కాసుల గలగలలే.. | Government green signal for BPS | Sakshi
Sakshi News home page

కాసుల గలగలలే..

Published Sun, May 24 2015 5:19 AM | Last Updated on Sun, Sep 3 2017 2:34 AM

Government green signal for BPS

- బీపీఎస్‌కు ప్రభుత్వం పచ్చజెండా
- కార్పొరేషన్‌కు రూ.100కోట్లు ఆదాయం వచ్చే అవకాశం
- ఆశల పల్లకీలో పాలకులు
విజయవాడ సెంట్రల్ :
బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బీపీఎస్)కు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. విధివిధానాలను విడుదల చేసింది. దీనిపై టౌన్‌ప్లానింగ్ అధికారులు ఈనెల 27 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుదారులు తొలివిడతగా రూ.10వేలు, రెండు నెలల్లో మిగిలిన అపరాధ రుసుం చెల్లించాలి. బీపీఎస్ ద్వారా నగరపాలక సంస్థకు రూ.100 కోట్లపైనే ఆదాయం వస్తుందని అధికారుల అంచనా. భవన నిర్మాణాలను క్రమబద్దీకరిచేందుకు 2007లో నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మునిసిపాల్టీలు, నగరపాలక సంస్థల్లో బీపీఎస్ స్కీమ్ అమలు చేశారు. ఈ పథకం ద్వారా గృహ నిర్మాణ యజమానులు అక్రమాలను సరిదిద్దుకున్నారు. అప్పట్లో బీపీఎస్ కింద నగరపాలక సంస్థకు 15,826 దరఖాస్తులు అందాయి. 11,287 దరఖాస్తులకు సంబంధించిన గృహాలను క్రమబద్దీకరించారు. తద్వారా రూ.68.3 కోట్ల ఆదాయం ఖజానాకు జమ అయింది. కోర్టు కేసులు, డబ్బు సకాలంలో చెల్లించకపోవడం వంటి కారణాలతో 4,539 దరఖాస్తులను తిరస్కరించారు. బీపీఎస్ మళ్లీ తెరపైకి రావడంతో వీరికి చాన్స్ దక్కే అవకాశం ఉంది.  

దండిగా ఆదాయం
నగరంలో భవన నిర్మాణాలకు సంబంధించి టౌన్‌ప్లానింగ్ విభాగం ఏడాదికి 2,500 ప్లాన్లు మంజూరు చేస్తుంది. ఇందులో 200 గజాల లోపు రెండో అంతస్తుకు అనుమతికి నిరాకరిస్తున్నారు. మార్ట్‌గేజ్ చేసేందుకు ఇష్టపడని గృహ నిర్మాణదారులు ఆమ్యామ్యాలు సమర్పించుకుని అడ్డదారిలో రెండు, మూడు అంతస్తులు ని ర్మాణం చేపడుతున్నారు. టౌన్‌ప్లానింగ్ మం జూరుచేసే 75 శాతం ప్లాన్లలో నిబంధనల ఉల్లంఘన జరుగుతోందన్నది బహిరంగ రహస్యం. 1985 జనవరి ఒకటో తేదీ తరువాత నుంచి 2014 డిసెంబర్ 31 వరకు నిర్మాణమైన భవనా ల క్రమబద్దీకరణకు అవకాశమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈక్రమంలో నగరంలో 12వేల నుంచి 15వేల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని టౌన్‌ప్లానింగ్ అధికారులు లె క్కలేస్తున్నారు. తద్వారా రూ.70 కోట్ల నుంచి రూ.100 కోట్ల ఆదాయం  వ అవకాశం ఉంది.

స్పెషల్ డ్రైవ్
బీపీఎస్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడం ద్వారా స్థానిక సంస్థల్లో ఆర్థికలోటును పూడ్చుకోవాలనే యోచనలో సర్కార్ ఉంది. సాధ్యమైనన్ని ఎక్కువ దరఖాస్తులు వచ్చేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.  భవన నిర్మాణాల్లో అక్రమాలకు క్రమబద్దీకరించుకోకుంటే నీటి, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడంతో పాటు ఆస్తిపన్నును నూరుశాతం పెంచే అవకాశం ఉంది. ఈ విషయమై గృహ నిర్మాణదారుల్లో అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  బీపీఎస్ పథకం కింద గతంలో అందిన దరఖాస్తుల్ని పరిగణనలోకి తీసుకుంటామని అసిస్టెంట్ సిటీప్లానర్ (ఏసీపీ-2) మధుకుమార్ ‘సాక్షి’కి చెప్పారు. రెనిడెన్షియల్, నాన్‌రెసిడెన్షియల్, కమర్షియల్ కేటగిరిల్లో ఈ పథకాన్ని అమలు చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement