సాక్షి,చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లా ఎస్‌ఆర్ పురం సమీపంలోని కొట్టార్లపల్లెలో ఐటీ హబ్ ఏర్పాటు కానుంది. బెంగళూరుకు చెందిన స్మార్ట్ డీవీ గ్రూప్ ఆఫ్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కంపెనీ ఏర్పాటుతో వచ్చే మూడేళ్లలో 3 వేల మందికి ఉపాధి లభించనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆ కంపెనీ అధినేత దీపక్‌కుమార్ తాల శనివారం చిత్తూరులో మీడియాకు వెల్లడించారు. కొట్టార్లపల్లె వద్ద 1.60 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ కంపెనీని 20 వేల కోర్లతో క్లౌడ్ సర్వీస్‌తో ఏర్పాటు చేయనున్నట్టు ఆయన చెప్పారు.
ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఈనెల 14న భూమి పూజ చేస్తున్నామని, జూన్‌లో పనులు ప్రారంభించి, ఏడాదిలోపు నిర్మాణాలు పూర్తి చేస్తామని వివరించారు. ఇప్పటికే తమ కంపెనీలో తయారవుతున్న సెమీ కండక్టర్లు ప్రపంచంలోనే పేరున్న అన్ని ఎలక్ట్రానిక్స్‌లో ఉపయోగిస్తున్నారన్నారు. యాపిల్, ఐ వాచెస్, తోషిబా, శామ్‌సంగ్ ఉత్పత్తుల్లోను, కొన్ని దేశాల రక్షణ రంగ సంస్థల్లోను తమ ప్రొడక్టస్ ఉపయోగిస్తున్నారని చెప్పారు. తమ సంస్థకు అమెరికాలో 2, చైనాలో 1, ఇండియాలో 2 చోట్ల బ్రాంచ్‌లు ఉన్నాయని, జపాన్, సింగపూర్, రష్యాతో పాటు యూరప్ మొత్తం మార్కెటింగ్ చేస్తున్నామని వివరించారు. ఆయన వెంట ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎంసీ విజయానందరెడ్డి ఉన్నారు.
(చదవండి: నవరత్నాలు.. సుస్థిర అభివృద్ధికి మార్గాలు)
Comments
Please login to add a commentAdd a comment