విడివిడిగా ఎఫ్‌ఐఆర్‌లు పెట్టి త్వరితంగా విచారణ జరిపించాలి
డీజీపీ రవిగుప్తాకు మాజీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వ హయాంలో జరిగి న ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, దుబ్బాక ఎన్నికల ఇన్‌చార్జ్‌గా ఉన్న మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు అప్పటి కలెక్టర్ వెంకటరామి రెడ్డిని ముద్దాయిలుగా చేర్చి కేసులు పెట్టాలని డీజీపీ రవిగుప్తాకు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు విజ్ఞప్తి చేశారు. ఈ ముగ్గురిపై విడివిడిగా ఒక్కో ఎఫ్‌ఐఆర్ పెట్టి, ఈ కేసులపై వెంటనే విచారణ జరిపి త్వరితంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ వ్యవహారంపై స్పందించి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి, చీఫ్ జస్టిస్‌లకు కూడా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. దుబ్బా క ఉపఎన్నికతో పాటు, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తనతోపాటు, తన కుటుంబసభ్యుల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేయడంపై చర్యలు తీసు కోవాలని కోరుతూ బుధవారం డీజీపీ ఆఫీసులో రవిగుప్తాకు వినతిపత్రం సమర్పించాక రఘునందన్‌రావు మీడియాతో మాట్లాడారు.
ట్యాపింగ్‌పై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీని కోరానని, ఆవిధంగా జరగని పక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయిస్తానని చెప్పారు. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికలప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అరెస్ట్ అయిన ప్రణీత్‌రావు చెప్పినట్టు మీడియాలో వచ్చిందని, ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై చర్యలు తీసుకోవాలని డీజీపీకి విజ్ఞప్తి చేశామన్నారు. అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాలు లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగే ప్రసక్తే లేదని రఘునందన్ స్పష్టం చేశారు.
సినిమా పరిశ్రమలో ఉన్న వారితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లను కొందరు ట్యాపింగ్ చేసి బెదిరింపులతో డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. హైకోర్టు జడ్జీల ఫోన్ సంభాషణలు విన్నారని కూడా తెలుస్తోందని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలంగాణకు వస్తున్నందున ఆయనకు ఫోన్ ట్యాపింగ్ విషయం ఇక్కడి న్యాయమూర్తులు తెలియజేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment