
గ్రూప్-2: మాస్ కాపీయింగ్‌పై విచారణ జరపాల్సిందే
మాస్ కాపీయింగ్ అంశాన్ని వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చాం: అభ్యర్థులు
నంద్యాల: జులై 15,16 తేదీల్లో జరిగిన గ్రూప్-2 పరీక్షల్లో పెద్ద ఎత్తున మాస్ కాపీయింగ్ జరిగిందని అభ్యర్థులు వాపోయారు. ఈ పరీక్ష జరిగిన తీరును ఆదివారం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళామని తెలిపారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మీడియాతో మాట్లాడుతూ ఏపీపీఎస్సీ చరిత్రలోనే ఎరుగనిరీతిలో గ్రూప్-2 మెయిన్స్‌లో మాస్‌కాపీయింగ్ జరిగిందని తెలిపారు. పదోతరగతి పరీక్ష పత్రాలు లీకైనప్పుడు ఏపీ ప్రభుత్వం విచారణ జరపలేదని, ఎవరో ఒకరిపై కేసు నమోదు చేసి చేతులు దులుపుకుందని విమర్శించారు. గ్రూప్-2 పరీక్ష నిర్వహించిన 173 సెంటర్లలపై విచారణ జరపాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు.
తాము చెప్పే పరీక్షా కేంద్రాల్లో విచారణ చేపడితే ప్రభుత్వం, ఏపీపీఎస్సీ బండారం బయటపడుతుందన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల విద్యార్థులతో అమరావతిలో బంద్ ప్రకటిస్తామని, పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. తాము ఏ రాజకీయ పార్టీకి అనుకూలం, వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. కేవలం తమకు జరిగిన అన్యాయాన్ని వైఎస్ జగన్ ముందు తెలిపేందుకే నంద్యాలకు వచ్చినట్లు తెలిపారు.
గ్రూప్-2 నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి అన్నీ వివాదాలేనని అభ్యర్థులు వాపోయారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నుంచి ఉద్యోగాల కోసం ఎంతోమంది ఎదురుచూశారని, కానీ మూడేళ్ల తర్వాత కొత్త కొత్త నిబంధనలతో ప్రిలిమ్స్, మెయిన్స్ అంటూ అభ్యర్థులను అమోమయానికి గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి చదువుకుంటున్న వారిలో అభద్రతాభావాన్ని కలిగించారన్నారు. సరైన ప్రణాళిక లేకపోవడంతో, అధికారుల నిర్లక్ష్యం వల్లే పరీక్ష నిర్వహణలో లోపాలు, సాంకేతిక సమస్యలు బట్టబయలయ్యాయని విమర్శించారు. నిరుద్యోగుల జీవితాలను నిర్ణయించే పోటీ పరీక్షల నిర్వహణను ప్రవేటు వ్యక్తులకు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు.