వైఎస్‌ఆర్ సీపీ నేతలపై ఖాకీల నిర్లక్ష్యం
అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై పోలీసుల నిర్లక్ష వైఖరి కొనసాగుతోంది. కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్‌ఆర్ సీపీ ఇంచార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేసినా ఖాకీలు కళ్లు తెరవడం లేదు.
గుంతకల్లు నియోజకవర్గ వైఎస్‌ఆర్ సీపీ సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి తుపాకీ లైసెన్సును పునరుద్ధరించేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. గడువుకు 25 రోజుల ముందే ఆయన దరఖాస్తు చేస్తుకున్నా స్పందించలేదు. తుపాకీ అప్పగించాలని ఆయనకు వజ్రకరూర్ పోలీసులు నోటీసు జారీ చేశారు. గడువుకు ముందే దరఖాస్తు చేసుకున్నా లైసెన్సు ఎందుకు రెన్యువల్ చేయడం లేదని వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరి సరికాదని పేర్కొన్నారు. తన తుపాకీ లైసెన్సును రెన్యువల్ చేయాలని కోరారు.
చెరుకులపాడు నారాయణ రెడ్డి తుపాకీ లైసెన్సు రెన్యువల్ చేయకపోవడంతో నిరాయుధిగా ఉన్న ఆయనను ప్రత్యర్థులు ఈ నెల 21 కిరాతంగా హత్య చేశారు. నారాయణరెడ్డితో పాటు ఆయన అనుచరుడు సాంబశివుడిని కూడా చంపేశారు.