ముగియడంతో ప్రస్తుతం విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు పెరిగిపోయాయి. వాటిని తిరిగి క్రమబద్ధీకరించడం ద్వారా భారీగా ఆదాయం సమకూర్చుకునే వీలుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. పైగా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీపీఎస్ ద్వారా స్థానిక సంస్థలకు ఆర్థిక పరిపుష్టి కల్పించడం కూడా ఓ ఎత్తుగా ప్రభుత్వం దీన్ని అమల్లోకి తీసుకొస్తోంది.
వెసులుబాటు..
బీపీఎస్ కింద అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ప్రస్తుతం తగిన వెసులు బాటు కల్పించనుంది. 2007లో ఆ పథకం కిం ద దరఖాస్తు చేసుకుని క్రమబద్ధీకరించుకోకుం డా మిగిలిపోయిన వారికి సైతం ఈసారి అవకాశం ఇవ్వనున్నారు. జిల్లాలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో 2007 నాటి దరఖాస్తులు 400 వరకు, 2015 నాటి దరఖాస్తులు 700 వరకు పరిష్కారం కాకుండా మిగిలిపోయాయి. వీటితోపాటు నూతన దరఖాస్తులను సైతం స్వీకరించి పీనలైజేషన్ ఫీజుల కింద ఆదాయం సమకూర్చుకోవాలని అధికారులు భావిస్తున్నారు.
ఖర్చు తక్కువే...
2015లో అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించుకునేందుకు 15 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వాటిల్లో దాదాపు 14 వేల వరకు పరిష్కారమయ్యాయి. అయితే అధికారుల క్షేత్రస్థాయి పరిశీలనలో కొన్ని లోపాలు, ఇతర సమస్యలు, అడ్డంకుల కారణంగా అనేక మంది ఆ పథకంలో ప్రవేశించినా తమ భవనాలను క్రమబద్ధీకరించుకోలేకపోయారు. అటువంటి వారికి సైతం ప్రస్తుతం వెసులుబాటు కల్పించడంతో పాటు గతంలో ఉత్పన్నమైన సమస్యలను అధిగమించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
బీపీఎస్ పథకం కింద భవనాలను క్రమబద్ధీకరించుకునే యజమానులు 2015 నాటి లెక్కల ప్రకారమే ఫీజులు చెల్లించేలా ప్రభుత్వం ప్రస్తుతం నిబంధనలు పొందుపరిచినట్లు అధికా రులు చెబుతున్నారు. దీంతో భవన యజమానులపై అధిక భారం పడే పరిస్థితి ఉండదని భావిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు లోపు నిర్మాణాలు పూర్తి చేసి ఉండాలనే నిబంధన పొందుపరచడం ద్వారా ఇటీవల వరకు నిర్మించిన వాటినీ క్రమబద్ధీకరించుకునే వెసులుబాటు కల్పించనున్నారు.
రూ.20 కోట్ల వరకు ఆదాయం...
ఈసారి జిల్లాలో బీపీఎస్ ద్వారా మున్సిపాలిటీలకు ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశముంది. ప్లాన్ ప్రకారం కాకుండా జరిగిన ఉల్లంఘనలు, డీవియేషన్లు ఇందులో క్రమబద్ధీకరించుకోవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు అవకాశం ఉండకపోచ్చు. వీటిని మాత్రం కూల్చివేస్తాం.
– నాగేంద్ర, పట్టణ ప్రణాళిక అధికారి, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్
Comments
Please login to add a commentAdd a comment