ఆదర్శ పాఠశాలలో బోధిస్తున్న ఉపాధ్యాయుడు
బద్వేలు : ఆదర్శ పాఠశాలల్లో పని చేసే గెస్ట్ ఉపాధ్యాయులు వేతనాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. పాఠశాలలు ప్రారంభమై నాలుగో నెల వచ్చినా ఇప్పటి వరకు జీతాల గురించి పట్టించుకునే నాథుడే లేరు. ఉత్తమ ఫలితాల కోసం కృషి చేసినా, తమ కష్టాన్ని ప్రభుత్వం గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అన్ని ఆదర్శ పాఠశాలల్లో ఇదే పరిస్థితి.
కాంట్రాక్టు ఉపాధ్యాయులుగానియమించాలని కోరుతున్నా..
ఆదర్శ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో పలు ఉపాధ్యాయ, అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పాఠ్యాంశాల బోధనలో విద్యార్థులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో గెస్ట్ ఉపాధ్యాయులు(టీజీటీ), అధ్యాపకులు(పీజీటీ)ను నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1100 మంది గెస్ట్ బోధకులుగా పని చేస్తుండగా.. జిల్లాలోని పది ఆదర్శ పాఠశాలల్లో 46 మంది వివిధ సబ్జెక్టులు బోధిస్తున్నారు. వీరు రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నారు. ఆదర్శ పాఠశాలల్లోని పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులు కార్పొరేట్ సంస్థల స్థాయిలో ఫలితాలు సాధించడంలో వీరి కృషి కూడా ఉంది. వీరికి ప్రస్తుతం ఉపాధ్యాయులకు రూ.12 వేలు, అధ్యాపకులకు రూ.13 వేల వంతున వేతనాలు ఇస్తున్నారు. దీంతోపాటు ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు మాత్రమే వేతనాలు ఇస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో గెస్ట్ బోధకులుగా నియమించినా.. ఇప్పటి వరకు వేతనాలు మాత్రం మంజూరు చేయలేదు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని వారు వాపోతున్నారు. పిల్లల చదువులు, ఇతర ఖర్చుల కోసం అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు తమకు జీతాలు పెంచాలని, కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా నియమించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు చెబుతున్నారు.
జీతాలు పెంచాలి
మాకు అతి తక్కువ మొత్తంలో జీతాలు ఇస్తున్నారు. కాంట్రాక్టు అధ్యాపకులకు రూ.20 వేల పైనే జీతాలు ఇస్తున్నారు. వారితో సమానంగా వి«ధులు నిర్వహిస్తున్నా జీతాలు మాత్రం పెంచడం లేదు. దీంతోపాటు నెలనెలా ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి.– దిలీప్‌కుమార్, పీజీటీ, నరసాపురం, కాశినాయన మండలం
Comments
Please login to add a commentAdd a comment