మాచర్లలో దారుణ హత్య
Published Wed, Aug 14 2013 4:18 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
మాచర్లటౌన్, న్యూస్‌లైన్ : ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న వ్యక్తిని ప్రత్యర్థులు గొడ్డలితో నరికి చంపిన సంఘటన మాచర్ల పట్టణంలోని సుద్దగుంతలలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సుద్దగుంతలలో నివాసం ఉంటున్న గెల్లిపోగు ముత్తయ్య(48) ఇంట్లో నిద్రిస్తుండగా అర్ధరాత్రి ప్రత్యర్థులు ఇంట్లోకి ప్రవేశించి గొడ్డలితో నరికి పారిపోయారు. పక్కింటివారు గమనించి విషయాన్ని ఆయన సోదరి ఇస్తేరమ్మకు తెలియపరిచారు. బంధువులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారు. మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు.
మంగళవారం ఉదయం అర్బన్ సీఐ సీహెచ్ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ జయకుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సంఘటన స్థలంలో రక్తంతో తడిసిన దిండును గుర్తించారు. దాడికి ఉపయోగించిన గొడ్డలిని కర్ర లేకుండా దుండగులు అక్కడే పడేసినట్టు పోలీసులు గుర్తించారు. గుంటూరునుంచి క్లూస్ టీం, డాగ్స్‌స్వ్కాడ్‌ను రప్పించారు. పోలీస్ జాగిలం సమీపంలోని ముత్తయ్య బంధువుల ఇంటికి వెళ్లి ఆగింది. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ముత్తయ్య భార్య ఏసమ్మ 15 ఏళ్ల కిందటే ఇద్దరు కుమార్తెలతో వేరే గ్రామంలో నివాసం ఉంటోంది. పెయింట్ పనులు చేసే ముత్తయ్య సుద్దగుంతలలో నివాసం ఉండేవారు.
లొంగిపోయిన నిందితులు : ముత్తయ్య హత్య కేసులో ముగ్గురు నిందితులు పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది. ముత్తయ్య సోదరి ఇస్తేరమ్మను ఆమె భర్త దాసరి ప్రసంగికరావు మద్యం తాగి వేధించేవాడు. దీంతో 10 సంవత్సరాల కిందట ప్రసంగికరావును ముత్తయ్య గొడ్డలితో నరికి చంపాడు. ఆ ఘటనలో రాజీ కుదరడంతో కేసును కొట్టేశారు. అప్పటి నుంచి ఎస్తేరమ్మ తన ఇద్దరు పిల్లలతో మాచర్లలోనే జీవనం సాగిస్తోంది. ప్రసంగికరావు కుమార్తె ఇటీవల తన భర్తకు ఈ విషయాన్ని చె ప్పింది. దీంతో ప్రసంగికరావు అల్లుడు, కుమారుడి వరుసయ్యే ఓ వ్యక్తి కలిసి మరొకరి సహకారంతో మత్తయ్యను హత్యచేసినట్లు తెలిసింది. ఇద్దరు వ్యక్తులు మత్తయ్యను పట్టుకోగా మూడోవ్యక్తి గొడ్డలితో నరికినట్టు సమాచారం.
Advertisement
Advertisement