
కట్టలు తెగిన దోపిడీ
గ్రీవెన్స్‌సెల్‌కు 185 వినతులు
విజయనగరం కంటోన్మెంట్: ఏళ్లతరబడి నీరిస్తూ శిథిలావస్థకు చేరిన బలిజిపేట మండలం పెదంకలాం ఆనకట్ట మరమ్మతుల పేరిట విడుదలైన రూ.74 లక్షల హుద్‌హుద్ తుపాను నిధులను తెలుగు తమ్ముళ్లు దోచుకుతిన్నారని ఆరోపిస్తూ ఆనకట్ట ఆయకట్టు రైతుల పోరాట కమిటీ సభ్యులు గ్రీవెన్స్‌సెల్‌ను ఆశ్రయించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు 178 వినతులు వచ్చాయి. జాయింట్ కలెక్టర్ శ్రీకేశ్ బి లఠ్కర్, డీఆర్వో మారిశెట్టి జితేంద్రలు వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా పెందకలాం ఆయకట్టు రైతులు మాట్లాడుతూ హుద్‌హుద్ తుపాను బీభత్సానికి షట్టర్లు మరమ్మతులకు గురైతే కాలువల్లో పొడిపొడి పనులు చేసి నిధులు దోచేశారని ఆరోపించారు. ఈ విషయం ఎమ్మెల్యేకు తెలిసినా పట్టించుకోలేదని తిరిగి జపాన్ నిధులకోసం ప్రయత్నాలు చేస్తున్నారని ప్రాజెక్టు పనుల్లో అవినీతిని గుర్తించి ప్రాజెక్టును కాపాడాలని ఐక్యపోరాట వేదిక సభ్యులు గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో మామిడి సింహాద్రి నాయుడు, నందిగాం గౌరీశ్వరరావు, పొదిలాపు నర్సింగరావు, మండల రామారావు తదితరులు పాల్గొన్నారు.
ఇళ్లనిర్మాణానికి ‘చెర’వులు
మెరకముడిదాం మండలం పెద మంత్రిపేట గ్రామంలోని మంత్రిపూని చెరువును ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకుంటున్నారని గ్రామానికి చెందిన ఆయకట్టు దారులు మంత్రి అప్పలనాయుడు, మంత్రి అప్పారావు, గొళ్లెం రామారావు, ఎం దాలినాయుడు తదితరులు గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేశారు. 5ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ చెరువును ఆక్రమించుకుంటుండడం వల్ల సుమారు 30 ఎకరాల ఆయకట్టుకు నీరందడం లేదని ఫిర్యాదులో వాపోయారు.
పేదల స్థలాల్లో పంచాయతీ భవనం
గంట్యాడ మండలంలోని తాటిపూడి ఎస్సీ కాలనీలో నిర్మించుకున్న ఎస్సీల గృహ నిర్మాణ ప్రాంతాల్లో పంచాయతీ భవనం నిర్మించాలని కక్షగటికట తనకు నోటీసులు ఇస్తున్నారని గ్రామానికి చెందిన కొయ్య సన్యాసి రావు ఫిర్యాదు చేశారు. పేదల స్థలంలో సర్పంచ్‌కూ ఇంటి జాగా ఉందని, అయితే ఇంకెవరి కాకుండా వ్యక్తిగతంగా నోటీసులు పంపిస్తున్నారని చర్యలు తీసుకోవాలని కోరారు.
కాల్ లెటర్ ఇచ్చి పోస్టింగ్ ఇవ్వలేదు
వికలాంగ కోటాలో తనకు సబార్డినేటు పోస్టు వచ్చిందని కాల్ లెటర్ అందించి ఇప్పటికీ పోస్టింగ్ ఇవ్వలేదని విజయనగరం కొత్తపేటకు చెందిన కొంచాడ మురళీ కృష్ణ ఫిర్యాదు చేశాడు. జూలై 2014లో నోటిఫికేషన్ ఇచ్చి వైద్యపరీక్షలకు హైదరాబాద్ కూడా తీసుకెళ్లారని, ఇప్పటికీ పోస్టింగ్ ఇవ్వలేదని, పేదవాడినైన తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు.
ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి
డెంకాడ మండలం శింగవరం, నాతవలస గ్రామాల పరిధిలోని చంపావతి నదిలో ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయని, జాతీయ రహదారిపై వంతెనకు కూడా ముప్పు ఏర్పడుతోందని గ్రామానికి చెందిన జీవీ రమణా రావు తదితరులు ఫిర్యాదు చేశారు. ఇసుక తవ్వకాలను నియంత్రించేందుకు రక్షణ గోడలను నిర్మించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
ప్రభుత్వ భూమి కొని వెనుక డీఆర్వో ఉన్నారని చెబుతున్నారు
సాలూరు పట్టణంలోని సర్వే162/2 నంబరులోని విలువైన ప్రభుత్వ భూమిని సాలూరు జమిందారు విక్రమ చంద్ర సన్యాశిరాజు, పీబీ శ్రీనివాస్ అనే ఇద్దరు రాయపాటి ప్రభాకరరావు అనే వ్యక్తికి రూ.కోటీ 5 లక్షలకు అమ్మేశారు. దీనిపై స్థానిక దుకాణ దారులు ప్రశ్నిస్తే తన వెనుక మంత్రులు, డీఆర్వో ఉన్నారని ప్రభాకరరావు చెబుతున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడి ఇక్కడ చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారికి రక్షణగా నిలవాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి గొంప ప్రకాశరావు ఎం అప్పలనాయుడు తదితరులు గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదు చేశారు.