ఆత్మకూరులో అసలేం జరిగింది? | Ground Report From Atmakur in Palnadu | Sakshi
Sakshi News home page

ఆత్మకూరులో అసలేం జరిగింది?

Published Fri, Sep 13 2019 10:02 AM | Last Updated on Fri, Sep 13 2019 12:04 PM

Ground Report From Atmakur in Palnadu - Sakshi

(పల్నాడు ప్రాంతం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)/సాక్షి, గుంటూరు/మాచర్ల: మూడేళ్ల క్రితం అంగన్‌వాడీ ఉద్యోగం తెచ్చిన తంటా ఆ పచ్చని పల్లె పేరును ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగేలా చేసింది. ఆ గ్రామంలో ఒకే పార్టీకి చెందిన రెండు కుటుంబాలు వైరి వర్గాలుగా విడిపోయి ఊరొదిలి వెళుతుంటే దానికి టీడీపీ రాజకీయరంగు పులిమింది. పల్నాడు ప్రాంతంలో గెలిచిన రాజకీయ పార్టీకి చెందిన వారిది పైచేయి అవుతుందని ఓడిన పార్టీ వారు కొంతకాలం ఊరొదిలి వెళ్లడం రివాజు. అయితే ఇప్పుడు కుటుంబ తగాదాలను పార్టీ తగాదాలుగా చిత్రీకరిస్తూ, ఊరొదిలి వెళ్లిన వారు వైఎస్సార్‌ సీపీ బాధితులంటూ ప్రతిపక్ష టీడీపీ యాగీ చేస్తుండటం ఆ ప్రాంత ప్రజల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మాచర్ల నియోజకవర్గంలోని దుర్గి మండలం ఆత్మకూరు గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు కుటుంబాలు కొన్నేళ్లుగా ప్రత్యర్థి వర్గాలుగా ఉంటున్నాయి. ఆ వర్గాలకు గ్రామ మాజీ సర్పంచ్‌ పి.యోసేబు, మండి చార్లెస్‌ నేతృత్వం వహిస్తున్నారు. యోసేబు స్వయానా చార్లెస్‌కు పిల్లనిచ్చిన మామ కావడం గమనార్హం. వీరివురూ తొలినాళ్లలో టీడీపీలోనే ఉన్నారు. ఒకే కాలనీలో నివాసం ఉండేవారు. మూడేళ్ల క్రితం గ్రామంలో అంగన్‌వాడీ పోస్టు తన భార్యకు ఇవ్వాలని చార్లెస్‌ తన మామపై ఒత్తిడి తెచ్చాడు. అప్పటి టీడీపీ నేతల రాజకీయ కారణాలతో యోసేబు నిరాకరించాడు. దీంతో టీడీపీలోనే రెండు వర్గాలుగా వీరు చీలడంతో ఆధిపత్యం కోసం గొడవలు ఆరంభమయ్యాయి. కొంతకాలానికి తారస్థాయికి చేరాయి. రెండేళ్ల క్రితం సర్పంచ్‌ యోసేబు కాలనీలో భయోత్పాతం సృష్టించి చార్లెస్‌ వర్గాన్ని టార్గెట్‌ చేశాడు. టీడీపీ నేతల ప్రోద్బలంతో చార్లెస్‌ను ఊరొదిలి వెళ్లేలా చేశాడు. చార్లెస్‌ కనీసం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వీలులేని పరిస్థితులను టీడీపీ నేతలు కల్పించారు.


ఆత్మకూరులో మొహరించిన పోలీసులు

గ్రామంలో పెద్దలు చార్లెస్‌కు మద్దతుగా వచ్చినా.. పోలీస్‌ అధికారులతో వారిని దుర్భాషలాడించారు. చేసేదేమీ లేని పరిస్థితుల్లో చార్లెస్, అతని అనుచరులకు గ్రామ శివారులో స్థానిక పెద్దలు ఆశ్రయం కల్పించారు. ఎన్నికల రోజు కూడా గ్రామంలో యోసేబు వర్గం చార్లెస్‌ వర్గంపై దాడులకు యత్నించింది. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత గ్రామం ప్రశాంతంగా ఉన్నా.. ప్రతి దాడులేమీ లేకపోయినా.. యోసేబు వర్గం మొత్తం ఊరొదిలి వెళ్లింది. ఆ తర్వాతే గ్రామ శివారులో తలదాచుకున్న చార్లెస్‌ తన అనుచరులతో కలిసి కాలనీకి వచ్చినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. ప్రశాంతంగా ఉండే ఆత్మకూరు గ్రామంలో అంగన్‌వాడీ పోస్టు మామా, అల్లుళ్ల మధ్య చిచ్చు రేపిందని చెబుతున్నారు. ఆ తర్వాత పోలీసుల సమక్షంలో రాజీలు జరిగి రెండు వర్గాలు కలిసి సహపంక్తి భోజనాలు చేశారన్నారు.  

దాడులు జరగలేదు
ఆత్మకూరు గ్రామానికి తిరిగి వచ్చిన యోసేబు వర్గంలోని కొందరు అసలు ఏం జరిగిందో ‘సాక్షి’కి వివరించారు. ప్రభుత్వం మారగానే చార్లెస్‌ వర్గం దాడులు చేస్తారనే భయంతోనే ఊరు వదిలి వెళ్లామని యోసేబు వర్గానికి చెందిన కిన్నెర రాబర్ట్‌ స్పష్టం చేశాడు. కిన్నెర రాబర్ట్‌ స్వయానా చార్లెస్‌కు మేనమామ కూడా. ఇలా ఊరొదిలి వెళ్లడం ఈ ప్రాంతంలో ఆనవాయితీగా వస్తోందని రాబర్ట్‌ చెప్పాడు. తమపై దాడులు జరగలేదని స్వయంగా యోసేబు కూడా మీడియా ప్రతినిధులకు వివరించారు. తన బంధువును చార్లెస్‌ భయపెట్టాడని, ఆ తర్వాత తమపై దాడులు జరుగుతాయని భావించి ఊరొదిలి వెళ్లినట్లు పేర్కొన్నారు.

ఎన్టీఆర్‌ను చూసి.. కాపీ బాబు కుట్ర
1989లో టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ హయాంలో గ్రామంలో పూరి పాకలను తగులబెట్టిన ఘటనలు జరిగాయి. అప్పట్లో గ్రామానికి ఎన్టీఆర్‌ పరామర్శకు వచ్చారు. ఇప్పుడు గ్రామం ప్రశాంతంగా ఉన్నా.. దాడులు ఏవీ జరగకున్నా.. ప్రతిపక్ష నేత చంద్రబాబు పార్టీ ఉనికి కోసం, తమ పార్టీ నేతలు యరపతినేని, కోడెల అక్రమాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కుట్రలు రచించారని ఈ ప్రాంతానికి చెందిన పలువురు పేర్కొంటున్నారు. కుట్రలకు పల్నాడు ప్రాంతాన్ని చంద్రబాబు ఎంచుకోవడంపై మండిపడుతున్నారు.  

పోలీసుల హామీ మేరకు వచ్చాం
మా బంధువుల్లోనే వివాదం వల్ల ఆందోళన చెంది బయటకు వెళ్లాం. పోలీసుల హామీ వల్ల తిరిగి గ్రామానికి వచ్చాం. మా మధ్య ఎటువంటి రాజకీయ గొడవలూ లేవు. పోలీసుల చొరవతో మా మధ్య విభేదాలు తొలగిపోయాయి. మేమంతా కలిసికట్టుగానే ఉంటాం.  
– పేరువాల యోసేబు, టీడీపీ నేత, ఆత్మకూరు

మా మధ్య కుటుంబ గొడవలు ఉన్నాయి
మా సామాజికవర్గానికి చెందిన వారిలోనే విభేదాలు ఉండి గతంలో గొడవ పడ్డాం. మేమంతా ఒకే కుటుంబానికి చెందినవారం. గత ఐదేళ్లలో అధికారం అండతో మా ప్రత్యర్థి వర్గం మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. ఇటీవల టీడీపీ ఓటమిపాలు కావడంతో మేం వారిపై దాడి చేస్తామోననే భయంతో వారు ఊరు విడిచి వెళ్లారు. మా గొడవలకు రాజకీయాలతో సంబంధం లేదు.
– మందా చార్లెస్, ఆత్మకూరు

గ్రామంలో రాజకీయ గొడవలు లేవు..
మా గ్రామంలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ శ్రేణుల మధ్య రాజకీయ గొడవలు లేవు. మేము అందరం కలిసి ఉంటున్నాం. టీడీపీలో ఉన్న ఎస్సీల బంధువర్గంలో విభేదాల వలన చిన్న వివాదాలను పెద్దవిగా చేసి రాజకీయరంగు పులిమారు. మా గ్రామంపై విష ప్రచారం చేయటం దారుణం.   
– రాయపరెడ్డి, గ్రామపెద్ద, ఆత్మకూరు

దాడులు నిరూపిస్తే రాజీనామా చేస్తా
ఆత్మకూరు గ్రామంలో ఎస్సీలపై మా పార్టీ నాయకులు దాడి చేశారని, వారి నుంచి ఎస్సీలకు ప్రాణహాని ఉందని, గ్రామంలో వారికి రక్షణ లేదని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. చౌకబారు విమర్శలు చేసి చంద్రబాబు తన ప్రతిష్టను ఇంకా దిగజార్చుకుంటున్నారు. మా పార్టీ వర్గీయులు దాడి చేయడం వల్ల గ్రామంలో ఎస్సీ కుటుంబాలు ఇళ్లను వదిలి వెళ్లిపోయాయని ప్రచారం చేస్తున్న చంద్రబాబుకు సవాల్‌ విసురుతున్నాను. వైఎస్సార్‌సీపీ వర్గీయులు దాడి చేయడం వల్లే వాళ్లు గ్రామం విడిచి వెళ్లినట్లయితే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. వాస్తవం కానట్లయితే పల్నాడు ప్రాంత ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి.  
– పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement