పశ్చిమగోదావరి ,ఇరగవరం: ఆంధ్ర ఆపిల్‌గా పేరుగాంచిన జామ కాయలకు పెట్టింది పేరు ఇరగవరం మండలం రేలంగి గ్రామం. ఇక్కడ పండించే జామ కాయలకు జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాలలోనూ విపరీతమైన గిరాకీ ఉంది. పూర్వం నుంచి ఈ గ్రామంలో 200 కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా జామ పంట ఉపాధి కల్పిస్తోంది. గ్రామంలోనే జామ తోటలు పెంచి వాటి నుంచి పండిన కాయలను రేలంగి చుట్టు పక్కల గ్రామాల్లో విక్రయించడమే కాకుండా ఏలూరులోని జ్యూస్ ఫ్యాక్టరీకి సరఫరా చేస్తారు. దూర ప్రాంతాలకూ ఎగుమతి చేసే వ్యాపారులున్నారు. దీంతో సీజన్‌లో గ్రామం నుంచి బెంగళూరు, తిరుపతి, విశాఖపట్టణం తదితర ప్రాంతాలకు లారీల్లో జామ కాయలను తరలిస్తుంటారు. దూర ప్రాంతాల నుంచే కాకుండా జిల్లాలోని భీమవరం, ఆకివీడు, నిడదవోలు, అమలాపురం తదితర ప్రాంతాలకు రైళ్లలో రవాణా చేస్తుంటారు. పూర్వం రేలంగిలో జామ కాయల ఎగుమతి కోసం ప్రత్యేకంగా రైళ్లుల్లో కూడా రవాణా చేసేవారని ప్రచారం ఉంది.
150 ఎకరాల్లో సాగు
ప్రస్తుతం రేలంగి గ్రామంలో 150 ఎకరాల వరకూ జామ తోటలు విస్తరించి ఉన్నాయి. ఎకరానికి కౌలుగా రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకూ చెల్లిస్తున్నారు. పెంచిన జామ తోటలకు ఐతే సంవత్సరానికి రూ. 60 వేలను కౌలుగా చెల్లిస్తున్నట్టు రైతులు పేర్కొంటున్నారు. ఒక ఎకరానికి సంవత్సరంలో పది నుంచి 14 టన్నుల వరకూ దిగుబడి వస్తోందని, టన్నుకు సుమారు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకూ ధర పలుకుతోందని చెప్పారు. ఇటీవల అలహాబాద్ సఫేదా, థాయ్‌లాండ్, కేజీ 48 రకాలను కూడా గ్రామంలో పండిస్తున్నారు. ఈ వంగడాలను కడియద్ద, అశ్వారావుపేట, తదితర చోట్ల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. 8 సంవత్సరాల తర్వాత పూర్తిగా ఈ చెట్లను తొలగించి మళ్లీ కొత్త మొక్కలు నాటుతారు. ఇక్కడ కాయలను రేలంగి గ్రామం మీదుగా ప్రయాణించేవారు తప్పక రుచి చూడటం రివాజు.
లాభసాటి పంట
పూర్వం నుంచి జామ పంటపైనే ఆధారపడి జీవిస్తున్నాం. నాలుగు ఎకరాల పొలంలో జామ తోట పంటతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. సంవత్సరానికి ఎకరానికి దాదాపు రూ.లక్ష వరకూ ఆదాయం వస్తోంది. –శిరిగినీడి వెంకటేశ్వరరావు, జామ రైతు, రేలంగి
వారసత్వంగా సాగుతున్నాం
మా తాత, తండ్రుల కాలం నుంచి జామ పంట పండిస్తున్నాం. పూర్వంతో పోలిస్తే ప్రస్తుతం జామ పంటకు లభిస్తోన్న రేటు చాలా బాగుంది. వరితో పోలిస్తే జామ పంట లాభదాయకంగానే ఉంది. సంవత్సరానికి ఎకరానికి రూ.25 వేలు ఖర్చు చేస్తే రూ.లక్ష వరకూ ఆదాయం వస్తోంది. –పరుచూరి వెంకట్రావు, జామరైతు, రేలంగి
Comments
Please login to add a commentAdd a comment