సాక్షి, అమరావతి బ్యూరో:వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో సంవిధాన పథకం (కాంపోజిషన్ స్కీమ్)లో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడుతోంది. చిన్న వ్యాపారులకు అనుకూలంగా ఉన్న ఈ పథకంలో చేరేందుకు గరిష్ట పరిమితిని పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఏడాదికి రూ.కోటి టర్నోవర్‌గా ఉన్న గరిష్ట పరిమితిని రూ.2 కోట్లకు పెంచనుంది. జీఎస్టీ కౌన్సిల్ సూచనల మేరకు ఈ దిశగా సన్నాహాలు చేస్తోంది. పార్లమెంటు ఆమోదం తర్వాత గరిష్ట పరిమితి పెంపును రెండు దశల్లో అమలు చేయాలని జీఎస్టీ కౌన్సిల్ సూత్రప్రాయంగా నిర్ణయించింది.
చిన్న వ్యాపారుల కోసం..
జీఎస్టీ విధానంలో చిన్న వ్యాపారులకు ఊరట కలిగించేందుకు సంవిధాన పథకాన్ని ప్రవేశపెట్టారు. చిన్న, మధ్యస్థాయి వ్యాపారుల మీద పన్ను భారాన్ని తగ్గించడం, ఎక్కువసార్లు రిటర్న్‌లు దాఖలు చేయాల్సిన అవసరం లేకుండా చూడటం దీని ఉద్దేశం. అయితే ఇందులో చేరే వ్యాపారులు వినియోగదారుల నుంచి పన్ను వసూలు చేయకూడదు. పథకంలో చేరాలంటే వార్షిక టర్నోవర్ గరిష్టంగా రూ.కోటి లోపు ఉండాలి. చేరాలా, వద్దా అనేది వ్యాపారుల ఇష్టానికే వదిలేశారు. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీలో మొదట చిన్న వ్యాపారులు ఈ పథకం పట్ల ఆసక్తి చూపించలేదు. అయితే అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పరిస్థితి మారింది. తాజాగా ఏపీలో కేంద్ర ఎక్సైజ్, రాష్ట్ర వాణిజ్య శాఖల మధ్య జీఎస్టీ చెల్లింపుదారుల విభజన చేశారు. దీని ప్రకారం అక్కడత దాదాపు 1.60 లక్షల మంది సంవిధాన పథకంలో చేరారు.
గరిష్ట పరిమితి పెంపునకు నిర్ణయం
సంవిధాన పథకం పట్ల వ్యక్తమవుతున్న సానుకూలతను జీఎస్టీ జాతీయ కౌన్సిల్ గుర్తించింది. గరిష్ట పరిమితిని పెంచితే మరింతమంది చిన్న వ్యాపారులు ఈ పథకంలో చేరతారని భావించింది. కాగా పార్లమెంటులో చేసిన జీఎస్టీ చట్టం అందుకు అవకాశం కల్పించడం లేదు. వార్షిక టర్నోవర్ గరిష్టంగా రూ.కోటిలోపు ఉన్న వ్యాపారులే సంవిధాన పథకంలో చేరేందుకు అర్హులని చట్టంలో స్పష్టం చేశారు. పరిమితి పెంచాలి అంటే మళ్లీ పార్లమెంటే సవరణ చేయాలి. ఈ నెల 10న జీఎస్టీ జాతీయ కౌన్సిల్ ఈ అంశంపై చర్చించింది. ప్రస్తుతం వార్షిక టర్నోవర్ రూ.కోటిగా ఉన్నదాన్ని రూ.2 కోట్లకు పెంచాలని నిర్ణయించింది. దీనికి చట్ట సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ జీఎస్టీ కౌన్సిల్ తీర్మానాన్ని ఆమోదించింది.
రెండు దశల్లో అమలు
సంవిధాన పథకం గరిష్ట పరిమితిని పార్లమెంటు రూ.కోటి నుంచి రూ.2 కోట్లకు పెంచిన తర్వాత దాన్ని రెండు దశల్లో అమలు చేయాలని జీఎస్టీ కౌన్సిల్ భావిస్తోంది. మొదటి దశలో గరిష్ట పరిమితిని రూ.1.50 కోటికి పెంచాలని నిర్ణయించింది. ఏడాది తర్వాత పరిస్థితిని సమీక్షించి వ్యాపారుల నుంచి ఆశించిన స్థాయిలో సానుకూల స్పందన కొనసాగితే పరిమితిని రెండో దశలో రూ.2 కోట్లకు పెంచాలని యోచిస్తోంది. ఈ మేరకు కేంద్ర జీఎస్టీ, రాష్ట్రాల వాణిజ్య పన్నుల శాఖలకు సమాచారం కూడా ఇచ్చింది. సాఫ్ట్‌వేర్‌లో మార్పులు, ఇతర ఏర్పాట్లు ముందస్తుగా చేసుకోవాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment