తాడేపల్లిగూడెం మునిసిపాలిటీ
తాడేపల్లిగూడెం : అనుమతులు లేకుండా చేపట్టిన భవనాలను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం రూపొందించిన బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్) గడువు ఈ నెలాఖరున ముగియనుంది. దీంతో ఈ పథకాన్ని మునిసిపాలిటీల్లోని ప్రజలు వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఈ పథకంలో చేసుకున్న దరఖాస్తుల్లో కొన్నింటిని తిరస్కరించగా మరికొన్ని పెండింగ్‌లో ఉంచారు. వాటిపై కూడా టౌన్ అండ్ కంట్రీప్లానింగ్ అ«ధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించడం, తిరస్కరించిన దరఖాస్తులను క్రమబద్ధీకరించేందుకు ఉన్న అవకాశాలను చూసేందుకు డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. మునిసిపాలిటీల్లోని పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు , లైసెన్స్‌డ్ సర్వేయర్లను వెంట పెట్టుకుని దరఖాస్తు చేసి క్రమబద్ధీకరించుకోని వారి ఇంటి తలుపులు తట్టనున్నారు. బీపీఎస్ గడువు నెలాఖరుతో ముగుస్తున్నందున డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేపట్టి అర్హులైన దరఖాస్తుదారుల నుంచి సొమ్ములు కట్టించుకోవాలనే ఆదేశాలు ఇప్పటికే మునిసిపాలిటీల్లోని పట్టణ ప్రణాళికా విభాగానికి వచ్చాయి.
జిల్లాలో వచ్చిన దరఖాస్తులు 4,635
బీపీఎస్ పథకం కింద జిల్లాలోని మునిసిపాలిటీల నుంచి 4,635 దరఖాస్తులు వచ్చాయి. భీమవరంలో 1,155 దరఖాస్తులు రాగా 16 తిరస్కరించారు. 81 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, 1058 దరఖాస్తులను అనుమతించారు. ఏలూరులో 695 దరఖాస్తులు రాగా 28 దరఖాస్తులను తిరస్కరించారు. 70 పెండింగ్‌లో ఉండగా, 597 దరఖాస్తులను అప్రూవల్ చేశారు. జంగారెడ్డిగూడెంలో 78 దరఖాస్తులు రాగా, ఏడింటిని తిరస్కరించగా, ఆరు పెండింగ్‌లో ఉంచి, 65 దరఖాస్తులను అప్రూవల్ చేశారు. కొవ్వూరులో 242 దరఖాస్తులు రాగా ఆరింటిని తిరస్కరించారు. 58 పెండింగ్‌లో ఉన్నాయి. 178 దరఖాస్తులను అప్రూవల్ చేశారు. నరసాపురంలో 142 దరఖాస్తులు రాగా, రెండింటిని పెండింగ్‌లో ఉంచి, 140 దరఖాస్తులను అప్రూవల్ చేశారు. నిడదవోలులో 122 దరఖాస్తులు రాగా, పదింటిని తిరస్కరించగా, 16 పెండింగ్‌లో ఉన్నాయి. మిగిలిన 96 దరఖాస్తులను ఆమోదించారు. పాలకొల్లులో 567 దరఖాస్తులు రాగా, ఒక దరఖాస్తును తిరస్కరించగా, 14 పెండింగ్‌లో ఉంచారు. 552 దరఖాస్తులను ఆమోదించారు. తణుకులో 1,087 దరఖాస్తులు రాగా 15 దరఖాస్తులను తిరస్కరించారు. 347 దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచి, 725 దరఖాస్తులను ఆమోదించారు. తాడేపల్లిగూడెంలో 547 దరఖాస్తులు రాగా122 దరఖాస్తులను తిరస్కరించారు. 13 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 412 దరఖాస్తులను ఆమోదించారు. తిరస్కరించిన దరఖాస్తుల్లో అర్హత కలిగిన వాటిని అధికారులు గుర్తిస్తారు. అర్హత ఉంటే వాటిని క్రమబద్ధీకరించుకోవడానికి తగిన రుసుములు కట్టించుకోవాలి. ఈ అవకాశాన్ని సద్వినియో చేసుకోవాలని జిల్లా ప్రణాళిక శాఖ ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు.
స్పెషల్ డ్రైవ్ చేపట్టాం
బీపీఎస్ కింద దరఖాస్తు చేసుకున్న వారు వారి దరఖాస్తులను నెలాఖరులోగా క్రమబద్ధీకరించుకోవాలి. దీనికోసం పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు. లైసెన్స్‌డ్ సర్వేయర్లతో డోర్ టు డోర్ కార్యక్రమం చేపట్టాం. అర్హత కలిగిన దరఖాస్తులు ఉంటే క్రమబద్ధీకరిస్తారు. ఈ అవకాశాన్ని దరఖ> స్తుదారులు సద్వినియో చేసుకోవాలి.– బీఎన్‌ఎస్.సాయిబాబా, ఆర్‌డీ, టౌన్ అండ్ కంట్రీప్లానింగ్ డిపార్టుమెంట్
Comments
Please login to add a commentAdd a comment