ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై బీజేపీ సీరియస్‌ | Kishan Reddy Raghunandhan Rao Reaction On Phone Tapping Case | Sakshi
Sakshi News home page

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై బీజేపీ సీరియస్‌

Published Tue, Mar 26 2024 6:13 PM | Last Updated on Tue, Mar 26 2024 6:35 PM

Kishan Reddy Raghunandhan Rao Reaction On Phone Tapping Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో  ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం సంచలనం రేకెత్తిస్తోంది. రోజురోజుకీ కీలక మలుపులు తిరుగుతోంది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ అంశంపై  కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్‌ కిషన్‌ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో బాధ్యులు అప్పటి ముఖ్యమంత్రేనని పరోక్షంగా కేసీఆర్‌ను ఉద్ధేశిస్తూ వ్యాఖ్యానించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై న్యాయవిచారణ జరగాలని డిమాండ్‌ చేశారు.

బీజేపీ నేతల ఫోన్లూ ట్యాపింగ్‌
తమ ఆఫీసులో పనిచేసిన నేతలు, ఆఫీసు సిబ్బంది ఫోన్లు కూడా ట్యాపింగ్‌ జరిగినట్లు ఆధారాలు బయటపడుతున్నాయన్నారు కిషన్‌ రెడ్డి. 2019లో  బీజేపీ అధికారిక అకౌంట్‌ నుంచి డబ్బులు డ్రా చేసుకొని వెళ్తుంటే తమ కార్యాలయ సిబ్బందిని బంధించారని తెలిపారు. అప్పుడు ఫోన్‌ ట్యాపింగ్‌ చేసి తమ వాళ్లను బంధించారని పేర్కొన్నారు.

గత ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగిన అధికారులు ఈ కేసులో ఉన్నారని తెలిసిందన్నారు కిషన్‌ రెడ్డి. దేశ భద్రత, ఉగ్రవాద నిర్మూలన అంశాల్లో మాత్రమే అనుమతితో ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఉందన్నారు. అవినీతి, అధికారం కోసం ఫోన్ ట్యాపింగ్ చేయడం అతిపెద్ద నేరమని తెలిపారు. రాజకీయ నేతలవే కాకుండా వ్యాపారస్తుల ఫోన్ల ద్వారా వ్యక్తిగత విషయాలు ట్యాపింగ్‌ చేశారని విమర్శించారు. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారని మండిపడ్డారు

కవిత పాత్ర లేకపోతే బహిరంగ చర్చకు రావాలి
‘కవిత అక్రమ కేసులు పెట్టి అరెస్ట్‌ చేశారని కేటీఆర్‌ అంటున్నారు. కవిత ఢిల్లీ లిక్కర్‌ వ్యాపారంలో జోక్యం చేసుకున్నారా లేదా?. కేటీఆర్‌ ఆయన కుటుంబ సభ్యులు సమాధానం చెప్పాలి. షెల్ కంపెనీలు పెట్టీ బినామీ వ్యక్తుల్ని పెట్టరా లేదా..? ఆప్‌ ప్రభుత్వంతో కవిత చర్చలు జరిపారా లేదా? రూ. వందల కోట్లు చేతులు మారాయా లేదా? అని ప్రశ్నించారు. కవిత లిక్కర్ స్కాంపై కేసీఆర్ స్పందించాలి.క విత లిక్కర్ వ్యాపారానికి, అరెస్టుకు తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదు.

కేసీఆర్‌కు సవాల్‌
కవితది అక్రమ కేసు అనుకుంటే కేసీఆర్ బహిరంగ చర్చకు వస్తారా..?. కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అబద్ధాలు ఆడటంలో అగ్రగాములు. కడిగిన ముత్యంలా తిరిగి వస్తా అని కవిత అన్నారు.  ఎందులో కడిగించుకొని వస్తారో చెప్పాలి.  సికింద్రాబాద్‌కు కేంద్రమంత్రిగా ఎం చేశానో ప్రజలకు తెలుసు. కేటీఆర్‌కు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రావాలి. వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే’ అని కిషన్‌ రెడ్డి ధ్వజమెత్తారు.

ఫోన్‌ ట్యాపింగ్‌లో నేనూ బాధితుడినే: రఘునందన్‌ రావు
2 జూన్ 2014 తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ మొట్టమొదటి బాధితుడు ఇప్పటి సీఎం రేవంత్ , 2015 ఓటుకు నోటు కేసులో ఫోన్ ట్యాప్ చేసి ఆయన్ని అరెస్ట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ రెండో బాధితుడు రఘునందన్ రావు. బీజేపీ నేత BL సంతోష్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు. రేవంత్ రెడ్డికి సూటి ప్రశ్న వేస్తున్నా. ఈ కేసుపై సమగ్రమైన విచారణ జరుపుతారా? మీకు చిత్త శుద్ధి ఉందా సీఎం రేవంత్?. మీ బిడ్డ పెళ్లికి పేరోల్ మీద బయటికి వచ్చారు. మీరు అధికారులను ఎందుకు క్షమిస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత డీజీఏపీకి అటాచ్ అయిన శ్రీనాథ్ రెడ్డి ఎవరు? డీజీపీ మహేందర్ రెడ్డి రిటైర్ అయిన తర్వాత ఎక్కడున్నారు? 

కేసీఆర్‌@ A1 
అమెరికాకి ఇద్దరు వ్యక్తుల్ని ఎవరు పంపారు తెలియాలి. టెలిఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఎప్పుడు, ఏంతకు కొన్నారు తెలియాలి. సీఎం రేవంత్ దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలి. మీకు నచ్చినట్టు విచారణ జరిపిస్తే ఎలా? రఘునందన్ రావు దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేసినప్పుడు అప్పటి మంత్రి హరీష్ రావు, కేసీఆర్‌కు తెలియదా? ఈ కేసులో మొదటి ముద్దాయిగా మాజీ సీఎం కేసీఆర్‌ను పెట్టాలి. రెండో ముద్దాయి హరీష్ రావుని పెట్టాలి. మూడో ముద్దాయి అప్పటి జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి. ఆ తర్వాతే మిగతా పోలీస్ ఆఫీసర్లు.

మీ ఫోన్ ట్యాప్ చేయమని చెప్పిన కేసీఆర్‌ను ముద్దాయిగా చేర్చాలి. కుటుంబ సభ్యుల ఫోన్‌లు వినే అధికారం ఎవరికి లేదు. రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోవడానికి కారణం కేసీఆర్ చేసిన ఫోన్ ట్యాపింగ్. రెండో ముద్దాయి కేటీఆర్, మూడో ముద్దాయి హరీష్ రావు, నాలుగో ముద్దాయి జగదీష్ రెడ్డి. ఓ టీవీ ఛానెల్‌లో ఫోన్ ట్యాపింగ్ చేస్తారా ఇంతకీ దిగజారుతారా?. నేను బాధితుడిగా మాట్లాడుతున్నకేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ పాస్ పోర్టు  సీజ్ చేయాలి. 

రేవంత్‌తో హరీష్‌రావు విమాన ప్రయాణం?
నిన్న మాజీ మంత్రులు ముగ్గురు రహస్య సమావేశం అయ్యారు. కేసీఆర్ మాస్టర్ స్కెచ్ వేసి హరీష్ రావు కాంగ్రెస్‌లోకి  వెళ్తున్నాడని వార్తలు వస్తున్నాయి. 19 మార్చి రాత్రి 10.15కి సీఎం రేవంత్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఒకే విమానంలో ప్రయాణం చేశారు. విమానంలో రెండు గంటలు ఇద్దరు ఏం మాట్లాడారో తెలియాలి.  సీఎం రేవంత్, హరీష్ రావు మధ్య ఏం సంభాషణ జరిగింది. మెదక్ ఎంపీ కాంగ్రెస్ టికెట్ గురించి చర్చ జరిగిందా?. 26 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌లోకి వస్తాను అన్నావా?. మెదక్ ఎంపీ ఎన్నికల వరకు మా ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ లోకి తోసుకోకుమని చెప్పావా?. అసలేం మాట్లాడారో తెలియాలి.

సినిమా హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్‌
హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్‌లను అరెస్ట్ చేయాలి. ఎమ్మెల్సీ నవీన్ రావుని కూడా అరెస్ట్ చేయాలి. ఇప్పటికే ముగ్గురు విదేశాలకి పారిపోయారు అంటున్నారు. వీళ్ళని కూడా విదేశాలకు పొమ్మంటున్నారా?. 2015లో డీజీపీ ఎవరో అతన్ని విచారించాలి. హైకోర్టు జడ్జీలు, సినిమా హీరోయిన్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ఒక సంస్థ నుంచి ఎత్తుకు వచ్చారు. ఈ కేసులో అందరిని ముద్దాయిలుగా చేర్చాలి.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఫోన్‌లు సైతం..
ఈ కేసులో కొందరిని ఇరికించి కొందరిని కాపాడే కుట్ర జరుగుతుంది. సీఎం రేవంత్, డీజీపీ ఈ కేసును పూర్తిస్థాయిలో విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నా. నాకు నోటీస్‌లు పంపిస్తే నా దగ్గర ఉన్న ఆధారాలు సమర్పిస్తా. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కర్ణాటక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫోన్‌లు ట్యాప్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ కేసును వాడుకుంటారా నిజాలు తెలుస్తారా సీఎం చెప్పాలి. 

ట్యాపింగ్‌ జరగపోతే కేసీఆర్‌కు ఎలా తెలుస్తాయి?
బీఎల్‌ సంతోష్‌ను అనవసరంగా కేసులో ఇరికించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారుతాం అంటే కేసీఆర్ బెదిరించి ఇలా ప్లాన్ చేశారు. బీఎల్‌ సంతోష్ కేసులో ఆడియో, వీడియోలు కేసీఆర్ చూపెట్టారు. టెలిఫోన్ ట్యాపింగ్ జరగకపోతే ఇవన్నీ కేసీఆర్‌కు ఎలా తెలుస్తాయి? హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో ఈకేసుని విచారణ చేయాలి. సీబీఐపై నమ్మకం ఉంటే ఈ కేసుని సీబీఐకి అప్పగించాలి. అందరూ అధికారులు మళ్ళీ మీ చుట్టే చేరుతున్నారు సీఎం రేవంత్ జాగ్రత్తగా ఉండాలి’ అని రఘునందన్‌ రావు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement