ఎన్టీఆర్: జిల్లాలో సంచలనం రేపిన డాక్టర్ మాచర్ల రాధ (59) హత్య కేసులో మిస్టరీ వీడింది. కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడని పోలీసులు తేల్చి చెప్పారు. రాధను హతమార్చటంలో నిందితుడు కారు డ్రైవర్ సహాయం పొందినట్లు నిర్ధారించారు. కుటుంబ కలహాలు, ఆర్ధిక వివాదాలే హత్యకు గల కారణాలుగా నిర్ధరించారు. జిల్లా ఎస్పీ పి.జాషువా శుక్రవారం తన ఛాంబర్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
మూడు నెలల ముందే పథక రచన..
డాక్టర్ లోక్‌నాథ్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ రాధ భార్యభర్తలు. మచిలీపట్నం జవ్వారుపేటలో శ్రీ వెంకటేశ్వర తల్లిపిల్లల ఆసుపత్రి నడుపుతున్నారు. రాధ కొంత కాలంగా ప్రాక్టీస్ ఆపేసింది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీరిరువురూ వివాహితులే. కుమారుడికి ఇటీవలే వివాహం కావటంతో గత నెలలో అత్తారింటికి వెళ్లాడు. ఇదిలా ఉండగా లోక్‌నాధ్, రాధల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు నడుస్తున్నాయి. వ్యక్తిగత కలహాలతో పాటు ఆర్ధికపరమైన విషయాల్లోనూ మనస్పర్ధలు ఉన్నాయి. విబేధాలు తారస్థాయికి చేరుకోవటంతో ఉమామహేశ్వరరావు భార్యను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.
అందుకు పథకం రచించి సమయం కోసం వేచి చూస్తున్నాడు. తన వద్ద సుమారు 15 ఏళ్లుగా నమ్మకంగా పని చేస్తున్న కారు డ్రైవర్ స్ఫూర్తి జానార్ధన్ అలియాస్ మధును ఈ పనిలో సహాయం కోరాడు. సహకరిస్తే 30 లక్షల నగదుతో పాటు రాధ సంబంధించిన బంగారం మొత్తం ఇచ్చి జీవితంలో స్థిరపడేందుకు సహాయం చేస్తానని భరోసా ఇచ్చాడు. ఇందుకు మధు ఒప్పుకున్నాడు. ముందుగానే వేసుకున్న పథకాన్ని అమలు చేసేందుకు మూడు నెలల ముందుగానే సీసీ కెమెరాలను ఉపయోగంలో లేకుండా చేశారు.
ఆభరణాలు తీసి.. సీలింగ్‌లో దాచి..
అదును కోసం చూస్తున్న ఉమామహేశ్వరరావు కొడుకు అత్తగారింటికి వెళ్లటంతో డ్రైవర్‌తో చర్చలు జరిపాడు. ఆక్సిజన్ సిలిండర్‌లు బిగించేందుకు ఉపయోగించే రెంచీని ఆయుధంగా ఎంచుకున్నారు. గత నెల 25వ తేదీ మధ్యాహ్నం డాక్టర్ లోక్‌నాథ్ రెంచీని మధుకు అందజేశాడు. సాయంత్రం రెండో అంతస్తులో అనుమానం కలుగకుండా నక్కి ఉండమని చెప్పాడు. అతడు డాక్టర్ చెప్పిన విధంగా చేశాడు. అదును చూసుకుని ఉమామహేశ్వరావు, మధు ఇద్దరూ రాధపై ఒక్కసారిగా దాడి చేశారు. మధు ఆమెను బలంగా పట్టుకోగా భర్త ఆమె తలపై రెంచీతో బలమైన దెబ్బలు కొట్టాడు.
తీవ్ర రక్తస్రావం అయిన రాధ స్పృహ కోల్పోయింది. మృతి చెందిందీ లేనిదీ నిర్ధారించుకునేందుకు మరలా రెంచీతో బలంగా ఆమె తలపై కొట్టారు. మృతి చెందినట్లు నిర్ధారించుకున్న అనంతరం ఉమామహేశ్వరరావు ఇంటి వెనుక వైపు నుంచి కింది ఫ్లోర్‌లోని క్లినిక్‌లో వెళ్లిపోయాడు. మధు ఆమె ఒంటిపై ఆభరణాలు ఒలిచి సీలింగ్‌లో దాచాడు. పోలీసులకు ఆధారాలు చిక్కకుండా ఉండేందుకు డాక్టర్ సలహా మేరకు కారం తెచ్చి మృతురాలి ఒంటిపై చల్లాడు. గదిలో అక్కడక్కడా కారం చల్లటంతో పాటు రెంచీని ఇంటి వెనుకభాగంలో దాచి పెట్టాడు. అదే రోజు రాత్రి 10.30 సమయంలో డాక్టర్ ఉమామహేశ్వరావు ఏం ఎరుగనట్టు పోలీసులకు ఫోన్ చేసి తన భార్యను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారంటూ సమాచారం ఇచ్చాడు.
ఆభరణాలు స్వాధీనం..
రాధ హత్య సమాచారం అందుకున్న బందరు డీఎస్పీ మాధవరెడ్డి, సంబంధిత ఏరియా సీఐ ఉమామహేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భర్త నుంచి వివరాలు తీసుకున్నారు. అతని ఫిర్యాదుపై ఇనగుదురుపేట పోలీస్‌స్టేషన్‌లో హత్య కింద కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి పోలీసులకు ఎటువంటి ఆధారాలు చిక్కకపోవటంతో ఎస్పీ ఆదేశాల మేరకు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి రాధను హత్య చేసింది ఆమె భర్తేనని నిర్ధారించారు. అతడికి డ్రైవర్ సహకరించినట్లు నిర్ణయానికి వచ్చారు. ఇరువురిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసింది తామేనని అంగీకరించారు.
హత్యకు ఉపయోగించిన రెంచీతో పాటు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈ కేసును చేధించటంలో ప్రతిభ కనబరచిన బందరు డీఎస్పీ మాధవరెడ్డిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. దర్యాప్తును సమర్ధవంతంగా నిర్వర్తించి హంతకులను అదుపులోకి తీసుకున్న సిబ్బందికి రివార్డులు ప్రకటించేందుకు రాష్ట్ర డీజీపీకి సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏఎస్పీ హరిబాబు, డీఎస్పీ మాధవరెడ్డి, సీఐలు ఉమామహేశ్వరరావు, రవికుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment